Blood Group :ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. న్యూ స్టడీ లో షాకింగ్ నిజం..!

బ్లడ్ గ్రూప్ అనేది సాధారణంగా రక్తదానం లేదా సర్జరీల్లో సమయంలోనే ఎక్కువగా చర్చకు వస్తుంది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న కొత్త నిజం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మన రక్త రకం మన ఆరోగ్యం మీద కూడా పరోక్షంగా ప్రభావం చూపిస్తుందట. ముఖ్యంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో స్ట్రోక్ వచ్చే అవకాశాలపై రక్త రకం ప్రభావం చూపుతుందని 2022లో అమెరికా, యూరప్, ఆసియా దేశాల శాస్త్రవేత్తలు చేసిన పెద్ద స్థాయి పరిశోధన తేల్చింది.

ఈ మెటా స్టడీలో దాదాపు 17,000 మంది యువతలో స్ట్రోక్ వచ్చినవారిని 6 లక్షల మంది ఆరోగ్యవంతులతో పోల్చి పరిశీలించారు. ఫలితంగా బ్లడ్ గ్రూప్ ‘A’ కలిగినవారికి 60 ఏళ్లకు ముందే ఇస్కీమిక్ స్ట్రోక్ (రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకు రక్తప్రవాహం ఆగిపోవడం) వచ్చే అవకాశం 16% ఎక్కువగా ఉందని గుర్తించారు.
వైపు చూడగా ‘O’ గ్రూప్ ఉన్నవారికి ఇదే ప్రమాదం 12% తక్కువ. B గ్రూప్ వారికి వయసుతో సంబంధం లేకుండా 11% ఎక్కువ రిస్క్ ఉంటుందని తేలింది. ‘AB’ గ్రూప్ వారికి ఈ ప్రమాదం తక్కువే కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం పెరుగుతుంది.

ఇందుకు కారణం ఏమిటంటే A, B గ్రూప్‌ల్లో వాన్ విల్లెబ్రాండ్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ VIII అనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం. ఇవి రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తాయి. గడ్డకట్టే అవకాశం ఎక్కువైతే, ఆ క్లాట్ మెదడుకు చేరితే అదే స్ట్రోక్ కు కారణమవుతుంది. అయితే కేవలం బ్లడ్ గ్రూప్ వల్లే స్ట్రోక్ వస్తుందనుకోవడం సరి కాదు. అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, మోటాపు ఇవే ప్రధానంగా రిస్క్‌ను పెంచుతాయి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారికి రిస్క్ బ్లడ్ గ్రూప్ రిస్క్ కంటే పలు రెట్లు ఎక్కువ.

కాబట్టి ‘‘గ్రూప్ A ఉన్నవారికి ఎలాంటి అదనపు పరీక్షలు తప్పనిసరి కాదు, కానీ ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, బీపీ-షుగర్ కంట్రోల్ తప్పనిసరి’’ అని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ‘‘రక్తంలో పవర్ ఉంది’’ అనే సినిమా డైలాగ్‌ మాత్రమే కాదు… రక్తంలో ఏ గ్రూప్ ఉందో కూడా గుర్తు పెట్టుకోవడం తప్పదు. కానీ నిజానికి జీవనశైలే అసలైన సూపర్ పవర్ అని మాత్రం మర్చిపోకండి.