డామిట్ కథ అడ్డం తిరిగింది

Chandrababu could not digest the change in Nimmagadda
నిన్నటిదాకా ఆయన ప్రజాస్వామ్య పరిరక్షకుడు. రాజ్యాంగ విధి నిర్వహణలో ఎవ్వరినీ లెక్క చేయనివాడు.  ప్రభుత్వ దుశ్చర్యలను తప్పు పడుతూ కోర్టుకు ఈడ్చి దాదాపు అన్నిచోట్లా విజయాన్ని సాధించినవారు.  తన నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రభుత్వాధికారులను గజగజ వణికించినవాడు. అధికారపార్టీ దౌర్జన్యాలను అరచేతిని అడ్డుపెట్టి విపక్ష అభ్యర్థులను కాపాడినవాడు. ఆయన ఉండగా విపక్ష పార్టీలవారు నిర్భయంగా నామినేషన్లు వెయ్యవచ్చు. బలవంతపు ఏకగ్రీవాలను సహించడు. చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభినవ శేషన్ అంటూ ఆయన భజన పత్రికలు నిమ్మగడ్డను ఆకాశానికి ఎత్తేశాయి. నిమ్మగడ్డ నేతృత్వంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని, జగన్మోహన్ రెడ్డి ఆగడాలు ఆయన ముందు సాగవని నిమ్మగడ్డకు డప్పులు కొట్టారు తెలుగుదేశం వారు.  
 
Chandrababu could not digest the change in Nimmagadda
Chandrababu could not digest the change in Nimmagadda
 
కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికే వణికిపోయి, దాదాపు ఎనిమిది నెలలపాటు తెలంగాణాలో తాను నిర్మించుకున్న మూడు వందల కోట్ల రూపాయల రాజభవనంలో కుటుంబంతో సేదదీరుతూ జూమ్ యాప్ ఉపయోగించుకుని వందిమాగధులు చెప్పే తియ్యని మాటలు వింటూ ఏడాదికాలంలోనే జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రబలిందని, చంద్రబాబు మీద అభిమానం పర్వతంలా పెరిగిందనే భ్రమల్లో మునిగిపోయారు చంద్రబాబు.  అందుకే తన అయిదేళ్ల పాలనలో కనీసం ప్రయత్నం కూడా చెయ్యని స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని నిమ్మగడ్డ మీద ఒత్తిడి తీసుకొచ్చారు.  కానీ, కొంత ప్రక్రియ కాగానే ఎన్నికలన్నీ వైసిపి తరపున ఏకపక్షం అవుతున్నాయనే వాస్తవాన్ని గ్రహించి కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేయించారు.  తమ అభిమాన అధికారయిన నిమ్మగడ్డ పదవీకాలం ముగియబోతుండటంతో ఆయన “సహకారం” తో ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రాబట్టాలని విశ్వప్రయత్నాలు చేశారు చంద్రబాబు.  
 
నిమ్మగడ్డ కూడా  న్యాయస్థానాలు ఇచ్చిన కొన్ని తీర్పులతో తనకు అంతులేని అధికారాలు ఉన్నాయని, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, అధికారులు అందరూ తనకు అణిగిమణిగి పడివుండాలని, తన మాటే శాసనం అని అహంకరించారు.  తెలుగుదేశం నాయకులు, వారి క్షుద్రమీడియా కూడా నిమ్మగడ్డకు తెరచాటున సహకరించి  నిమ్మగడ్డను ఒక వీరయోధుడుగా చిత్రీకరించారు.  అయితే అనూహ్యంగా ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలనుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగలడం మొదలు కావడంతో నిమ్మగడ్డ కూడా ఖంగు తిన్నారు.  ప్రభుత్వ అధికారుల మీద, మంత్రులు, ఎమ్మెల్యేల మీద నిమ్మగడ్డ తీసుకున్న క్రమశిక్షణ చర్యలు న్యాయపాలిక ముందు నిలబడలేదు.  దానికితోడు నిమ్మగడ్డ మీద ప్రివిలేజ్ కమిటీ విచారణ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా  కనిపించడమే కాక, నిమ్మగడ్డ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడంతో నిమ్మగడ్డకు మైండ్ బ్లాంక్ అయింది.   తాను ఎంత ప్రయత్నించినా ఎనభై శాతానికి పైగా పంచాయితీలు వైసిపి వశం కావడంతో నిమ్మగడ్డకు దిక్కు తోచలేదు.  చంద్రబాబును నమ్ముకుని ఇంకా వేషాలు వేస్తే  పదవి పోయాక తనకు గడ్డిపోచ విలువ కూడా ఉండదని, ఇప్పుడు తనను ఎగదోసేవారు తనకు వెంట్రుకముక్క విలువ కూడా ఇవ్వరని గ్రహించారు.  దాంతో రాజీ ధోరణిలోకి దిగారు.  గవర్నర్ కూడా నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి కూడా హితబోధ చేశారని అంటున్నారు.  తత్ఫలితమే ప్రభుత్వాధికారులను పిలిపించుకుని నిమ్మగడ్డ ప్రశంసించడం, మిగిలిన మూడు విడతలు కూడా ఇదేవిధంగా సహకరించాలని కోరడం, అందుకు అధికారులు అంగీకరించడం జరిగిపోయాయి.  అలాగే నిమ్మగడ్డపై విమర్శలు తగ్గించాలని కూడా తన పార్టీవారికి, మంత్రులకు ఆదేశాలు వెళ్లాయట. అంతేకాకుండా ఏకగ్రీవాలను నిమ్మగడ్డ అనుమతించరని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఏకగ్రీవాలను అనుమతించడం తెలుగుదేశం పార్టీకి తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కూడా కలిగించాయి.  
 
నిమ్మగడ్డలో వచ్చిన మార్పును ఏమాత్రం జీర్ణించుకోలేని చంద్రబాబు ఇంతకాలం తాను నమ్మిన నిమ్మగడ్డపై కూడా నిప్పుల వర్షం కురిపించారు.  ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల కమీషన్ విఫలం అయిందని ఆక్రోశించారు.  ఆ మేరకు ఆయన కేంద్ర హోమ్ మంత్రికి లేఖను కూడా వ్రాశారు.  చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ఇప్పుడైనా నిమ్మగడ్డకు అర్ధమై ఉండాలి.   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు