కొత్త స్నేహితుడి కోసం వెతుకుతున్న బీఆర్ఎస్.!

105 సీట్లలో గెలిచేస్తామని అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.! నిజమేనా.? తెలంగాణలో ఆ పరిస్థితులు వున్నాయా.? ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడేమో భారత్ రాష్ట్ర సమితిగా మారిందాయె.! సో, తెలంగాణ సమాజంతో కనెక్టివిటీ సమస్యలు కొత్తగా వచ్చి పడుతున్నాయి గులాబీ పార్టీకి.

బయట నుంచి మద్దతిస్తున్న మజ్లిస్ పార్టీని గుడ్డిగా నమ్మేయలేని పరిస్థితి భారత్ రాష్ట్ర సమితికి వుంది. జాతీయ రాజకీయాల కోసం మజ్లిస్ అవసరం గులాబీ పార్టీకి వుంది. ఈ లెక్కన తెలంగాణలోనూ ఆ మజ్లిస్ కోసం కొత్తగా త్యాగాలు చేయాల్సి రావొచ్చు.

మజ్లిస్ సంగతి పక్కన పెడితే, ఇంకో కొత్త మిత్రుడి అవసరాన్ని గుర్తించిన గులాబీ బాస్, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారట. తెలంగాణలో కేసీయారే కింగు.. ఆయనకి కొత్త స్నేహం అవసరమేంటి.? అంటే, రాజకీయాల్లో తప్పదు.. సమయం సందర్భాన్ని బట్టి ఎవర్నయినా కలుపుకుపోవాల్సి రావొచ్చు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీతోనో, జనసేన పార్టీతోనో, తెలుగుదేశం పార్టీతోనో.. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతోనో.. ఇలా గులాబీ పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటూ, తెలంగాణ మంత్రి కేటీయార్‌కి సన్నిహితుడే. షర్మిలతో కలవడానికీ బీఆర్ఎస్ పెద్దగా మీనమేషాల్లెక్కించకపోవచ్చు.

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే, కొత్త మిత్రుల అవసరం తప్పేలా లేదు గులాబీ పార్టీకి అన్నది ప్రస్తుతం వున్న ఈక్వేషన్.!