జనసేన, జేడీఎస్..! ఈ పోలిక సబబేనా.?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఓ పాతిక నుంచి ముప్ఫయ్ వరకు సీట్లు దక్కించుకోవచ్చునట.! ఒకవేళ బీజేపీ – కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలకూ సోలోగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు అవసరమయ్యే సీట్లు దక్కకపోతే, అప్పుడు జేడీఎస్ పాత్ర కీలకమవుతుంది.

గతంలో కూడా ఇలాగే జరిగింది. జేడీఎస్ చక్రం తిప్పింది కూడా.! అక్కడ జేడీఎస్.. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన.. అంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన అను‘కుల’ మీడియా ఓ విశ్లేషణ షురూ చేసింది. ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది పరిస్థితి.

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుంటుందన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైనాట్ 175 అంటోంది వైసీపీ. ఈసారి అధికారం తమదేనంటోంది టీడీపీ. వైసీపీ కనిపించినంత ధీమాగా టీడీపీ కనిపించడంలేదు.

జనసేన మద్దతు తీసుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నది టీడీపీ వ్యూహం. జనసేనకు ఓటు బ్యాంకు పెరిగింది 2019 ఎన్నికలతో పోల్చితే. అయినాగానీ, సోలోగా పోటీ చేస్తే ఓ పది సీట్లు కూడా జనసేనకు వచ్చే అవకాశం లేదనే చర్చ ఒకటి వుంది.

టీడీపీ – జనసేన కలిస్తే గనుక, టీడీపీ ఇచ్చే సీట్లను బట్టి జనసేన రెండంకెల స్కోరుని టచ్ చేసే అవకాశాల్లేకపోలేదు. అలాంటప్పుడు, జనసేన ఎలా ఏపీ రాజకీయాల్ని శాసించగలుగుతుంది.?