సెప్టెంబర్ 7న రక్త చంద్రగ్రహణం.. గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!

భాద్రపద పౌర్ణమి ఈసారి ప్రత్యేకమైంది. ఎందుకంటే సెప్టెంబర్ 7న రాత్రి ఆకాశంలో అరుదైన రక్త చంద్రగ్రహణం (Blood Moon) కనువిందు చేయనుంది. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, ఫిజీ, అంటార్కిటికాలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో సంభవించబోతున్న ఈ గ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.26 గంటలకు ముగియనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. రాహుగ్రస్త చంద్రుడు ఎర్రటి కాంతి వెదజల్లుతూ కనువిందు చేయడంతో దీనిని “బ్లడ్ మూన్” అని పిలుస్తారు.

అయితే ఆధ్యాత్మికంగా, జ్యోతిషశాస్త్ర పరంగా గ్రహణం అత్యంత ప్రభావం చూపుతుందని భావిస్తారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపే ఆహారం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తర్వాత వంట సరుకులు, తాగునీరు, దేవతా విగ్రహాలపై దర్భలు ఉంచడం శ్రేయస్కరమని అంటున్నారు.

ఇదీ చదవండి: తులసి మొక్కను ఇలా పూజిస్తే దరిద్రం దరికి చేరదు.. లక్ష్మీ కటాక్షం మీదే..!

ఇక గర్భిణీలు రాత్రిపూట ఇంటి బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. కాళ్లపై కాళ్లు వేసుకుని కూర్చోకుండా నిటారుగా కూర్చోవాలని చెబుతున్నారు. ఒక వైపు తిరిగి పడుకోవడం మంచిది కాదని అంటున్నారు. మధ్య మధ్యలో మెల్లగా నీరు తాగుతూ ఉండాలని అంటున్నారు. ఆకలిగా ఉంటే లైట్ జ్యూసులు లేదా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలంట. శరీరానికి విశ్రాంతినిచ్చేలా నిశ్శబ్దంగా ఉండడం అవసరమని పేర్కొంటున్నారు.

గ్రహణం మొదలయ్యే ముందు పట్టు స్నానం, తర్వాత గ్రహణం ముగిసిన వెంటనే మరొకసారి స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు. రాత్రిపూట ఎక్కువగా ద్రవపదార్థాలనే ఆహారంగా తీసుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. మరుసటి రోజు గ్రహణ దోషం ఉన్న రాశులవారు ప్రత్యేక శాంతి పూజలు చేయడం అవసరం. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈసారి చంద్రగ్రహణం మీనం, మిథునం, కుంభం, సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చని చెబుతున్నారు. ఈ రాశివారు గ్రహణాన్ని చూడకపోవడం ఉత్తమం. అలాగే మరుసటి రోజు దానం, ధర్మకార్యాలు చేస్తే దోషం నివారణ అవుతుందని విశ్వాసం ఉంది.

ఈ రక్త చంద్రగ్రహణం శాస్త్రపరంగా అద్భుత దృశ్యం కాని, ఆధ్యాత్మికంగా పలు నమ్మకాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల భక్తులు, గర్భిణులు పండితులు సూచించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా గ్రహణాన్ని శుభప్రదంగా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం పండితుల అభిప్రాయం ప్రకారం రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)