అందరి చూపులు ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ పైనే వున్నాయి. ఆమె నటించిన ’టిల్లు స్క్వేర్’ సినిమా శుక్రవారం విడుదయింది. ఈమధ్యకాలంలో అనుపమకు పెద్ద బ్రేక్ అయితే ఏవిూ రాలేదు, అలాగే పెద్ద సినిమాల ఆఫర్స్ కూడా లేవు. అనుపమ మంచి ప్రతిభ గల నటి, తెలుగులో తన గొంతుకు తనే డబ్బింగ్ చెప్పుకునే నటీమణుల్లో అనుపమ ముందుంటారు. ఈ ‘టిల్లు స్క్వేర్’ లో సిద్ధు జొన్నలగడ్డ పక్కన కథానాయికగా నటించింది. ఇంతకు ముందు సిద్ధు నటించిన ‘డీజే టిల్లు’ పెద్ద విజయం సాధించటం, ఆ సినిమాకి ఇది సీక్వెల్ గా రావటం, ఈ సినిమాకి లాభదాయకం అయింది అంటున్నారు. ఇక ఇంతవరకు అన్ని సినిమాలలో అనుపమ తన నటనతో ఎక్కువ మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
సామజిక మాధ్యమాల్లో కూడా ఆమెకి విశేషమైన పేరు వుంది, అందుకే ఆమెకి చాలా ఎక్కువమంది ఫాలోవర్స్ కూడా వున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకి 16 మిలియన్ ఫాలోవర్స్ వున్నారంటే మాటలు కాదు. అనుపమ గ్లామరస్ నటి కూడా, కానీ ఆమె ఎప్పుడూ పరిధి దాటకుండా ఇంతవరకు అన్ని సినిమాలలో కనిపించింది. మరి ఏమైందో ఏమో కానీ, ’టిల్లు స్క్వేర్’ లో ఈ గ్లామర్ డోసు అనుపమ కావాలనే ఎక్కువ చేశారు అని అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు పరిశ్రమలో టాక్ నడుస్తోంది. విడుదలైన ఈ సినిమా ప్రచార వీడియోల్లో చూస్తే అందులో అనుపమ ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గ్లామర్ డోసు బాగా పెంచినట్టు కనపడుతోంది. అయితే ఆమె అభిమానులు చాలామంది ఆమెని అలా చూసి బాగా హర్ట్ అయ్యారు అని ఆమె సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు పెట్టిన కామెంట్స్ చూస్తేనే అర్థం అయిపోతోంది. ఆమె ఎందుకు ఈ సినిమా చేసినట్టు, కేవలం తనకి పెద్ద ప్రాజెక్టులు రావటం లేదని ఈ సినిమా ఒప్పుకున్నారు అనే టాక్ కూడా ఒకటి పరిశ్రమలో నడుస్తోంది.కొన్ని రోజుల క్రితం ‘టిల్లు స్క్వేర్’ ప్రచారానికి అనుపమ వచ్చినప్పుడు ఆమెకి విశేష స్పందన వచ్చింది. అలాగే ఎక్కువమంది ఆమె ఈ ప్రచార చిత్రాలలో కన్పించిన ఆ ముద్దు సన్నివేశం, గ్లామర్ డోసు పెంచారా లాంటి వీటిపై ప్రశ్నలు అడిగారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ కైమ్ర్ కామెడీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా సినీప్రియుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాలో టిల్లుగా అతడు చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడా పాత్రతో మరోమారు థియేటర్లలో నవ్వులు పూయించేందుకు ’టిల్లు స్క్వేర్’ వచ్చేశాడు.
ఈసారి ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. టీజర్, ట్రైలర్లలో చూపించిన కంటెంట్ ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా ఉండటం.. విడుదలకు ముందే పాటలు కూడా మంచి ఆదరణ దక్కించుకోవడంతో అందరి దృష్టి ఈ సీక్వెల్‌పైనా పడింది. రాధిక (నేహాశెట్టి)తో పాత పంచాయితీ ముగిశాక టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభిస్తాడు. పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ తనదైన శైలిలో సరదాగా జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) అనే మరో అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. వాళ్లిద్దరూ అనుకోకుండా ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాట కలుపుతాడు. అతడి మాటలు.. వ్యవహారశైలి నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే.. అదే రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. కట్ చేస్తే తెల్లారేసరికి గదిలో ఒక లెటర్ పెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది.
కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో నెల తర్వాత లిల్లీ ఓ ఆస్పత్రిలో టిల్లుకు ఎదురుపడుతుంది. తను గర్భవతినని చెప్పడంతో టిల్లు షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఈలోపు మళ్లీ టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీ అతన్ని తన అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరడంతో తను అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అది రాధిక (నేహా శెట్టి) ప్లాట్. మరి అక్కడికి వెళ్లాక టిల్లుకు ఎదురైన సమస్య ఏంటి? రాధిక, లిల్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దుబాయ్ నుంచి వస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ (మురళీశర్మ)కు ఈ కథకు ఉన్న లింకేంటి? అతన్ని చంపాల్సిన మిషన్‌లోకి టిల్లు ఎందుకొచ్చాడు? అన్నది మిగతా కథ.
సీక్వెల్ కథ కూడా తొలి భాగం తరహాలోనే సింపుల్ లైన్‌లో సాగిపోతుంది. కాకపోతే మరోసారి టిల్లు పాత్రే ఆ సాధారణమైన కథను అసాధారణమైన నటనతో అద్భుతంగా నిలబెట్టేసింది.లిల్లీ పాత్ర పరిచయ సన్నివేశాలు.. టిల్లు ఠక్కున ఆమె మాయలో పడిపోవడం.. ఒక్క రాత్రిలోనే ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఇలా అంతా రాధిక ఎపిసోడ్ మరోసారి లిల్లీ వెర్షన్‌లో పునరావృతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక టిల్లు తన బర్త్‌డే పార్టీని వదిలేసి లిల్లీని వెతుక్కుంటూ పాత రాధిక అపార్ట్‌మెంట్‌కే వెళ్లడం.. ఆరోజు చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ అదే సమస్యలోకి దిగడం ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ కథలో కొత్త కోణం బయటకొస్తుంది. నిజానికి ఈ మధ్యలో సాగే తతంగమంతా కొందరికి పాత కథను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతి కలిగించినా టిల్లు పాత్ర చేసే అల్లరితో అదంతా కొట్టుకుపోతుంది.
ఇక ద్వితీయార్ధం షేక్ మహబూబ్ అలీని పట్టుకునే మిషన్ నేపథ్యంలో సాగుతుంది. అంత పెద్ద క్రిమినల్‌ను చంపడానికి టిల్లులాంటి సాధారణ వ్యక్తితో ఎలాంటి సాహసాలు చేయిస్తారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. నిజానికి ఆ ప్రయత్నం మరీ అంత థ్రిల్లింగ్‌గా సాగకున్నా ఎక్కడా బోర్ కొట్టించదు. టిల్లు పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తనదైన నటనతో మరోసారి కట్టిపడేశాడు. లిల్లీ పాత్రలో అనుపమ తెరపై చాలా హాట్‌గా కనిపించింది. లిప్‌లాక్‌ల విషయంలో మొహమాట పడకుండా నటించింది. టిల్లు తల్లిదండ్రుల పాత్రలూ నవ్వులు పంచాయి. రాధిక పాత్రలో నేహా శెట్టి అతిథిలా తళుక్కున మెరిసింది. అలాగే ప్రియాంక జవాల్కర్ కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది. సినిమాలోని రెండు పాటలు తెరపైనా కనువిందు చేస్తాయి. భీమ్స్ నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. కూర్పు బాగా కుదిరింది. నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.