ఆంధ్రపదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ తప్పదంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో తెలంగాణ నేతలు వేలు పెట్టడం ఎంతవరకు సబబు? అన్న చర్చ తెరపైకొచ్చిందిప్పుడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక ఎమ్మల్యే రఘునందన్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డంతో రఘునందన్ దిగొచ్చి, క్షమాపణ చెప్పక తప్పలేదు. రఘునందన్‌కి ముచ్చెమటలు పట్టించిన వైసీపీ శ్రేణులు, బండి సంజయ్‌ని మాత్రం అంత తేలిగ్గా వదిలేస్తారా.? బండి సంజయ్‌పై సోషల్ మీడియా వేదికగా వైసీపీ సానుభూతిపరులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి కాస్తో కూస్తో ఓటు బ్యాంకు వుంది.. కానీ, ఆంధ్రపదేశ్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.
ఆ పార్టీ పరిస్థతి ఆంధ్రపదేశ్‌లో మరీ తీసికట్టుగా వుందన్నది నిర్వివాదాంశం. పైగా, వైసీపీని విమర్శించే క్రమంలో టీడీపీ మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఆంధ్రపదేశ్‌లో బీజేపీ ఎదుగూ బొదుగూ లేకుండా పోవడానికి ప్రధాన కారణం. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల్ని లాగేయగలిగిన బీజేపీ, టీడీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా లాగలేకపోవడం.. ఏపీలో బీజేపీ స్థాయిని చెప్పకనే చెబుతుంది. ఇక, దుబ్బాకలోనూ, గ్రేటర్ ఎన్నికల్లోనూ అమలు పరిచిన వ్యూహమే, బీజేపీ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ అమలు చేయాలని చూస్తున్నా.. ఆ పార్టీకి అదంత తేలికైన వ్యవహారం కానే కాదు. ఏపీలో బీజేపీ కంటే, జనసేననే కాస్త మెరుగైన పరిస్థితిలో వుంది. కానీ, మిత్ర పక్షం జనసేనను కాదని బీజేపీ, తిరుపతిపై అత్యుత్సాహం చూపుతోంది. కేవలం ఆంధ్రపదేశ్‌లో దేవాలయాల మీద దాడులు అనే అంశం పట్టుకుని, బీజేపీ..
రాజకీయం చేయాలనుకుంటే.. అందునా, వైసీపీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ తప్పదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. ఏపీలో బీజేపీకి నష్టమే తప్ప లాభమేమీ వుండదు. పైగా, రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తోందో చెప్పకుండా, ఏపీ మీద బీజేపీ పెత్తనం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ అనే ప్రస్తావన తెచ్చిన బీజేపీ, ఆంధ్రపదేశ్‌లోనూ సర్జికల్ స్ట్రైక్స్, షాక్ ట్రీట్‌మెంట్.. అంటూ పడికట్టు పదాలతో చిత్ర విచిత్రమైన రాజకీయ స్టంట్లు చేస్తుండడం ఒకింత వింతగానే వుంది.