కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు ఒక లెక్క, ఆ ఫలితాలు ఇచ్చిన షాక్ తర్వాత మరోలెక్క అన్నట్లుగా ఉంది బీజేపీ ఆలోచనా విధానం. ఇప్పటికే నార్త్ లో సైతం వ్యతిరేకత ప్రారంభమైందని వినిపిస్తున్న కథనాలకు తోడు.. కర్ణాటక ఫలితాల అనంతరం సౌత్ లో సైతం దారులు మూసుకుపోతున్నాయని వినిపిస్తున్న విమర్శలు.. బీజేపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు సహాయం కోరడానికి సైతం వెనకాడటం లేదని తెలుస్తుంది!
తెలంగాణ ఎన్నికల్లో గెలుపు బీజేపీ అత్యంత కీలకం. ఇక్కడ నిలుపుకోగలిగితేనే దక్షిణాదిలో కాషాయానికి కాస్త నూకలు ఉంటాయి.. అలాకానిపక్షంలో సౌత్ లో కాషాయ జెండా కనుమరుగైపోవడం కన్ ఫాం అని విశ్లేషకులు నిత్యం చెబుతున్నారు. దీంతో… ఈసారి తెలంగాణలో ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ పెద్దలు బలంగా ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా టీడీపీతో జతకట్టాలని.. వారికున్న ఓటు బ్యాంకును కలుపులోవాలని భావిస్తున్నారని సమాచారం.
తెలంగాణలో గతంలో అంతకాకపోయినా బీఆరెస్స్ ఇప్పటికీ బలంగానే ఉందని అంటున్నారు. ఇదే సమయంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ బలంలో భారీ మార్పొచ్చిందని చెబుతున్నారు. ఈ సమయంలో బీజేపీ మూడో ప్లేస్ లో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో.. తెలంగాణ ఎనికల్లో చంద్రబాబు సహకారం ఆశిస్తుందంట బీజేపీ.
ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న చంద్రబాబును అమిత్ షా ఈ మేరకు రిక్వస్ట్ చేశారని అంటున్నారు. దీంతో… తెలంగాణ ఎన్నికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఫలితంగా… టీడీపీ ఓటు బ్యాంకు బదిలీ, క్యాడర్ సహకారం, అనుకూల మీడియా మద్దతు ఇస్తామని.. దీనివల్ల బీజేపీకి లాభిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏపీలో పొత్తుపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తున్నా… ఆ సమాచారం మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు!
మరి టీడీపీ – బీజేపీ కలిసి తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నాయి… కేడర్ ను ఒప్పించడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాయి… ఫలితంగా ఎలాంటి ఫలితాలు తీసుకోబోతున్నాయనేది వేచి చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… తెలంగాణలో చంద్రబాబు ఏ పార్టీతో జతకట్టినా… కేసీఆర్ కు మాత్రం ఫుల్ జోష్ వచ్చేస్తుందనడంలో సందేహం లేదు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలతో బాబు వేదికలు పంచుకున్నప్పుడు కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఒకసారి వింటే చాలు!!