పడకగదిలో ఉన్న గోడ గడియారం మనకు సమయాన్ని మాత్రమే చూపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిద్రకు వెళ్లిన తర్వాత అదే గడియారం మన మనసుతో ఆటలాడుతుందంటే నమ్మగలరా..? నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే.. మన చూపు ఆటోమేటిక్‌గా గడియారం వైపు వెళ్లిపోతుంది. అప్పటి నుంచే అసలు సమస్య మొదలవుతుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
రాత్రి నిశ్శబ్దంలో గడియారాన్ని చూసి ఇంకా రెండు గంటలే నిద్ర అంటూ లెక్కలు వేయడం మొదలుపెడితే మెదడు రిలాక్స్ కాకుండా మరింత యాక్టివ్ అవుతుంది. ఈ అలవాటునే సైకాలజీలో ‘క్లాక్ వాచింగ్’ అని పిలుస్తారు. సమయం మీద దృష్టి పెరిగిన కొద్దీ ఆందోళన పెరుగుతుంది. దాంతో నిద్ర మళ్లీ పట్టడం కష్టమవుతుంది. క్రమంగా ఇది నిద్రలేమి సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇక పాత తరహా గడియారాల నుంచి వచ్చే ‘టిక్ టిక్’ శబ్దం చాలామందికి తెలియకుండా మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పగటిపూట వినిపించని ఆ శబ్దం.. రాత్రి నిశ్శబ్దంలో మాత్రం మెదడులో ఒకే లయలో ప్రతిధ్వనిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ నేచర్ ఉన్నవారికి ఈ శబ్దం వల్ల అసహనం, చిరాకు పెరిగి నిద్ర పూర్తిగా దూరమవుతుంది.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా పడకగదిలో గడియారం స్థానం చాలా కీలకం. మంచం తలవైపు లేదా తలకు ఎదురుగా గడియారం ఉండటం వల్ల మనసులో తెలియని ఆతృత, పరుగెత్తుతున్న భావన కలుగుతుందని చెబుతున్నారు. అలాగే దక్షిణ దిశలో గడియారం ఉంచడం మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని సంప్రదాయ విశ్వాసం.
గడియారాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచితే సానుకూలత పెరుగుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. అంతేకాదు, మంచంపై పడుకున్నప్పుడు నేరుగా కంటికి కనిపించని చోట గడియారం ఉండటం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శబ్దం లేని ‘సైలెంట్ స్వీప్’ గడియారాలు ఈ సమస్యకు మంచి పరిష్కారం. నేటి కాలంలో అలారం కోసం స్మార్ట్‌ఫోన్ వాడటం మరో పెద్ద సమస్య. అలారం ఆపే సమయంలో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూసి మెదడు పూర్తిగా మేల్కొంటుంది. అందుకే నిపుణులు పడకగదిలో ఫోన్‌కు బదులు సాధారణ గడియారాన్ని సూచిస్తున్నారు. అలాగే నిద్రకు వెళ్లే ముందు సమయాన్ని చూడకుండా ఉండటం మెదడుకు ‘ఇప్పుడు విశ్రాంతి సమయం’ అనే సంకేతాన్ని ఇస్తుంది. చివరికి చెప్పాలంటే.. పడకగదిలో గడియారం తప్పు కాదు. కానీ అది మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తే మాత్రం నిద్రకు శత్రువవుతుంది. చిన్న మార్పులు చేస్తే.. అదే గడియారం మీ ప్రశాంత నిద్రకు సహాయకుడిగా మారుతుంది.
