బండ్ల గణేశ్ పొలిటికల్ రీఎంట్రీ… తెరపైకి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్!

బండ్ల గణేశ్ ఏమి చేసినా అతిగానే ఉంటుందని అంటుంటారు కొంతమంది. అభిమానించినా అతిగానే ఉంటుంది.. విమర్శించినా అలానే ఉంటుంది.. ఇక ఆన్ లైన వేదికగానూ. టీవీ ఇంటర్వ్యూలలోనూ అప్పుడప్పుడూ ఇచ్చే స్టేట్ మెంట్స్ కూడా అదేవిధంగా ఉంటాయని చెబుతుంటారు. దాన్ని సార్ధకం చేస్తూ… తాజాగా పొలిటికల్ రీ ఎంట్రీపై ఆన్ లైన్ వేదికగా స్పందించారు బండ్ల గణేశ్.

గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి, ఓడిపోయిన తర్వాత వెంటనే కనుమరుగైపోయిన నిర్మాత కం నటుడు బండ్ల గణేశ్.. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో తను రాజకీయాలకు దూరమని ప్రకటించుకున్నాడు. తనకు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు, శ్రేయోభిలాషులూ ఉన్నారని, అందుకే అన్ని పార్టీలతో సమదూరం పాటిస్తానని కూడా చెప్పుకున్నారు. ఒకానొక దశలో కేసీఅర్ ని టైగర్ అంటూ అకాశానికెత్తేశారు. మరోసారి రేవంత్ ని లైన్ అని పొగిడేశారు.

ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఈ ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో మరోసారి తన రాజకీయ పునఃప్రవేశంపై కీలక ప్రకటన చేశారు బండ్ల గణేశ్ . తను మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తనదైన శైలిలో ప్రకటించాడు.

“రాజకీయాలంటే నిజాయితీ. రాజకీయాలంటే నీతి. రాజకీయాలంటే కష్టం. రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ. రాజకీయాలంటే పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా”… ఇది తన పొలిటికల్ రీ ఎంట్రీపై బండ్ల గణేష్ స్టే మెంట్. అంటే… బండ్ల మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది కన్ ఫాం అన్నమాట. కాకపోతే… ఏ పార్టీలో చేరతారనే విషయంలో మాత్రం గణేశ్… సస్పెన్స్ మెయింటైన్ చేశారు.

ఆ సంగతి అలా ఉంటే… బండ్ల గణేశ్ ఇలా తన రాజకీయ పునఃప్రవేశంపై ప్రకటన చేశారో లేదో.. అలా ట్రోలింగ్ మొదలుపెట్టేశారు నెటిజన్లు. ఆన్ లైన్ వేదికగా బండ్లను ఒక ఆటాడుకోవడం స్టార్ట్ చేశారు. “అన్నా, మళ్లీ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ కొనుక్కోమంటావా” అంటూ లెక్కలేనన్ని కామెంట్లు పెడుతున్నారు.

కాగా… గతంలో తను ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో కోసుకుంటూనంటూ బండ్ల గణేష్ ఒక టీవీ ఇంటర్యూలో సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఇప్పుడు నెటిజన్లు మరోసారి గుర్తుచేస్తున్నారు.