మరో ఇరవైనాలుగు గంటల్లో హైదరాబాద్ నగర కార్పొరేషన్ భవనం మీద ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు అనే పాయింట్ మీద చర్చ అప్రస్తుతం అవుతుందేమో కానీ, పోలింగ్ తీరు పట్ల కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. పోలింగ్ రోజున సాయంత్రం అయిదు గంటల వరకు ముప్ఫయి ఆరు శాతంగా ఓట్లు పోలయ్యాయని ప్రకటించిన ఎన్నికల సంఘం ఆరుగంటలకు హఠాత్తుగా నలభై ఆరు శాతం అని ప్రకటించడం వెనుక ఏదో జరిగింది అని నమ్ముతున్నారు. కేవలం గంట వ్యవధిలో పది శాతం పోలింగ్ అంటే మాటలు కాదు. దొంగ ఓట్లు అన్నీ ఆ గంట సమయంలో పోల్ అయ్యాయని స్పష్టం అవుతున్నది. అది మజ్లీస్ పార్టీ కావచ్చు, తెరాస కావచ్చు. లాలూచి పడిన రెండు పార్టీలు కలిసి చేసిన నిర్వకంగా దీన్ని చెప్పుకోవాలి.
మరొక విషయం ఏమిటంటే ఈసారి తెరాస ప్రచారంలో ఆత్మవిశ్వాసం కొరవడింది అని స్పష్టం అయింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి అధికార పక్షాన్ని గడగడలాడించింది అని చెప్పాలి. కేంద్రమంత్రులు సైతం ప్రచార రంగంలో దిగడం తెరాసను ఉక్కిరి బిక్కిరి చేసింది. గత ఆరేళ్లలో తాను చేసిన మంచిపనులు చెప్పుకుని ఓట్లు అడగాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం “ఒక్క బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఢిల్లీ మొత్తం దిగివచ్చింది” అని ఉపన్యసించడం చూస్తుంటే ఆయన మళ్ళీ సెంటిమెంట్ మీదే ఆధారపడి విజయం సాధించే ప్రయత్నం చేసినట్లయింది. ప్రచారం అన్న తరువాత ఎంతమంది అయినా వస్తారు. అది సాధారణం. బీజేపీ హవా పెరిగిందో లేదో తెలియదు కానీ తెరాసను బీజేపీ భయపెట్టగలిగింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీకి ప్రస్తుతం నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి కనీసం ఇరవై స్థానాలు గెల్చుకున్నా, ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని భావించాలి. తెరాసకు గతంలో ఉన్న ఒకటి తక్కువ వంద స్థానాల కన్నా పది పదిహేను సీట్లు తగ్గాయంటే నగరవాసులు అధికార పార్టీ పట్ల విశ్వాసం పోగొట్టుకున్నారని అనుకోవాలి. నాలుగైదు సీట్లు కోల్పోతే తెరాస పెద్దగా లెక్కచెయ్యల్సిన అవసరం లేదు. డెబ్భై సీట్లు లోపే దక్కితే మాత్రం తెరాస పార్టీకి ప్రమాదమే. ఇక బీజేపీ వస్తే చార్మినార్ కూలగొడతారు, మతకల్లోలాలు రేగుతాయి అని ప్రజలను భయపెట్టే ప్రయత్నం అధికార పార్టీ చేసిందంటే వారి విజయం మీద వారికి నమ్మకం పోయిందనే అనుకోవాలి. తెరాస ఒక గొప్ప ఉద్యమపార్టీ అని తెలిసిన తరం క్రమేపీ తగ్గిపోతున్నది. ఇప్పటి పదిహేను ఇరవై సంవత్సరాల యువకులకు తెరాస ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన పోరాటం పెద్దగా జ్ఞప్తికి ఉండకపోవచ్చు. రక్తం పొంగేలా బీజేపీ నాయకులు చేసిన దూకుడు ప్రచారం యువతను ఆకర్షించే అవకాశం ఎక్కువ. కనుక ఇంకా ఉద్యమం, సెంటిమెంట్ పేర్లు చెప్పి ఓట్లు సాధించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. తమది రాజకీయ పార్టీగా తెరాస ఏనాడో ప్రకటించుకుంది కాబట్టి ప్రభుత్వ సారధులుగా తాము సాధించిన ఘనతలను చెప్పుకునే విజయాలను సాధించాలి. ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో తెరాస కు బీజేపీ చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక గెలుపోటముల విషయం రేపు తేలుతుంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అధికారపార్టీకి స్వల్ప ఆధిక్యత లభించవచ్చు. తెరాస కన్నా మజ్లీస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెల్చుకుంటే మేయర్ అభ్యర్థి మజ్లీస్ నుంచే రావచ్చు.