చాలామందికి ఆఫీసు పని అయిపోయాక.. లేదా రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం అలవాటు. ఒకింత అలసట పోయేలా, ఫ్రెష్‌గా ఉండేలా రాత్రిపూట స్నానం చేయడం నిజానికి మంచిదే. కానీ స్నానం చేసిన వెంటనే మంచానికి చేరితే సమస్యలే ఎక్కువవని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద ప్రకారం స్నానం తర్వాత శరీరానికి కొంత గ్యాప్ ఇవ్వకపోతే అది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం అవుతుందంటున్నారు.
స్నానం తర్వాత శరీరం గది ఉష్ణోగ్రతకు కుదుర్కోవడానికి కొంత సమయం అవసరం. కానీ చాలా మంది స్నానం చేయగానే నిద్రలోకి జారుకుంటారు. దీంతో ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనమవుతుంది. శరీరానికి తడి, చల్లదనం వేగంగా చేరిపోవడం వల్ల తలనొప్పి, చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈ చిన్న సమస్యలు సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. రోజూ ఇలా జరుగుతుంటే రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది.
రాత్రి స్నానం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వల్ల కండరాలు పట్టేసినట్లు అనిపించడం.. మెడ లేదా భుజాల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా స్నానం తర్వాత వెంటనే ఫ్యాన్ కింద, ఎయిర్ కండిషనర్‌లో పడుకుంటే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి మరింత ప్రమాదం కలిగిస్తుంది. తడి జుట్టుతో పడుకోవడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావడం సాధారణం.
ఇవి నివారించాలంటే రాత్రి పడుకునే ముందు కనీసం ఒక నుంచి రెండు గంటల ముందు స్నానం చేయాలి. స్నానం తర్వాత తల తడిగా ఉంచకూడదు. డ్రైయర్ లేదా టవల్ ఉపయోగించి తల చల్లగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. వేసవిలో గోరువెచ్చటి నీటి అవసరం లేకపోవచ్చు కానీ శరీరం ఆరిపోవడానికి సమయం ఇచ్చే అలవాటు మాత్రం తప్పనిసరిగా పాటించాలి.
సరైన సమయంలో స్నానం, పూర్తిగా ఆరిపోయిన తర్వాతే పడుకోవడం శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది. ఫలితంగా నిద్రలో గుణాత్మకత పెరుగుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ప్రతి చిన్న అలవాటు చివరికి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రి స్నానం తర్వాత వెంటనే మంచం ఎక్కేయకుండా గ్యాప్ ఇవ్వడం మేలు చేస్తుంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)