BRS KCR: కేసీఆర్ ఉప ఎన్నిక జోస్యం: కాన్ఫిడెన్స్ మాములుగా లేదు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరుగుతోంది. చాలా కాలం తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉప ఎన్నికలు తప్పవని, అందులో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకసారి ఓడిపోవడం బీఆర్ఎస్ తరఫున ఎలాంటి లోటు కాదని, త్వరలోనే పునరాగమనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల్లో వారి పట్ల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని, ఇంత త్వరగా ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగిందని, ఇప్పుడు కూడా అదే అధికారులు ఉన్నా, సరైన నాయకత్వం లేకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకబాటుకు వెళ్లిపోతోందని, అభివృద్ధి అంతా ఆగిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యమని, మరోసారి వలసదారుల పాలనకు తెలంగాణను అప్పగించరాదని స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గెలుపు దక్కదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి పగ్గాలు చేపడుతుందని జోస్యం చెప్పారు.

కేసీఆర్, కార్యకర్తలంతా ప్రజా సమస్యలపై గళం వినిపించాలంటూ పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, జిల్లా కేంద్రాల్లో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సమావేశం చివర్లో కేసీఆర్, బీఆర్ఎస్ తెలంగాణ అస్థిత్వం కోసం ఏర్పడిన పార్టీ అని, ఆ లక్ష్యం మరింత బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ పాత గాయాలను మూసుకుపెట్టుకునే పరిస్థితిలో ఉందని, ఆ దశలోకి వెళ్లకుండా ప్రజలు బీఆర్ఎస్ ను మళ్లీ విశ్వసించాలని కోరారు.

జగన్ ను చూసి చిన్నారి || YS Jagan Craze at Vijayawada || Little Girl Selfie with YS Jagan || TR