పిరికితనాన్ని ప్రదర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Chandrababu and Pawan Kalyan showed cowardice
 మనకు తెలుగుదేశం పార్టీ అని పిలువబడే జాతీయ పార్టీ ఒకటుంది.  సాధారణంగా జాతీయపార్టీ అంటే దేశం మొత్తం తెలిసిన పార్టీ, ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికి కలిగిన పార్టీ అనుకుంటాము.  కానీ, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా  కనిపించని తెలుగుదేశం మాత్రం ఏకంగా జాతీయ పార్టీ అని చెప్పేసుకుంటుంది.  తెలుగుదేశం జాతీయపార్టీ అంటూ చంద్రబాబు భజన మీడియా పొద్దస్తమానం స్తోత్రాలు చేస్తుంటుంది.  మొన్ననే చంద్రబాబు ప్రకటించిన జంబో జెట్ కార్యవర్గాన్ని చూసి ఆ నాయకులే ఖంగు తిని ఉంటారు  అసలు ఇంతమంది కార్యవర్గం జాతీయపార్టీగా అధికారంలో ఉన్న బీజేపీకి అయినా ఉంటుందా లేదా అని!   డజన్లకొద్దీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సాధారణ సభ్యులు చంద్రబాబు ప్రకటించిన జంబోజెట్లో ఉన్నారు.  రాష్ట్రంలో ఉన్నవి పదమూడు జిల్లాలు, గెలిచిన స్థానాలు కేవలం ఇరవై మూడు.  దానికోసం  రెండు రాష్ట్రాల్లో విడివిడిగా అధ్యక్షులు,  కార్యదర్శులు, ఉపకార్యదర్శులు, మళ్ళీ వీరందరిమీద జాతీయాధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి!   
Chandrababu and Pawan Kalyan showed cowardice
Chandrababu and Pawan Kalyan showed cowardice
 
మరి ఇంతపెద్ద కార్యవర్గం కలిగిన తెలుగుదేశం పార్టీ మొన్న తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టిందా?  పోనీ, నిలబెట్టాలని ప్రయత్నించిందా?  ఎందుకని?  అభ్యర్థి దొరకలేదా?  అధికారికంగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఒకరు జారుకున్నారు.  ఇంకా మరొకరు ఉన్నారు.  మరి దుబ్బాకలో ఎందుకు పోటీ చెయ్యలేదు?  పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో పోటీ చేసే చేవ లేనపుడు తెలుగుదేశం జాతీయపార్టీ అవుతుందా?  నాలుగైదు రాష్ట్రాల్లో పోటీ చేసే మజ్లీస్ పార్టీ తాను జాతీయపార్టీ అని చెప్పుకోదు.  మజ్లీస్ పార్టీకి మహారాష్ట్రలో ఎమ్మెల్యే ఉన్నాడు.  మొన్న బీహార్ ఎన్నికల్లో అయిదుగురు మజ్లీస్ అభ్యర్థులు గెలిచారు.  ఎక్కడ తెలంగాణ?  ఎక్కడ బీహార్!  
 
తెలుగుదేశం పార్టీ దుబ్బాకలో ఎందుకు పోటీ చెయ్యలేకపోయింది?  కారణం బహిరంగ రహస్యమే.  కేసీఆర్ పేరు వింటే చంద్రబాబుకు నరాలు వణికిపోతాయి.  ఓటుకు నోటు కేసు మళ్ళీ ఉధృతం అవుతుంది.  చంద్రబాబు వేలకోట్ల రూపాయల ఆస్తులు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి.  ఆయన హెరిటేజ్ హెడ్డాఫీస్ తెలంగాణలోనే ఉంది.  ఆయన మూడు వందలకోట్ల రూపాయల రాజభవనం తెలంగాణలోనే ఉంది.  కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా అంతే సంగతులు!  పోటీ చెయ్యలేదు సరే…కనీసం బీజేపీకి మద్దతు అయినా ప్రకటించవచ్చు కదా!   పోనీ జాతీయ ప్రధాన కార్యదర్శి పండితపుత్రుడు లోకేష్ నాయుడి నుదుట వీరతిలకం దిద్ది దుబ్బాక సమరాంగణంలోకి పంపించి ఉండవచ్చు కదా!   కేసీఆర్ పేరు వినపడితేనే ఆ ఉత్తరకుమారుడికి కూసాలు కదిలిపోతాయి మరి!   గత ఏడాదిన్నరగా మోడీ దయాదాక్షిణ్యాల కోసం తహతహలాడుతున్న చంద్రబాబు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని ఒక్క మాట మాట్లాడితే  మోడీ దర్శనం దొరికి ఉండేది కదా!  ఒకప్పుడు    తెలంగాణాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ దుబ్బాక ఉపఎన్నిక అంటే ఎందుకంత భయపడింది?  మరి తెలుగుదేశం జాతీయపార్టీయా!  నవ్విపోరూ చెప్పుకుంటే?  
 
ఇక  జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ సంగతి చూద్దాం.  జనసేన జన్మించింది తెలంగాణలోనే.  మొన్న మొన్నటిదాకా కేసీఆర్ తాటతీస్తాను, తోలు వలుస్తాను అంటూ హద్దులు మీరు మాట్లాడారు పవన్.  తెలంగాణాలో పవన్ కళ్యాణ్ కు బోలెడంతమంది అభిమానులు ఉన్నారు.  మరి దుబ్బాకలో పోటీ చెయ్యడానికి నడుము లేవలేదేమిటి?  పోనీ, పోటీ చెయ్యలేదు…బీజేపీతో అధికారికంగా జనసేనకు పొత్తు ఉన్నది కదా!  మరి కనీసం బీజేపీ అభ్యర్థి రఘునందనరావు కోసం దుబ్బాకలో దూకి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చెయ్యలేదు?  ఒకవేళ టీఆరెస్ గెలిస్తే ఆ తరువాత తన తోలు వలుస్తుందని వణికిపోయి ఉంటాడు…తెలంగాణలోని  తన ఫార్మ్ హౌసులు స్మశానాలుగా మారిపోతాయని భయపడి ఉంటాడు.  దుబ్బాకలో ప్రచారం చెయ్యమని బీజేపీ కోరినప్పటికీ పవన్ ఎందుకు సాహసించలేదు?  ఏ ఒక్క రోజైనా రఘునందనరావు కోసం ప్రచారం చేసిఉన్నట్లయితే ఈపాటికి మోడీ పక్కన నిలబడి ఉండేవాడు పవన్ కళ్యాణ్!  ఎంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నాడు!  
 
రాజకీయాలు వీరులకే కానీ పిరికిపందలకు కాదు.  హైదరాబాదులో కూర్చుని  జగన్ మీద విమర్శలు గుప్పించడం తప్ప చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహా పిరికివారని ఈ  దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా తేలిపోయింది!  పోరాటయోధులకు మాత్రమే అవసరమైన రాజకీయ రణక్షేత్రం ఇలాంటి భీరువులకు అవసరమా?  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు