వింత నమ్మకాలు కానీ వాటిని నమ్మేవారి సంఖ్య మాత్రం అంత తక్కువ కాదు. ఇప్పుడు అలాంటి మరో నమ్మకం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. షూలో బిర్యానీ ఆకు (తేజపత్రం) పెట్టుకుంటే జీవితంలో అదృష్టం, విజయం మీ వెంట వస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ ట్రెండ్, ఇప్పుడు యువతలో కొత్తగా పాపులర్ అవుతోంది.
బిర్యానీ ఆకుకు చరిత్ర చాలా పాతది. ఇది కేవలం వంటలోనే ఉపయోగించబడే ఒక సుగంధ ద్రవ్యమని చాలామందికి అనిపించవచ్చు. కానీ పురాతన గ్రీస్, రోమ్ కాలంలో ఈ ఆకును గౌరవం, విజయం, గెలుపు ఇచ్చే ఆకుగా భావించేవారు. యుద్ధాల్లో గెలిచిన రాజులు, క్రీడల్లో ఛాంపియన్లు, గొప్ప కవులు బిర్యానీ ఆకులతో చేసిన కిరీటాలను ధరించేవారు. ఆ నమ్మకమే ఇప్పుడు “షూలో బిర్యానీ ఆకు” ట్రెండ్‌గా మళ్లీ వెలుగులోకి వచ్చింది.
ఈ పద్ధతిని ఫాలో అవేవారు, తమ షూలో ఒక ఎండిన బిర్యానీ ఆకును ఇన్‌సోల్ కింద ఉంచుతారు. దాంతో ప్రతి అడుగులోనూ నెగిటివ్ ఎనర్జీ దూరమై, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నమ్మకం. పాశ్చాత్య దేశాల్లో మొదలైన ఈ ఆచారం ఇప్పుడు మన దేశంలో కూడా బాగా పాపులర్ అవుతోంది.
ఇది కేవలం మూఢనమ్మకం కాదని, కొన్ని ప్రాక్టికల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. బిర్యానీ ఆకులో ఉండే సహజ సుగంధం షూలో ఉండే దుర్వాసనను తగ్గిస్తుంది. అదీ కాదు, ఇందులో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు పాదాలకు హాని చేసే బ్యాక్టీరియాను నియంత్రిస్తాయి. రసాయనాల అవసరం లేకుండానే ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది.
మన దేశంలో కూడా బిర్యానీ ఆకును అదృష్ట చిహ్నంగా చాలా కాలంగా భావిస్తారు. పర్సులో డబ్బు ఆకర్షించడానికి పెట్టుకోవడం, ఇంట్లో కాల్చి నెగిటివ్ ఎనర్జీ తొలగించడం వంటి పద్ధతులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు షూలో పెట్టుకోవడం అనే కొత్త ట్రెండ్ కూడా అదే నమ్మకానికి ఆధునిక రూపం.
సైకాలజీ పరంగా చూసినా ఇది ఓ పాజిటివ్ మైండ్‌సెట్‌ను కల్పించే చిన్న టెక్నిక్‌గానే నిపుణులు విశ్లేషిస్తున్నారు. షూ వేసుకునే ప్రతి ఉదయం మీ లక్ష్యం వైపు నడుస్తున్నాననే భావన కలిగించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సైకాలజిస్టులు అంటున్నారు. ఇది మ్యాజిక్ కాదు… కానీ మీ ఆలోచనల్ని పాజిటివ్ దిశగా మళ్లించే చిన్న సింబల్. అందుకే ఈ పద్ధతిని అనుసరించే యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
