ఆంధ్రాలో జరుగుతున్న హిందూ దేవాలయాల మీద దాడులను హిందూ మతం మీద మరొక మతం చేస్తున్న దాడిలా అభివర్ణిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. సంఘటనలు వరుసగా జరగడంతో ఈ ప్రచారం మరీ ఎక్కువైంది. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని బీజేపీ గట్టిగా క్యాష్ చేసుకుంటోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ అంశం మీదే పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదట ఇది అధికార పార్టీ వ్యక్తుల పనని ఆరోపించారు. కానీ సీఎం జగన్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. దాంతో బీజేపీ రాజకీయానికి తెరపడుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి ఛలో అంతర్వేది, ఛలో అమలాపురం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ అందోళనలతో అసలు బీజేపీ ఏం చెప్పాలనుకుంటోంది, ఎలాంటి పరిష్కారం డిమాండ్ చేస్తోంది అనేది క్లారిటీ లేదు. అయితే సోము వీర్రాజు హైకమాండ్ నుండి అందిన ఆదేశాల మేరకే ఈ హంగామా చేస్తున్నారని అంటున్నారు. అంటే పైనుండి రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హంగామాకు మద్దతు లభిస్తోందనే కదా అర్థం. ఈ వ్యవహారం మొత్తాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్లాలనే యోచనలో హైకమాండ్ ఉందట. అందుకే దేవాలయాల మీద జరుగుతున్న దాడుల మీద విచారణ కమిటీ వేయాలని అనుకుంటోందట.
మత విశ్వాశాల మీద దాడులు జరిగితే అది మత విద్వేషాలకు దారితీస్తుందని, అందుకే జోక్యం చేసుకోవాల్సి వస్తోందని బీజేపీ నేతలు అంటున్నారట. అదే గనుక జరిగితే ఆ సాకుతో బీజేపీ పెద్దలు వరుసగా రాష్ట్రానికి క్యూ కడతారు. ఇక భారతీయ జనతా పార్టీకి రోజూ హడావుడే, నిత్యం ప్రచారమే. మొత్తానికి ఈ దాడుల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో ఉంది. పెను మార్పులు అంటే ఇక బీజేపీ అధికారంలోకి రావడమన్నమాట. మొదట గట్టిగా పోరాడి ప్రతిపక్ష హోదాను పొందాలనుకున్న బీజేపీ దేవాలయాల ఘటనలతో ప్రతిపక్షం ఏమిటి, జగన్ సర్కారును పక్కకుతోసేసి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుంది.