చేవచచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ
అరె! ఏమైంది బీజేపీకి? పంచాయితీ ఎన్నికల్లో పట్టుమని పది సర్పంచులను కూడా గెల్చుకోలేకపోయిన సంగతి పక్కన పెడదాం. రాష్ట్రంలో తమ నాయకులకు జరుగుతున్న ఘోరావమానాలకు కనీసం స్పందించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదా? జాతీయస్థాయిలో పదవిని వెలగబెడుతున్న తమ పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఒక ఛానెల్ డిబేట్ లో మరొక వ్యక్తి చెప్పు తీసుకుని కొట్టినా కనీసం బాధను కూడా వ్యక్తం చేసే స్థితిలో లేదా? ఆ రోజు ఆ దృశ్యాన్ని చూసిన బీజేపీ అభిమానులే కాదు…కోట్లాదిమంది ఇతర పార్టీల అభిమానులు సైతం ఆ మరుసటిరోజు బీజేపీ రాష్ట్రంలో నానా బీభత్సటాన్ని సృష్టిస్తుందని, తమ నాయకుడిని కొట్టినవాడిని ఆరెస్ట్ చేసేంతవరకు పోరాటం చేస్తుందని, పోలీస్ స్టేషన్లముందు ధర్నాలు చేస్తుందని ఏవేవో ఊహించుకున్నవారు మరుసటిరోజు బీజేపీ పేలవమైన స్పందన చూసి కంగు తిన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సదరు ఛానెల్ వారు తమ నాయకుడిని చెప్పుతో కొట్టినవాడిపై కేసు పెట్టాలని స్టేట్మెంట్ ఇచ్చేసి బజ్జున్నారు. ఆ ఛానెల్ వారు సోము వీర్రాజు గారి ప్రకటనను వెంట్రుక ముక్కకన్నా హీనాతిహీనంగా తీసి చెత్తబుట్టలో పారేశారు!
కేంద్రంలో గత ఏడేళ్లుగా ఎదురులేని అధికారాన్ని చెలాయిస్తూ, అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంగా స్వకుచమర్దన చేసుకుంటూ వందిమాగధుల స్తోత్రాలతో తరించిపోతున్న బీజేపీ రాష్ట్ర శాఖ ఇంత నిర్వీర్యమై పోవడానికి కారణాలు ఏమిటి? పొరుగు రాష్ట్రంలో బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్, కిషన్ రెడ్డి లాంటి యవ్వనోత్సాహంతో జవనాశ్వల్లా ఉరకలేస్తున్న నాయకగణం అధికారపక్షాన్ని ఢీ కొడుతున్నారు. ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. నిజాలు కానీ, అబద్ధాలు కానీ, పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని దాదాపు అధికారపుటంచులవరకు తీసుకొచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ మృతకళేబరంలా నీలిగిపోతున్నది. మొన్నటిదాకా కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి కోవర్టులా వ్యవహరిస్తున్నందువలనే బీజేపీ ఎదగలేదని ఆరోపించారు. ఫైర్ బ్రాండ్ లాంటి సోము వీర్రాజు వస్తే ఊరపిచ్చుకలేహ్యాన్ని సేవించిన వృద్ధుడిలా కొత్తశక్తితో ఉరకలేస్తుందని ఉవ్విళ్లూరితే బీజేపీ మాత్రం నానాటికీ తీసికట్టుగా దిగజారుతున్నదే ఏమి దౌర్భాగ్యమో? రాష్ట్ర బీజేపీ ఇంత చేవచచ్చి ఉన్నదంటే మహా ఆశ్చర్యంగా ఉన్నది.
మరింత విడ్డూరమైన సంగతి ఏమిటంటే, విష్ణువర్ధన్ రెడ్డికి జరిగిన పాదరక్షసత్కారం బీజేపీ నాయకులతోనే సంతోషాన్ని కలిగిస్తున్నదని అంతర్గతంగా చెప్పుకోవడం! కేంద్ర సహాయమంత్రి హోదా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని ఎవరో బహిరంగంగా చెప్పుతో కొడితే, కేంద్ర స్థాయిలో అధ్యక్షుడు కానీ, మరొక అధికారప్రతినిధి కానీ, ఒక్కరూ సానుకూలంగా స్పందించలేదు. జరిగిన దుర్ఘటనను ఖండించలేదు. విష్ణువర్ధన్ రెడ్డికి పార్టీలో ఎంత విముఖత ఉన్నదో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. విష్ణువర్ధన్ రెడ్డికి నా అనేవారు ఒక్కరు కూడా లేరని చెప్పేకంటే, తనకంటూ ఎవ్వరిని విష్ణు సొంతం చేసుకోలేకపోయారని ఆయన మీద జాలిపడాలి!
అంతకన్నా మరీ ఘోరం ఏమిటంటే చెప్పుదెబ్బలు తిన్న విష్ణుకు వ్యతిరేకంగా, చెప్పుతో కొట్టిన శ్రీనివాసరావుకు సానుకూలంగా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం కావడం చూస్తుంటే మనం ఏ కాలానికి వెళ్తున్నామో తెలుస్తుంది. అలా కొట్టడం తప్పు అంటూనే, విష్ణు మాట్లాడినదానికి అలా కొట్టడం కరెక్ట్ అనేవారు ఎక్కువగా ఉండటం విచిత్రం. సంఘటన జరిగింది తెలంగాణాలో. అయినప్పటికీ తెలంగాణ బీజేపీ వారు కూడా పెద్దగా స్పందించలేదు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రాభవం శరవేగంగా పడిపోతున్నదనడానికి మొన్న వచ్చిన పంచాయితీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. పార్టీని స్థాపించి నలభై ఏళ్లయినా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో సొంత అస్తిత్వాన్ని నిలుపుకోవడంలో బీజేపీ విఫలం అయింది. చురుకైన నాయకులు లేరు. ఉన్నవారు అధికారపార్టీలో లాలూచి పడతారు. కేంద్రంలో తిరుగులేని అధికారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని పార్టీని పాతేశారు. పోనీ తెలుగుదేశంతో పొత్తు చెడిపోయినతరువాతైనా ఒంటరిగా పోరాటం చేసి పార్టీలో జవజీవాలు నింపుదామనే ధ్యాస లేకుండా ప్రజలతో ఛీత్కరించబడిన జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. గడచిన కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మొన్నటి ఎన్నికల్లో జనసేన వలన బీజేపీ పొందినదానికన్నా, బీజేపీ వలన జనసేన పొందిన లబ్ది ఎక్కువ అని కొందరు బీజేపీ నాయకులు లోపాయికారీగా అంగీకరిస్తున్నారు.
పల్లెల్లో ఎలా ఉన్నా, పట్నాల్లో బీజేపీ అభిమానులు ఎక్కువ అంటారు. వచ్చే నెలలో జరగబోయే కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ కొంచెమైనా ప్రభావం చూపలేకపోతే ఇక ఆ పార్టీమీద ఆశలు వదులుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల్లా ఆంధ్రప్రదేశ్లో పోరాటాలక్షణం కలిగిన నాయకులు బీజేపీలో లేరు. అందరూ ఎముకలు కుళ్ళిన వృద్ధసంతతే. ఇలాంటి నాయకులవలన బీజేపీ ముందడుగు వెయ్యడం కష్టమే. 2024 సంవత్సరంలో అధికారం సంగతి దేవుడెరుగు…ముందు తన పార్టీ నాయకులను చెప్పుదెబ్బలనుంచి రక్షించుకుంటే అదే పదివేలు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు