కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన శత్రువు చంద్రబాబే 

chandra babu naidu
నారా చంద్రబాబు నాయుడి రాజకీయ చతురత మామూలుది కాదు.  ఆయన పథకం వేస్తే ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే.  కూటమి రాజకీయాలు చేయడంలో ఆయన సిద్దహస్తుడు.  శక్తుల్ని అవసరమైనప్పుడు వాడుకుని, అవసరం తీరాక పక్కనపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.  కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి వద్ద తనకంటూ ఒక ప్రాముఖ్యతను సంపాదించుకుని ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్థుడు.  ఈ పొగడ్తలన్నీ ఒకప్పుడు.  ఇప్పుడు బాబుగారి గురించి వినిపిస్తున్న మాటల్లా ఆయన పనైపోయింది, ఇక చేసేదేం లేదు.  ఇలాగే ఉంటే తెలుగుదేశం మూటాముల్లె సర్దుకోవాల్సిందే అని.  ప్రజల్లోనే కాదు ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా ఇదే అభిప్రాయం.  ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తన ప్రాభవం చూపగలిగిన బాబుగారు ఈరోజు ఆ స్థాయిని కోల్పోయారు.  
 
 
భారతీయ జనతా పార్టీకి శత్రువయ్యారు.  అందుకు కారణం వేరెవరో కాదు స్వయానా బాబుగారే.  గత ఎన్నికల్లో బీజేపీని బూచిని చేసి ప్రయోజనం పొందాలని ప్రయత్నించారాయన.  అదే ఇప్పుడు బాబుగారిని ఒంటరిని చెసేసింది.  వైసీపీని ఎండగడుతూనే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని  విమర్శించి హోదాకి అడ్డు బీజేపీనే అన్నట్టు కవరింగ్ ఇచ్చారు.  ఇక తాజాగా అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కాకుండా కేవలం శాసన రాజధానిగా ఉంచుతూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఆపగలిగి కూడా ఆపలేదని, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం వెనుక బీజేపీ కూడా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  ఎలాగైనా బీజేపీని రెచ్చగొట్టి జగన్ పనిపట్టాలని అనుకున్నారు.  అన్నీ కుదిరితే మరిసారి చెలిమి చేయాలనే ఆలోచన కూడా చేశారు.  
 
 
కానీ అవేవీ జరగలేదు.  భారతీయ జనతా పార్టీ బాబుగారి ఉచ్చు నుండి తప్పించుకుంది.  కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు టీడీపీ విధానాన్ని ఫాలో అవుతున్నారనే సూచనలు కనబడటంతో ఏకంగా అధ్యక్షుడినే మార్చేశారు.  కొత్త అధ్యక్షుడికి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించారు.  ఆ లక్ష్యమే టీడీపీని ప్రతిపక్ష పాత్ర నుండి తప్పించి ఆ స్థానంలోకి తాము వెళ్ళడం.  ఇన్నాళ్లు ఏదో ఉన్నాం అంటే ఉన్నట్టుగా వ్యవహరించిన కమల దళం ఈసారి పంథా మార్చుకుంది.  ఎవరో ఇకరి తోక పట్టుకుని నడిచింది చాలనుకుని తామే ఒక శక్తిగా ఎదగాలని డిసైడ్ అయ్యారు.  కానీ అందుకు తగిన బలం లేదు గనుక విధానాల్లో పోలిక ఉన్న జనసేనతో చేతులు కలిపారు.  పవన్ తో కలిసి 2024 నాటికి ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలనేద వారి ప్లాన్.  
 
 
గత ఎన్నికలతో టీడీపీ పూర్తిగా డీలా పడిపోయింది.  కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోయింది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో విఫలమవుతోంది.  ఈ పరిణామాలన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని స్పష్టంగా చూపిస్తున్నాయి.  ఈ శూన్యతను భర్తీ చేయాలనేదే ఇప్పుడు బీజేపీ ప్రధాన కర్తవ్యం.  తాజాగా అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ విషయాన్నే వ్యక్తపరిచారు.  ఒకవైపు అధికార పక్షాన్ని నిలదీస్తూనే టీడీపీని నీరుగారిస్తే అనుకున్నది సాధించవచ్చు అన్నట్టు మాట్లాడారు.  ఆయన మాటల్లో ప్రధానంగా గురి పెట్టాల్సింది టీడీపీనే అని అర్థమైపోయింది.  అసలు ఏపీలో ప్రతిపక్షమే లేదన్న రామ్ మాధవ్ ఇకపై టీడీపీని లెక్కలోకి తీసుకోనక్కర్లేదని అన్నారు.  
 
 
అమరావతిని రాజధానిగా డిసైడ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర నామమాత్రమేనని, అంతా చేసింది చంద్రబాబేనని, అమరావతిలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే వచ్చామని అన్నారు.  అసలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని 10 ఏళ్ళ పాటు వాడుకోవచ్చని, ఆ పదేళ్లలో రాజధాని నగరాన్ని నిర్మించుకోమని చెప్పామని, కానీ చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి పారిపోయి వచ్చారని, అలా పారిపోయి రావడం వెనుక బాబుగారు చేసిన అనివీతి పనులే కారణమని పరోక్షంగా ఎద్దేవా చేశారు.  ఇకపై భవిష్యత్తులో బాబుతో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదనే సంకేతమిచ్చారు.  మొత్తంగా రామ్ మాధవ్ మాటల్ని బట్టి ప్రజెంట్ వారి ప్రధాన శత్రువు చంద్రబాబేనని తేలిపోయింది.