ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. హైకోర్టులో విచారణ వంటి అంశాలను పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ… వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, గత ఎన్నికల్లో 150కి పైగా సీట్లతో ఏడింట ఆరొంతుల మెజార్టీ సాధించి, 2024లోను మళ్లీ అధికారం చేజిక్కించుకునేలా మంచి పాలన చేస్తున్న జగన్‌పై కుట్ర చేస్తున్నట్లుగా వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, వైసీపీ కేడర్ తెలుగుదేశం పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే అయితే ఫిర్యాదు చేయాలని, పత్రికలకు ఎక్కడం ఏమిటనీ, అదీ తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడిన వారికే ఈ విషయాలు తెలియడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.
చంద్రబాబు ట్యాపింగ్ అస్త్రం!
ఫోన్ ట్యాపింగ్ పేరును చంద్రబాబు నాయుడు ఉపయోగించడం ఇదేమీ మొదటిసారి కాదని, గతంలోను తాను సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ అస్త్రాలు ఉపయోగించుకున్నారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఓటుకు నోటు సంచలనం సృష్టించింది. ఆ సమయంలోను తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేశారని చంద్రబాబు ఆరోపణలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఏ దారిలేక ఈ కొత్త కుట్రకు తెరలేపినట్లుగా కనిపిస్తోందని చెవులు కొరుక్కుంటున్నారు. విద్యుత్ ఒప్పందాల నుండి మూడు రాజధానుల అంశం వరకు ఏ విషయంలోను ప్రభుత్వాన్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ, పూర్తిగా ఫలప్రదం కాలేదని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని, అందుకే మరో అంశాన్ని ముందుకు తెచ్చిందని అంటున్నారు.
ప్రశ్నల వర్షం
ట్యాపింగ్ మీద ఎక్కడి నుండి సమాచారం వచ్చింది? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ కథనాన్ని ఏ ఆధారంతో రాశారు? న్యాయమూర్తుల కదలికలపై కూడా నిఘా పెట్టారని చెబుతున్నారని, ఇందుకు సంబంధించి వివరాలు ఏమిటో చెప్పలేరా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆరోపణలకు బదులు ఫిర్యాదు చేయాలని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో మీ మనీ ల్యాండరింగ్ వ్యవహారం బయటపడుతుందని భయపడుతున్నారా లేదా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా, ఆధారాలు ఉంటే డీజీపీకి ఇవ్వండి అంటూ హోంమంత్రి సుచరిత సూటిగా సవాల్ విసిరారు.
అవసరం కోసం.. మళ్లీ మోడీ రూట్లోకి..
ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని రాష్ట్రానికి రానీయమని చెప్పిన ఇదే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏపీలోని అంశాల గురించి వరుసగా ప్రధాని మోడీకి, కేంద్రానికి లేఖలు రాయడంపై ప్రజలు నోరెళ్లబెడుతున్నారని అంటున్నారు. పీపీఏలు, రాజధాని సహా పలు అంశాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది… డిమాండ్ చేస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ గురించి మోడీని ఉద్దేశించి చంద్రబాబు ‘మీ సమర్థ, శక్తిమంతమైన నాయకత్వంలో దేశం భద్రంగా ఉంది. కనీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రూపంలో మొదలైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దేశభద్రతకే ముప్పుగా పరిణమించనున్నాయి’ అంటూ మోడీని ప్రశంసించిన తీరుపై బీజేపీ కేడర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందట. సోషల్ మీడియాలోను సెటైర్లు కనిపిస్తున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సీబీఐని నిరాకరించిన అదే చంద్రబాబు, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణలు జరిపించాలని చెప్పడమే కాకుండా, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించడం అందరూ గమనిస్తున్నారని వైసీపీ అంటోంది.
మరో విషయం ఏమంటే ఓ మాజీ సీఎం… ప్రధాని వంటి వ్యక్తికి రాసిన లేఖలో ఒక్క ఆధారం చూపలేదని, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారో చెప్పలేదని అంటున్నారు. ప్రయివేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పరికరాలను ఉపయోగించే ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేస్తున్నట్లు తెలుస్తోందని, ఇలాంటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆధారాలు సమర్పిస్తే ఇక్కడే విచారణ జరిపి తేలుస్తారని గుర్తు చేస్తున్నారు. కానీ అలా చేయడం లేదని, దీంతోనే తెలుగుదేశం పార్టీ ఇంటెన్షన్ ఏమిటో ఇట్టే తెలిసిపోతోందని అంటున్నారు. మొత్తానికి కట్టుకథలతో మొదటి నుండి జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పీపీఏలు, మూడు రాజధానుల అంశం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్.. ఇలా అన్నింటా టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ పట్ల జగన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.