రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడుకి బ్రేకులేసింది. పంచాయితీ ఎన్నికల షెడ్యూలుని ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ విడుదల చేసిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వ వాదనను పట్టించుకోకుండా నిమ్మగడ్డ, ఆ షెడ్యూలని విడుదల చేయడం పట్ల అధికార పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలంటూ నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికలు జరగకూడదన్న పట్టుదలతో వుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక, షెడ్యూల్ వచ్చేసింది గనుక, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసినట్లేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెబుతుండగా, ఇప్పుడు ఆ షెడ్యూలునే సస్పెండ్ చేసేసింది హైకోర్టు. కరోనా వ్యాక్సినేషన్.. పంచాయితీ ఎన్నికలు ఒకేసారి సాధ్యం కావని ప్రభుత్వం వాదిస్తోంది. ఆ వాదనతో హైకోర్టు కూడా ఏకీభవించినట్లే కనిపిస్తోంది. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టలేమని ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించడమంటే, ఎస్ఈసీ నిమ్మగడ్డకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లే భావించాలి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ దిశగా వడి వడిగా అడుగులు పడుతున్నాయి.
ఇది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుసుకోలేరా.? ‘అబ్బే, ఆ వ్యాక్సినేషన్ కారణంగా పంచాయితీ ఎన్నికలకు ఇబ్బంది వుండదు’ అని నిమ్మగడ్డ చెప్పినా, ప్రభుత్వం ఆలోచన వేరేలా వుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ‘కుల పంచాయితీ’ని కూడా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలు చాలామంది తెరపైకి తెచ్చారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లుగా అధికార పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఈ క్రమంలో నిమ్మగడ్డకు షాక్ తగలడమంటే, అది టీడీపీకి కూడా.. అన్న చర్చ తెరపైకొచ్చింది. నిజానికి, స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండి పట్టుదలకు పోకుండా వుండి వుండాల్సిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతున్న దరిమిలా, ఆయన ఇంకాస్త మెచ్యూర్డ్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుని వుండాల్సింది. ఏదిఏమైనా, పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ రద్దుతో, ఇప్పట్లో ఈ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఏమాత్రం కనిపించడంలేదు. అయితే, హైకోర్టు తీర్పుని సవాల్ చేసే ఆలోచనలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వున్నారంటూ ప్రచారం జరుగుతున్న దరిమిలా.. ఆయనకు గనుక ఊరట దక్కితే, ప్రభుత్వానికి చుక్కెదురయినట్లే.