చాలామందికి రోజూ తలకు షాంపూ పెట్టి రుద్దుతుంటారు.. ఇలా చేయకపోతే మురికి, చుండ్రు వస్తాయి అనే భయం ఉంటుంది. మరికొందరికి తరచూ జుట్టు రాలిపోతుంది అన్న భయంతో నెలకి ఒకసారి మాత్రమే రుద్దుతుంటారు. అయితే నిపుణుల సలహా ఏంటి.. ఎన్నిసార్లు తల స్నానం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం, ప్రతి ఒక్కరి జుట్టు రకం, వాతావరణం, జీవనశైలి భిన్నంగా ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే నియమం వర్తించదు. మీ హెయిర్ టైప్‌కి సరిపడే విధానం నియమాలు పాటిస్తేనే జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ, బలంగా ఉంటుంది.
తల చర్మం త్వరగా ఆయిల్ గా మారేవాళ్లు.. రోజూ లేదా రెండో రోజు జుట్టుకి ష్యాంపూ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. తలపై నూనె ఎక్కువగా ఉండటం వల్ల ధూళి, చెమట, కాలుష్యం చర్మ రంధ్రాలను మూసివేసి చుండ్రు, ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తాయి. కాబట్టి సల్ఫేట్-ఫ్రీ మైల్డ్ షాంపూతో తరచూ కడగడం ఉత్తమం. అయితే పొడిగా ఉన్న జుట్టు ఉన్నవారికి పరిస్థితి వేరేలా ఉంటుంది. తరచూ షాంపూ వాడితే సహజ నూనెలు పోయి జుట్టు చిట్లిపోతుంది, నిర్జీవంగా మారుతుంది. ఈ రకమైన జుట్టుకు వారానికి రెండుసార్లు తలను రుద్దుకుంటే సరిపోతుంది. ప్రతి సారి కండిషనర్ వాడటం తప్పనిసరి. ఇది జుట్టుకు తేమను అందించి మృదుత్వాన్ని నిలుపుతుంది.
కర్లీ జుట్టు స్వభావతా పొడిగా ఉండటంతో నూనె చివర్ల దాకా చేరదు. కాబట్టి వారానికి ఒకసారి కడగడం చాలు. మధ్యలో లీవ్-ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరం వాడడం ద్వారా తేమను కాపాడుకోవచ్చు. రంగు వేసిన లేదా కెమికల్ ట్రీట్మెంట్ చేసిన జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. తరచూ షాంపూ వాడటం వల్ల రంగు మసకబారుతుంది, మెరుపు తగ్గుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. తప్పనిసరిగా కలర్ ప్రొటెక్షన్ షాంపూ, సల్ఫేట్-ఫ్రీ ఫార్ములా వాడాలి.
తలస్నానం చేసే సమయంలో వేడి నీరు ఉపయోగించడం సాధారణ తప్పు. అధిక ఉష్ణం తల చర్మాన్ని పొడిగా మార్చి నూనెను తగ్గిస్తుంది. బదులుగా గోరువెచ్చని నీరు వాడితే చర్మానికి హాని లేకుండా శుభ్రత లభిస్తుంది. జుట్టును తుడిచేటప్పుడు గట్టిగా రుద్దకూడదు, సున్నితంగా టవల్‌తో తడిని తీయాలి. రోజూ బయట తిరిగే వారికి డ్రై షాంపూ కూడా మంచి ఆప్షన్. ఇది తలలోని అదనపు నూనెను పీల్చి జుట్టును తాజా లుక్‌లో ఉంచుతుంది. అయితే దీనిని ప్రతిరోజూ వాడకూడదు, వారానికి రెండు సార్లు చాలు.
తక్కువగా తల స్నానం చేయడం కూడా ప్రమాదకరమే. తల చర్మంపై మురికి, చెమట పేరుకుపోయి రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల చుండ్రు, దురద, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, తల శుభ్రంగా లేకపోతే కొత్త జుట్టు పెరుగుదల కూడా మందగిస్తుంది. అందువల్ల మీ జుట్టు రకాన్ని గుర్తించి, దానికి తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజూ కడగడం అవసరమా? వారానికి ఒక్కసారి చాలదా? అనే సందేహాలకు సమాధానం మీ హెయిర్ టైప్ మీదే ఆధారపడి ఉంటుంది.
