సెల్ఫ్ గోల్ చేసుకున్న బీజేపీ

BJP MLA Raghunandan Rao want KCR death?
జనన మరణాలు మనచేతుల్లో ఉండవు.  విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.  దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీ మన భారతీయుడి చేతిలోనే కాల్చి చంపబడ్డాడు. ఉక్కుమహిళగా ఖ్యాతినొందిన ఇందిరాగాంధీ తన అంగరక్షకుల తుపాకి గుండ్లకు బలైపోయింది. ఆధునిక భావాల మేటిగా పేరొందిన రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల క్రూరత్వానికి బలయ్యారు.  డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాసేవకై వెళ్తూ మార్గమధ్యంతో పంచభూతాల నడుమ ప్రాణాలు వదిలారు.  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్సార్. మరికొన్ని క్షణాల్లో మనం విగతజీవులుగా మారబోతున్నామని వారికి తెలియదు. వీరందరూ దేశంకోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులుగా భావించాలి. ఇవన్నీ హృదయాన్ని కలచివేసే దారుణ అసహజ అకాల మరణాలు. బుద్ధి జ్ఞానం ఉన్నవారెవరూ ఆ మరణాలను అపహాస్యం చెయ్యరు. కానీ, బుద్ధీ జ్ఞానం మెండుగా ఉన్నాయని పొరపడుతున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నడో మరణించిన వైఎస్ మరణాన్ని కెలికి పైగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా అలాంటి గతి పడుతుందని హెచ్చరించారు!  అంటే… కేసీఆర్ కు కూడా అలాంటి మరణం రావాలని ఆయన కోరుకుంటున్నారా?  ఇదేనా సంస్కారం?  శత్రువుపై ఎంతటి ద్వేషం ఉన్నప్పటికీ, భౌతికంగా దూరం కావాలని కోరుకోవడం మహానేరం, పైశాచిక మనస్తత్వానికి పరాకాష్ట.  
 
BJP MLA Raghunandan Rao want KCR death,
BJP MLA Raghunandan Rao want KCR death?
హైద్రాబాద్ లో నివసించే సీమాంధ్రులలో తొంభై శాతం మంది రాయలసీమ, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలవారే.  వీరందరూ వైఎస్సార్ అభిమానులుగా ఉంటారు. వీరిలో కొందరు బీజేపీ అభిమానులు కూడా ఉన్నారు.  కొందరు తెలుగుదేశం, జనసేనల అభిమానులు. వీరిలో చాలామంది రఘునందనరావు గెలుపును మనస్ఫూర్తిగా హర్షించారు. కానీ, నిన్న ప్రెస్ మీట్ లో రఘునందనరావు చేసిన ప్రేలాపనలు వీరందరి మనసులను తీవ్రంగా గాయపరిచాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నతండ్రి  మరణాన్ని ఇంత నీచాతినీచంగా ప్రస్తావించడం రఘునందనరావు లోని అసలు మనిషిని బయటపెట్టాయి.  ఆయన చెప్పిన క్షమాపణలు వారి మనసులను మార్చడంలేదని, కేవలం ఎన్నికల కోసమే ఇలా దిగివచ్చాడని  భావిస్తున్నారు. గత రెండు మూడేళ్ళుగా నగరంలో వైసిపి కార్యకలాపాలు, నినాదాలు ఏవీ కనిపించలేదు. కానీ, నిన్న  రోడ్ల మీద మళ్ళీ వైఎస్సార్ నినాదాలు, దిష్టిబొమ్మ దహనాలు కనిపించాయి.  
 
హిందుత్వం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలనుకునే బీజేపీ దేశానికి చేసిన మేలు ఏముంది?  కేవలం మతకోణంలో వైఎస్సార్ ను ద్వేషించే బీజేపీ కన్నా, హిందూ మతానికి వైఎస్ చేసిన సేవలే అధికం.  వెంకన్నకు తిరుమల ఏడుకొండలూ సమర్పించుకుంటూ జీవో జారీ చేసింది వైఎస్సార్ అని అందరికీ తెలుసు.  కానీ ఆయన రెండు కొండలు అన్నడదని ఆయన మీద జరిగిన దుష్ప్రచారం జరిగింది.  శ్రీనివాసునికి, హిందూ ధర్మ  ప్రచారానికి ప్రత్యేక ఛానెల్ ఉంటే బాగుంటుందని ప్రత్యేకంగా ఎస్వీబిసి ఛానెల్ ను ప్రారంభించింది వైఎస్సార్ మాత్రమే.  అలాగే తిరుపతిలో వేదవిశ్వవిద్యాలయానికి రూపకల్పన చేసి హిందూ మతానికి మహోపకారం చేసింది ఆయనే.  ఆంధ్రా తెలంగాణ భేదం లేకుండా ధూపదీప నైవేద్యాలకు మొట్టమొదటిసారిగా భారీ నిధులను కేటాయించింది వైఎస్సార్ కాదా?  బీజేపీ వారికి గ్రహింపు  లేదేమో  కానీ, చిలుకూరు  వెంకటేశ్వర ఆలయ ప్రధానార్చకులు సౌందర్య రాజన్ అనేకమార్లు ఈ విషయంలో వైఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు.  
  
ఒకేఒక  తెలివితక్కువ మాటతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది అంటున్నారు ప్రజలు.  అనేకమంది ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ పండితులు  సైతం రఘునందన్ రావు వాచాలతను తీవ్రంగా నిరసించారు.   రాజకీయ విభేదాలు ఉంటే తప్పకుండా విమర్శించుకోవచ్చు.  కానీ,  నోరుజారి ప్రజల ఆరాధ్య నాయకుల మరణాలను అపహాస్యం చేసేవిధంగా మాట్లాడితే వారి అభిమానులు సహించరని నిన్న మరోసారి రుజువైంది. రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ ఆచితూచి మాట్లాడాలని రఘునందన్ రావు ఉదంతం స్పష్టం చేసింది. కాలు జారితే తీసుకోవచ్చు.  కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేము.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్  రాజకీయ విశ్లేషకులు