బీఆరెస్స్ లోకి బిత్తిరి సత్తి… కేటీఆర్ క్యాస్ట్ ఈక్వేషన్స్?

ఎన్నికలు సమీపిస్తునన్ వేళ తెలంగాణలో అధికార బీఆరెస్స్ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. అందరికంటె ముందు ఆల్ మోస్ట్ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీఆరెస్స్… మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఇదే సమయంలో సెంటిమెంట్ గా హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించింది. ఇదే సమయంలో ఇతర పార్టీలలోని అసంతృప్తులకూ ఆహ్వానాలు పంపుతుందని తెలుస్తుంది.

మరోపక్క వరుస బహిరంగ సభలతో కేసీఆర్ దూకుడు పెంచారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. రోజుకి మూడు మీటింగుల చొప్పున తెలంగాణ మొత్తం చుట్టేపనికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో చేరికలకు కూడా బీఆరెస్స్ పెద్దలు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా… శాసన మండలి ఉపాధ్యాయ కోటా మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆరెస్స్ పార్టీలో చేరారు.

ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న బి.మోహన్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజినామా చేసి, కాంగ్రెస్ కు జైకొట్టిన సంగతి తెలిసిందే. ఇలా బీజేపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు బీఅరెస్స్ లలొ నేతల చేరికలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి! ఈ సందర్భంగా స్పందించిన మోహన్ రెడ్డి… కేసీఆర్ సారథ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపైన కలిసి పని చేసేందుకే బీఆరెస్స్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.

మరోపక్క తెలంగాణలో ఫేమస్ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవికుమార్‌ త్వరలో బీఆరెస్స్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆరెస్స్… ఇందులో భాగంగా తాజాగా బిత్తిరి సత్తితోనూ సంప్రదింపులు జరిపింది. ఈ మేరకు… పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హరీశ్‌ రావుతో బిత్తిరిసత్తి ప్రగతిభవన్‌ లో భేటీ అయ్యారు.

ముదిరాజ్‌ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆరెస్స్ తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీశ్‌ కోరినట్లు తెలుస్తుంది. ఈ సందర్హంగా బీఆరెస్స్ లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి వెల్లడించారని తెలుస్తుంది. ఇదే సమయంలో ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన మరికొందరు కీలక నేతలు కూడా త్వరలో బీఆరెస్స్ లో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.