తెలుగుదేశం పార్టీకి గుదిబండగా మారిన చంద్రబాబు 

Chandrababu has become a bulwark for the Telugu Desam Party
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పటిష్టమైన ప్రాంతీయపార్టీగా అవతరించింది బహుశా తెలుగుదేశం పార్టీయే కావచ్చు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించింది.  కాంగ్రెస్ పార్టీలో మొదటినుంచి రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం ఎక్కువ. వారు ఆంధ్రావారు కావచ్చు, రాయలసీమవారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు.  ఎవరైనా రెడ్లకే ముఖ్యమంత్రిత్వం ఎక్కువసార్లు దక్కింది. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, టంగుటూరి రామకృష్ణా రెడ్డి (అంజయ్య), భవనం వెంకట్రామ్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి…ఇలా అనేకసార్లు రెడ్డి కులస్తులకు అగ్రతాంబూలం దక్కింది.  ఇతర కులస్తులైన టంగుటూరి  ప్రకాశం పంతులు గారు, పీవీ నరసింహారావు, దామోదరం సంజీవయ్య స్వల్పకాలం మాత్రమే పాలించగలిగారు.  జలగం వెంగళరావు మాత్రమే పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు.  
 

Chandrababu has become a bulwark for the Telugu Desam Party

అప్పటికే వ్యాపారరంగంలోనూ, సినిమారంగంలోనూ ఆర్ధికంగా ఉన్నతస్థాయిలో ఉన్న కమ్మ సామాజికవర్గం వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించలేదు.  నాదెండ్ల భాస్కర రావు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కమ్మవారికి రాజ్యాధికారం దక్కదని గ్రహించిన కొందరు కమ్మ పెద్దలు ఎన్టీఆర్ ను ఎగదోసి ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ అవసరం గురించి వివరించి తెలుగుదేశం పార్టీని పెట్టించారు.  అంతకుముందు తనకో రాజ్యసభ సభ్యత్వం ఇస్తే శేషజీవితాన్ని హాయిగా గడుపుతానని ఎన్టీఆర్ ఒక ప్రముఖనేత ద్వారా ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడైన పీవీ నరసింహారావుకు కబురు పంపించారని, ముఖానికి రంగులు పూసుకునేవాడికి రాజకీయాలు ఏమిటని పీవీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. 
 
ఆ సమయంలో ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాదెండ్ల భాస్కర రావు మరికొందరు కమ్మ సామాజికవర్గంవారు ప్రోత్సహించగా తెలుగుదేశం పార్టీ జన్మించింది.  ఎన్టీఆర్ వరకూ కేవలం కమ్మ కులస్తులనే కాకుండా, అప్పటివరకు తన అరవై ఏళ్ల జీవితానుభవంతో అన్ని కులాలవారిని ఆదరించారు.  ఒకవేళ కొన్ని ఒత్తిడులకు లొంగి కమ్మవారిని ఎక్కువగా ప్రోత్సహించినప్పటికీ ఎన్టీఆర్ అందరికీ అవకాశాలు కల్పించారు.  అయితే రామోజీరావు, పర్వతనేని ఉపేంద్ర, మరికొందరు కమ్మ పెద్దల ఆర్భాటం, ఆభిజాత్యం, ఆధిక్యతాప్రదర్శనం, ఆర్ధిక ఎదుగుదల  చూసి  తెలుగుదేశం పార్టీకి “కమ్మ పార్టీ” అనే ముద్ర ఎన్టీఆర్ ఉన్నప్పుడే పడింది.  ఎన్టీఆర్ తీసుకొచ్చిన అనేక విప్లవాత్మక సంస్కరణలు….రైతులకు తక్కువ ధరకు విద్యుత్, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపిల్లలకు పుట్టింటివారి  ఆస్తిలో  హక్కు,  చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం, గ్రామాధికారుల వ్యవస్థ రద్దు, తెలుగుభాషకు పట్టం కట్టడం, ప్రజలవద్దకు పాలన..లాంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి ప్రాభవాన్ని పెంచడం ఒక ఎత్తైతే, వెనుకబడిన వర్గాల వారిని, ఎస్సీలు, ఎస్టీలు, నిరుపేదలకు రాజకీయ అవకాశాలు కల్పించడం, వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చెయ్యడం లాంటి చర్యలు తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులను ఏర్పరచాయి.  తమ కులస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కమ్మవారు చెలరేగిపోలేదు.  అక్కడక్కడా దళితులపై కొన్ని దాడులు జరిగినప్పటికీ, కమ్మవారికి చెడ్డపేరు అయితే రాలేదు.  ఎన్టీఆర్ పలుకుబడిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కమ్మవారు  దోచుకోలేదు.  ప్రజలకు కూడా వారంటే ఏహ్యభావం కలగలేదు.   అయితే ఎన్టీఆర్ ను తోలుబొమ్మను చేసి ఆడించి కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని, వ్యాపార సామ్రాజ్యాలు పెంచుకోవాలని కుతంత్రాలు రచించుకున్నవారు మాత్రం ఎన్టీఆర్ నిజాయితీ, ముక్కుసూటి  స్వభావాన్ని చూసి రగిలిపోయారు.  ఎన్టీఆర్ ను గద్దె దించకపోతే తమ ఆర్ధికసామ్రాజ్యాలు కుదేలైపోతాయని గ్రహించారు.  అప్పుడు వారికి చంద్రబాబు ఆశాదీపంలా గోచరించాడు.  కుటిలపన్నాగాలు, అవినీతి, కుతంత్రాల్లో ఆరితేరిన చంద్రబాబు మాత్రమే దానికి సమర్ధుడు అని కులపెద్దలు ఎన్టీఆర్ పతనం కోసం పధకాలు వేశారు.  వారి పధకాలు ఫలించి ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తరువాత కొద్దికాలానికే మానసిక క్షోభతో స్వర్గస్తుడు కావడంతో ఇక చంద్రబాబుకు, ఆయన ముఠాకు ఎదురులేకుండా పోయింది.  పేదవర్గాలవారు, అణగారినవర్గాలవారికి చంద్రబాబు హయాంలో మొండిచేయి మాత్రమే ఎదురైంది.  ఎవరు వందకోట్లు ఇస్తే వారికి రాజ్యసభ సభ్యత్వాలు, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు దక్కడంతో కమ్మవారు ఆర్ధికంగా ఎదిగిపోయారు.  సుజనాచౌదరి లాంటి వారు ఆరేడువేలకోట్ల రూపాయలు బ్యాంకులకు శఠగోపం పెట్టినా, రాయపాటి సాంబశివరావు లాంటివారు పదివేలకోట్ల రూపాయల అక్రమాలు చేసినా అది కేవలం చంద్రబాబు అండ చూసుకుని మాత్రమే.  
 
చంద్రబాబు చుట్టూ ధనిక కమ్మలు కోటరీగా ఏర్పడి దోచుకోవడం మొదలుపెట్టారు.  చంద్రబాబుకు కులాభిమానం విపరీతం.  అలాగని ఆయన అందరు కమ్మవారిని అభిమానిస్తారంటే పప్పులో కాలు వేసినట్లే.  ఆయనకు కోట్లాధిపతులైన కమ్మవారంటేనే ఇష్టం.  చంద్రబాబు దోపిడీ కారణంగా కమ్మకులస్తులు అందరూ దోపిడీ చేసేవారనే దురభిప్రాయం సమాజంలో పెరిగింది.  చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించడం కూడా కేవలం తమ కులస్తుల ప్రయోజనం కోసమే అనే అపోహలు ప్రబలాయి.  నిజానికి అమరావతి ప్రాంతంలో ఉన్న కమ్మవారంతా కోటీశ్వరులు కారు.  వారిలో కూడా కూలీనాలీ చేసుకుని జీవించేవారు ఉన్నారు.  కానీ ఆ ప్రాంతానికి “కమ్మరావతి” అనే పేరు వచ్చిందంటే చంద్రబాబు దోపిడీలో పాలుపంచుకున్నవారిలో కమ్మవారే ఎక్కువగా ఉండటం!  
 
చంద్రబాబు కారణంగా తమ కులం మొత్తానికి అపకీర్తి వచ్చిందని, తాము సమాజసేవలో భాగంగా విద్యాసంస్థలు, వ్యాపారాలు, పరిశ్రమలు, వ్యవసాయం,  కళారంగాలలో కష్టించి పనిచేస్తూ లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, చంద్రబాబు చేష్టల వలన తాము అంటరానివారిగా మిగిలిపోతున్నామనే వెరపు కలగటం మొదలైంది.  ఆ ఫలితంగానే రాజధాని ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది.  ముఖ్యమంత్రి కుమారుడుగా, మంత్రిపదవిలో ఉండగా పోటీచేసిన లోకేష్ నాయుడు మంగళగిరిలోనే ఓడిపోయాడంటే చంద్రబాబును సామాన్య కమ్మవారు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  
 
చంద్రబాబు ఉండగా ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని, కమ్మవారికి చెడ్డపేరు రావడం ఆగదని వారు రియలైజ్ అవుతున్నారు.  లోకేష్ ఇప్పటికే పరమశుంఠగా ప్రఖ్యాతుడు కావడంతో  చంద్రబాబు తరువాత లోకేష్ చేతుల్లోకి తెలుగుదేశం వెళ్ళిపోతే ఇక తెలుగుదేశం సమాధి అయినట్లే అని కమ్మకులపెద్దలు ఇప్పటికే నిశ్చయానికి వచ్చారని భోగట్టా.  అలాగే ధనిక కమ్మ కులస్తులకు కూడా చంద్రబాబు అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు.  కేవలం తమ అవినీతికి చంద్రబాబు తోడ్పాటు అందిస్తాడని, వివిధ వ్యవస్థలనుంచి రక్షిస్తాడనే నమ్మకంతోనే చంద్రబాబు వెంట ఉంటున్నారు.  పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం చంద్రబాబుకు ఇక సాధ్యం కాదనే విశ్వాసం ఏర్పడిన తరువాత చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా తప్పించి మళ్ళీ నందమూరి కుటుంబం చేతుల్లో పార్టీని పెట్టడానికి వెనుకాడరు.  ఎన్టీఆర్ నే సింహాసనం నుంచి కిందకు కూలదోసినవారికి చంద్రబాబు వెంట్రుకముక్కతో సమానం.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు