రచన-దర్శకత్వం : మారి సెల్వరాజ్
తారాగణం : ధృవ్ విక్రమ్, అనుపమా పరమేశ్వరన్ (పశుపతి, రజిషా విజయన్, అమీర్ సుల్తాన్, లాల్, మదన్ కుమార్, దక్షిణామూర్తి తదితరులు
సంగీతం : నివాస కె.ప్రసన్న,
చాయాగ్రహణం : ఎళిల్ అరసు,
కూర్పు : శక్తి తిరు
నిర్మాతలు: సమీర్ నాయర్ – దీపక్ సైగల్ – పా.రంజిత్ – అదితి ఆనంద్ (Producer)
విడుదల : అక్టోబర్ 24, 2025
తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన నాల్గవ సినిమా ‘బైసన్’, తమిళంలో అక్టోబర్ 17 నే విడుదలైనా తెలుగులో ఈ రోజు విడుదలైంది. దీనికి ‘కర్ణన్’ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.. కబడ్డీ క్రీడాకారుడు మానతి గణేశన్ జీవితం ఆధారంగా బయోపిక్ గా ప్రేక్షకుల ముందుంచాడు. దీని బాగోగులు ఎలా వున్నాయో చూద్దాం…
కథేమిటి?
కిట్టయ్య (ధృవ్ విక్రమ్) కబడ్డీలో మొనగాడు. తమిళనాడులోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన అతను తీవ్ర కులవివక్ష నెదుర్కొంటాడు. టీం లో అతడ్ని తీసుకోరు. అతడిలోని టాలెంట్ ని గుర్తించిన స్కూల్ పీఈటీ టీచర్ అతడికి శిక్షణ నిచ్చి ప్రోత్సహిస్తాడు. అతడికి తండ్రి వేలు సామి (పశుపతి), అక్క రాజీ (రజిషా విజయన్), అక్క స్నేహితురాలు రాణి (అనుపమా పరమేశ్వరన్) వుంటారు. తన కంటే వయసులో పెద్దదైన రాణితో ప్రేమలో ఉంటాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రేమని, కబడ్డీనీ పాండ్యరాజు (ఆమీర్), కందసామి (లాల్) ల మధ్య కుల కక్షలు దుర్భరం చేస్తూంటాయి. ఈ కుల వివక్షతో తీవ్ర అవమానాలెదుర్కొంటూ, జపాన్ వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే వరకూ ఎలా ఎదిగాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ?
పైన చెప్పుకున్నట్టు ఇది కబడ్డీ స్టార్ మనతీ గణేశన్ బయోపిక్. తమిళనాడుకి చెందిన గణేశన్ కబడ్డీలో బలమైన శైలి కారణంగా అతడ్ని బైసన్ (అడవి దున్న) అని పిలుస్తారు. కష్టించి పనిచేయడం వల్ల ఎవరైనా సమస్యల నుంచి బయటపడగలరని అతడి జీవితం చూపిస్తుంది. ఒక చిన్న గ్రామంలో జన్మించిన అతను స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతూ పెరిగాడు. కులవివక్ష కూడా తీవ్రంగా ఎదుర్కొన్నాడు. ఈ బయోపిక్ 1990లలో కుల కక్షలు వంటి సామాజిక సమస్యలపై పోరాటం గురించి కూడా.
ఈ బయోపిక్ లో నిజ సంఘటనల్ని కొన్ని కల్పిత భాగాలతో కలిపి బలమైన కథని చెప్పాలనుకున్నాడు దర్శకుడు మారి సెల్వరాజ్. కానీ కబడ్డీ క్రీడ- కుల కక్షలు అనే రెండు పాయింట్ల మధ్య ఇరుక్కుని కన్ఫ్యూజ్ అయిపోయాడు. సెల్వరాజ్ సోదరుడు గణేశన్‌తో కబడ్డీ ఆడేవాడు. ఈ సంబంధం సెల్వరాజ్ సినిమా పనిని సులువు చేసింది, కానీ కథని కాదు.
గణేశన్ ప్రారంభ రోజులు, విద్య, కెరీర్, అవార్డులు, వ్యక్తిగత జీవితం మొదలైనవి ఈ బయోపిక్ కవర్ చేస్తుంది. క్రీడల గురించి, జీవిత పాఠాల గురించి బోధించడం ఈ బయోపిక్ లక్ష్యంగా వుంది. ప్రయత్నిస్తే ఎవరైనా విజయం సాధించవచ్చని అతని ప్రయాణం చూపిస్తుంది. క్రీడలు సమాజాన్ని ఎలా మారుస్తాయో చూపించడం ఇంకో కోణం. గణేశన్ ది చాలా సాదాసీదా కుటుంబం. 1990లలో దక్షిణ తమిళనాడులో కుల సమస్యలు పెద్దవిగా ఉండేవి. ఇది అతడి లాంటి చాలా మందికి జీవితాన్ని కష్టతరం చేసింది.
1990ల ప్రారంభంలో అతను స్థానిక మ్యాచ్‌లు ఆడాడు. అతడి నైపుణ్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. అప్పట్లో కబడ్డీ ప్రొఫెషనల్ కాదు. ఆటగాళ్లకి పగటిపూట ఉద్యోగాలు ఉండేవి. గణేశన్ తమిళనాడు విద్యుత్ బోర్డులో చేరి ఇప్పుడు సీనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. జాతీయ క్రీడలలో తమిళనాడుకి ప్రాతినిధ్యం వహించి 1994లో అతను ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఇది మన దేశానికి పెద్ద విజయం. 1995లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. స్థూలంగా ఇదీ అతడి క్రీడా జీవితం.

సామాజిక జీవితం విషయానికొస్తే కుల వివక్షతో ముడిపడి రెండు రకాల పోరాటాల్ని అతడి ముందుంచాయి : కబడ్డీలో ప్రత్యర్దులమీద గెలుపు కోసం పోరాటం, ఇవతల తనకి అడ్డు ప డుతున్న కులవివక్ష మీద రెండో పోరాటం. ఈ రెండిటిని కలిపి కథ చెప్పడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. పైగా మొత్తం బయోపిక్ ని డ్రామా, మెలోడ్రామా వంటి బాక్సాఫీసు అప్పీళ్ళకి దూరంగా, ఆర్ట్ సినిమా శైలిలో మరీ సహజత్వాన్ని ఒలికించి డ్రై గా మార్చేశాడు.
ఎవరెలా చేశారు?
హీరో ధృవ్ కి గణేశన్ స్వయంగా కబడ్డీ ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ పాత్రలో నటించడానికి ధృవ్ రెండు సంవత్సరాల పాటు ఆ గ్రామంలో శిక్షణ పొందుతూ ఉండిపోయాడు. ఇది బాగా వర్కవుట్ అయింది. బయోపిక్ పాత్రకి బలమైన సన్నివేశాల్లో కూడా అవలీలగా జీవం పోశాడు. ఈ మూవీతో అతఃను ఫ్యాన్ బేస్ ని ఇంకా పెంచుకోగలడు. కబడ్డీ సీన్స్ లో యాక్షన్ హీరోగా, వివిక్షతో కూడిన సన్నివేశాల్లో ఎమోషనల్ క్యారక్టర్ గా బలమైన ముద్ర వేశాడు.
తండ్రి పాత్రలో పశుపతి కొడుకుని కాపాడుకోవడం కోసం పడే తపనని ఫ్లాట్ గా నటించేశాడు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ది చిన్న పాత్ర. కోచ్ పాత్రలో మదన్ కుమార్ కనిపించాడు. లాల్, అమీర్ లు కుల ఘర్షణల పాత్రల బరువుని బాగానే మోశారు.
సంగీతం, చాయాగ్రహణం సినిమా మూడ్ కి తగ్గట్టు పాల్గోన్నాయ్. ఛాయాగ్రహణం సెల్వరాజ్ గత సినిమాల శైలితోనే వుంది. విజువల్స్ తో ఆకట్టుకునే అతడి క్రియేటివ్ సెన్స్ మారలేదు గానీ, కథా కథనాల విషయంలోనే గత సినిమాల స్థాయిని దీనికి కల్పించలేకపోయాడు.
రేటింగ్ : 2.5 /5

