గతంలో చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో మోస్ట్ పాపులర్ యాప్ టిక్ టాక్ సహా బాగా ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, షేర్ ఇట్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, వైరస్ క్లీనర్ లాంటి యాప్స్ ఉన్నాయి. గల్వాన్ లోయలో దాడి జరిపి భారత సైనికులు 20 మందిని చైనా పొట్టనబెట్టుకుంది. ఎంత సంయమనం పాటించినా చైనా ఈ దుస్సాహసానికి తెగడటంతో భారత్ చైనాకు బుద్ది చెప్పే క్రమంలో ఈ యాప్స్ బ్యాన్ నిర్ణయం తీసుకుంది. అయినా చైనాలో మార్పు రాలేదు. కయ్యానికి కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అందుకే అదే తరహాలో మళ్లీ యాప్స్ బ్యాన్ పద్దతి పాటించి ఏకంగా 118 యాప్స్ మీద నిషేధం విధించింది. ఇందులో పాపులర్ పబ్జీ మొబైల్ గేమ్ ఉండటం చైనాకు పెద్ద దెబ్బ.
ఇది చైనాకు చావు దెబ్బే :
నిజానికి భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది పబ్జీ మొబైల్ గేమ్ ను. అంటే పబ్జీ మొబైల్ వెర్షన్ అన్నమాట. అంటే డెస్క్ టాప్ వెర్షన్ అలాగే ఉంది. పబ్జీ గేమ్ అసలు ఓనర దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ కంపెనీ. ఇది చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీతో కలిసి మొబైల్ వెర్షన్ లాంచ్ చేసింది. ఈ వెర్షన్నే ఇప్పుడు భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. మరి డెస్క్ టాప్ వెర్షన్ ఉందిగా బ్యాన్ చేసి లాభం ఏమిటి అంటే ఉంది. ఇండియాలో పబ్జీ గేమ్ ఆడేవారు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎక్కువమంది అంటే దాదాపు 75 శాతానికి పైగా మొబైల్స్ ద్వారానే గేమ్ ఆడుతున్నారు. మొబైల్ వెర్షన్ బ్యాన్ అవడంతో ఈ 75 శాతం మంది వినియోగదారులను చైనా కోల్పోయినట్టే.
ఫలితం ఇండియా నుండి గేమ్ ద్వారా చైనా కంపెనీ పొందుతున్న భారీ ఆదాయానికి గండిపడినట్టే. ఈ లెక్కలన్నీ వేసుకునే భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ వలన మరోక మార్కెట్ కూడ దెబ్బతిననుంది. అదే మొబైల్ మార్కెట్. పబ్జీ ఇండియాలో ప్రాచుర్యం పొందాక చైనా కంపెనీ మొబైల్స్ కొనుగోళ్లు ఊపందుకున్నాయనే మాట వాస్తవం. పబ్జీ గేమ్ ఆడాలంటే హైఎండ్ మొబైల్ ప్రాసెసర్, హెవీ కెపాసిటీ ఉండే రామ్, బిగ్ డిస్ ప్లే, మంచి సౌండింగ్ సిస్టమ్ ఉండే మొబైల్ కావాలి. అవన్నీ చైనా కంపెనీ ఫోన్లలో తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అందుకే పబ్జీ ఆడే వారి దగ్గర ఖచ్చితంగా చైనా కంపెనీ ఫోన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు విధించిన బ్యాన్ కనుక సుధీర్ఘ కాలం కొనసాగితే చైనా మొబైల్ మార్కెట్ ఇండియాలో దెబ్బతినడం ఖాయం.
ఆనందంలో తల్లిదండ్రులు :
ఇండియాలో ఎన్నడూ లేనంతగా గేమింగ్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం ఈ పబ్జీనే. యువకులు చాలామంది ఈ ఆటకు బానిసలయ్యారు. చేతిలో మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండటంతో కూర్చున్న చోటు నుండి లేవకుండా గంటల తరబడి పబ్జీ ఆడుతుంటారు. ఈ గేమ్ ఆడేవాళ్ళలో అనేక ప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నాయి. చదువు, ఇతర వ్యాపకాలను వదిలేసి ఈ గేమ్ ఆడేవారు అనేకం. తిండి, నిద్ర మానేసి రాత్రి, పగలు తేడా లేకుండా గేమ్ ఆడి హాస్పిటల్ పాలైనవారు చాలామందే ఉన్నారు.
నిద్రలో సైతం ఆటనే కలవరిస్తూ, నిజజీవితాన్ని ఆటగా భావించి మానసిక రోగులుగా మారినవారున్నారు. పబ్జీ ప్రో ప్లేయర్ ఉన్న ఇంట్లో తల్లిదండ్రులకు మానశ్సాంతి ఉండదనే నానుడి ఉంది. ఈ ఆటను బ్యాన్ చేయాలని అనేక రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో తల్లిదండ్రులు ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపారంటే వారి క్షోభ ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రస్తుతం వీరంతా పబ్జీ నిషేధంతో ఆనందపడుతున్నారు.
ఇలాంటి హెచ్చరికలు అవసరమే:
ఇలా చైనా ఉత్పత్తులను ఇండియా నుండి బ్యాన్ చేస్తే చైనా వక్ర బుద్ది మారుతుందా, ప్రయోజనం ఉంటుందా అంటే ఉంటుందనే అనాలి. సరిహద్దుల్లో ఇన్నాళ్లు దురాక్రమణకు పాల్పడుతూ విర్రవీగిన చైనాకు ఈ నిషేధాలు సంకేతాల్లాంటివి. ఒప్పందాలు, నిబంధనలను గౌరవిస్తే ఏ దేశానికైనా భారతదేశంలో పారిశ్రామిక అవకాశాలుంటాయి. ఇండియా ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది.
వాటిని అలుసుగా తీసుకుని భారతదేశం నుండి వ్యాపార ప్రయోజనాలు పొందుతూనే ఇలా సరిహద్దుల్లో ఆక్రమణలతో తోక జాడిస్తే వ్యాపార ప్రయోజనాలకు ఆటంకం ఏమీ ఉండదని భావించిన చైనాకు ఈ యాప్స్ నిషేధాలు గట్టిగా అనుకుంటే ఇండియా ఎంతవరకైనా వెళ్లగలదని, శతృ దేశాల అన్ని మూలాలను కభళించగలదని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టే. ఇప్పటికైనా చైనా తగ్గకుంటే భారత ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని చెంపదెబ్బలు కొట్టడం ఖాయం.