కలకలం సృష్టించిన భూమన లేఖ 

తిరుపతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల విప్లవసంఘం నేత, కవి పెండ్యాల వరవరరావును పెరోల్ మీద విడుదల చెయ్యడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి ఒక వ్యక్తిగత లేఖను వ్రాశారు.  వరవరరాvవు ఎనభై మూడేళ్ళ పండు వృద్ధుడిని, అనారోగ్యంతో బాధ పడుతున్నారని, మంచానికి అతుక్కుని జీవిస్తున్నారని, ఇప్పుడు ఆయన బయటకొచ్చినా విశ్రాంతి తీసుకోవడం మినహా ఎలాంటి కుట్రలకు పాల్పడే అవకాశం లేదని,  ఒక వృద్ధశరీరుని ప్రాణం కాపాడటానికి స్పందించాలని  సహృదయంతో అభ్యర్ధిస్తున్నాను.   నలభై ఆరు సంవత్సరాల క్రితం ఎమెర్జెన్సీ బాధితులుగా మీరు, నేను, ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైలులో ఉన్నాము. ఆయన మన సహచరుడు.  సాహచర్యం భావజాలంలో కాదు గానీ…కటకటాల వెనుక కలిసి ఉన్నాము.  అనారోగ్యంతో ఉన్న ఆయన మీద దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది”  అంటూ ఆ లేఖలో ఒక అభర్ధనను  భూమన ప్రస్తావించారు.  
bhumana karunakar reddy letter create a sensation
bhumana karunakar reddy letter create a sensation
అయితే..భూమన లేఖ రాయడాన్ని తప్పు పడుతూ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యుడు సునీల్ దేవధర్ “ప్రధానిని హత్య చెయ్యడానికి కుట్ర పన్నిన వరవరరావును విడుదల చెయ్యడమని వైసిపి ఎమ్మెల్యే భూమన లేఖ రాయడం ఖండనార్హమని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని,  ఒకవేళ అలాంటి చర్య తీసుకోకపోతే మీకు తెలిసే భూమన ఆ లేఖను వ్రాసి ఉంటారని భావించాల్సివస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి  ఒక ట్వీట్ చెయ్యడం, దానికి భూమన మరొక లేఖ రాస్తూ “అనారోగ్యంతో ఉన్న ఒక వృద్ధుని మీద జాలి చూపించడం నేరం అని మీరు భావిస్తే ఏం చెప్పను నమస్కరించడం తప్ప..  ఉపరాష్ట్రపతి గారికి నేను వ్యక్తిగతంగా లేఖ వ్రాశాను.  తరతరాల భారతీయ సంస్కృతి నేర్పిన క్షమాగుణం వైపు, న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడటం నేరం అయితే ఆ నేరం నేను నిరంతరం చేస్తూనే ఉంటాను” అంటూ తన భావజాలాన్ని కుండబద్దలు కొట్టారు భూమన.  
 
Has AP Chief Minister Chandrababu Naidu swindled public money?
భూమన కరుణాకర్ రెడ్డికి కూడా ఆరెస్సెస్ నేపధ్యం ఉన్నది.  రాడికల్ భావజాలం ఉన్నది.  పదహారేళ్ళ పిన్న వయసులోనే ఆయన తిరుపతి లో అశ్లీల పత్రికలకు వ్యతిరేకంగా ఉద్యమించి పవిత్ర తిరుపతి పట్టణం నుంచి అలాంటి పత్రికలను తరిమికొట్టిన చరిత్ర ఆయనది. 1975 లో శ్రీమతి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జైలులో నిర్బంధించబడిన నాయకుల్లో దేశం మొత్తం మీద పిన్న వయస్కుడు ఆయనే.  పదిహేడేళ్ల వయసులోనే ఆయన ముషీరాబాద్ జైలులో ఇరవై ఒక్క మాసాలు కారాగారావాసాన్ని అనుభవించారు.  అదే జెయిలులో వెంకయ్యనాయుడు, వరవరరావు, చెరబండరాజు, కేజీ సత్యమూర్తి లాంటి పెద్దలతో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి.  భూమయ్య, కిష్టాగౌడ్ అనే ఇద్దరు నక్సల్స్ ను ఉరితీయడం ఆయన కళ్లారా చూశారు.  కాలగతిలో ఆనాటి విప్లవభావజాలాన్ని  భౌతికంగా ఆయన వదిలినప్పటికీ, మానసికంగా ఆయనలో ఆ భావాలు చెరిగిపోలేదు.  బులెట్ కన్నా, బ్యాలెట్   ద్వారానే ప్రజలకు చేరువ కావచ్చని గ్రహించి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  అలనాటి అనుబంధాన్ని జ్ఞప్తి చేసుకుంటూ కేవలం మానవీయకోణంలో వరవరరావును విడుదల చెయ్యమని భూమన వ్యక్తిగతంగా లేఖ రాస్తే మోకాలికి బోడిగుండుకు ముడివేసినట్లు దాన్ని ముఖ్యమంత్రి జగన్ కు ముడిపెట్టడమేంటి?  జగన్ కు కూడా దురుద్దేశాలు ఉన్నట్లు ట్వీట్ చెయ్యడం ఏమిటి విడ్డూరం కాకపొతే?  
 
ఇక్కడ నేనేమీ వరవరరావును సమర్ధించడం లేదు. ఎందుకంటే నాకు వారిమీద సదభిప్రాయం లేదు.  వరవరరావు, గద్దర్ లాంటి ఇంకా అనేకమందిని “అర్బన్ నక్సలైట్స్” అని హేళనగా పిలుస్తుంటారు.  అమాయకులైన గిరిజన యువతీయువకులను, పేదపిల్లలను తప్పుదారి పట్టించి నక్సల్స్ గా మార్చి అడవులకు పంపిస్తారని,  వీరు తమ కన్నబిడ్డలను మాత్రం కాలేజీలు, యూనివర్సిటీలలో చదివించి ఉద్యోగాలకు విదేశాలు పంపిస్తారని,  రాజకీయపార్టీల అగ్రనాయకులతో రహస్య సంబంధాలను మైంటైన్ చేస్తారని వీరిమీద ఎన్నాళ్ళనుంచో ఆరోపణలు ఉన్నాయి.  అవి వాస్తవం కూడా.  ఎందుకంటే వందలాదిమంది నక్సల్స్ ను తయారుచేసే ఈ పెద్దమనుషులు ఒక్కరు కూడా తమ పిల్లలకు తుపాకులు ఇచ్చి అడవులకు పంపిన దృష్టాంతం ఇంతవరకూ లేదు. మావోయిస్టులు సాధారణ ప్రజలను ఊచకోత కోస్తూ, పోలీసులను మందుపాతరలు పెట్టి పైశాచికంగా హత్య చేస్తే వీరు ఒక్క మాట కూడా మాట్లాడరు.  అదే పోలీసులు ఒక్క మావోయిస్టు కాల్చి చంపితే వీరు రోడ్లమీదకొచ్చి హాహాకారాలు చేస్తారు.  ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు.  పోలీసులమీద కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తారు…
 
YSRCP Leader Bhumana Karunakar Reddy Speeks to Media || Slams Chandrababu - Watch Exclusive - YouTube
ఇక వరవరరావు విషయానికి వస్తే   ఆయనను నిర్బంధించింది సాక్ష్తాత్తు మన దేశ ప్రధానిని హత్య చెయ్యడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలమీద.  కాబట్టి ఆయన క్షమకు అర్హుడు కాదు.  అయితే ఆయన మీద ఇంతవరకూ ఆ నేరం రుజువు కాలేదు.  కేవలం అండర్ ట్రయల్ గా నిర్బంధించబడ్డారు.  ఆయన నేరం రుజువైతే ఉరిశిక్ష విధించినా తప్పు కాదు.  ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని, ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు “కబురు” చేశారని కూడా వార్తా ఛానెళ్లలో బ్రేకింగ్ వార్తలు వెలువడ్డాయి.  కానీ, మిరాక్యులస్ గా ఆయన కోలుకున్నారు.  ఆయన వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక గౌరవనీయుడైన ప్రజాప్రతినిధి ఒక వినతి చేస్తే దాన్ని రాజకీయాలకు పెనవెయ్యడం ఉచితమా?  భూమన లేఖ రాసినంత మాత్రాన ఆయన్ను విడుదల చేస్తారా?  కాకపొతే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం కూడా నేరమైతే ఎవరేమి చెయ్యగలరు?  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు