కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేయనున్న బీజేపీ.?

BJP to overthrow KCR government?

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్లాన్‌ బీజేపీ చేస్తోందా.? బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటల్ని చూస్తోంటే అది నిజమేనేమో అన్న అనుమానం కలగకమానదు. ఇందులో అనుమానమేమీ లేదు, బండి సంజయ్‌ చాలా క్లియర్‌గా ఈ విషయాన్ని స్పష్టం చేసేశారు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం కుప్పకూలిపోతుందట. మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చేస్తాయట. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారిన బండి సంజయ్‌, ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన ఆరోపణలు చేయడం, బీజేపీ వర్గాలకీ పెద్ద షాకే ఇచ్చింది. గ్రేటర్‌ హైద్రాబాద్‌లో బీజేపీ సత్తా ఎంత.? అన్నదానిపై బీజేపీ నేతలకే ఓ అవగాహన వుంది. గత గ్రేటర్‌ ఎన్నికలు కావొచ్చు, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కావొచ్చు, ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలు కావొచ్చు.. క్రమక్రమంగా బీజేపీ తన బలం పెంచుకుంటున్నప్పటికీ, టీఆర్‌ఎస్‌తో పోటీ పడే స్థాయికి ఎదగలేదు. కానీ, గ్రేటర్‌ ఎన్నికల విషయానికొచ్చేసరికి సీన్‌ మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికి వెళ్ళిపోయి, బీజేపీ రెండో స్థానానికి వచ్చేసింది. దుబ్బాక ఫలితం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

BJP to overthrow KCR government?
BJP to overthrow KCR government?

ఇంతకీ బీజేపీకి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వుందా.?

బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో వున్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌. మరొకరు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్‌. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, 100 మందికి పైగా ఎమ్మెల్యేలతో పూర్తి బలోపేతమై వున్న టీఆర్‌ఎస్‌ని ఢీకొనడం సాధ్యమయ్యే పనేనా.? గ్రేటర్‌ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం వేరు. అలా కేసీఆర్‌ సర్కార్‌ కూలిపోవాలంటే, టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు పెరగాలి. అది బీజేపీతో సాధ్యమయ్యే పనేనా.? అంటే, ఏమో.. ఇప్పటికే ఆ ప్లాన్‌ని బీజేపీ ఎగ్జిక్యూట్‌ కూడా చేసేసి వుండొచ్చన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి విన్పిస్తోంది. ‘బీజేపీ ఇప్పటికే ఆ ప్లాన్‌ని అమలు చేయడం మొదలు పెట్టి వుండకపోతే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నోట, కేసీఆర్‌ సర్కార్‌ కూలిపోతుందనే మాట రాదు..’ అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.

మజ్లిస్‌ దారిలోనే బీజేపీ.!

మజ్లిస్‌ పార్టీ నేతలు, గ్రేటర్‌ ఎన్నికల సమయంలో ‘కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేయడం మాకు పెద్ద కష్టమేమీ కాదు. మేం తలచుకుంటే రెండు మూడు నెలల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలం..’ అంటూ గ్రేటర్‌ ఎన్నికల సమయంలోనే మజ్లిస్‌ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అచ్చం అలాంటి వ్యాఖ్యలే భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చేస్తుండడంతో మజ్లిస్‌ – బీజేపీ భవిష్యత్తులో కలిసే అవకాశం వుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి చాలామందిలో. మజ్లిస్‌ – బీజేపీ.. సిద్ధాంతాల పరంగా పరస్పర విరుద్ధ వైఖరి గల పార్టీలు. రెండిటిపైనా మతతత్వ పార్టీలనే ముద్ర వుంది. అలాంటప్పుడు ఈ రెండు పార్టీలూ ఎలా కలుస్తాయ్‌.? కలవకపోతే, రెండు పార్టీల నోటి వెంట ఒకే మాట ఎలా వచ్చింది.? అన్న ప్రశ్నలూ సహజంగానే ఉత్పన్నమవుతాయి.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..

రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఏ క్షణాన ఎలా మారిపోతాయో చెప్పడం కష్టం. శతృవులు మిత్రులైపోతారు.. మిత్రులు శతృవులైపోతారు. ‘ఒక్కడ్ని పడగొట్టడానికి ఇంతమంది రావాలా.?’ అంటూ కేసీఆర్‌, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఆ మాటల్లో చాలా ఆవేదన కనిపించింది. కానీ, కేసీఆర్‌ని తక్కువ అంచనా వేయలేం. అన్నట్టు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌.. ఈ కూల్చివేత వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘పిచ్చోళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని తేల్చేశారు.