మనలో చాలామంది రోజువారీ జీవితంలో ఎక్కువగా తినే పండ్లలో.. అరటి పండు ప్రధానమైనది. ఇది సూపర్ ఫుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పండు రుచికరమే కాకుండా పోషకాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఫిట్‌నెస్ ప్రియులు, హెల్త్ కాన్షియస్ వ్యక్తులు అరటిని తమ డైట్‌లో భాగం చేసుకుంటారు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు తినడం మంచిదా కాదా.. అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంలో న్యూట్రిషనిస్టుల అభిప్రాయం ఏమిటో చూద్దాం.
ఖాళీ కడుపుతో అరటి తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో ఉన్న సహజ చక్కెరలు.. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్.. మానసిక, శారీరక ఉత్సాహాన్ని ఇస్తాయి. అందుకే ఉదయం వర్కౌట్స్ చేసే వారు లేదా బిజీగా ఉండే ఉద్యోగులు అరటిని త్వరగా తినగలిగే ఎనర్జీ ఫుడ్‌గా ఉపయోగించవచ్చు. అలాగే ఈ పండులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి అదనపు స్నాక్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. దీంతో బరువును నియంత్రించుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.
అయితే ఇదే అరటిపండు కొంతమందికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారికి ఉదయాన్నే తిన్నప్పుడు అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు రావచ్చు. ఇందులోని స్టార్చ్ గ్యాస్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు అరటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి తరువాత వెంటనే పడిపోతాయి. దీంతో ఆకలి, నీరసం మళ్లీ వెంటాడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరటిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి అనేక పోషకాలు ఉన్నా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉంటాయి. కాబట్టి కేవలం అరటిపండుతోనే ఉదయం ఆహారం పూర్తి చేయడం సరైన ఎంపిక కాదు. దీనిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినడం ఉత్తమం. ఉదాహరణకు, అరటిని బాదం, వాల్‌నట్స్ లాంటి నట్స్ లేదా చియా, ఫ్లాక్స్ సీడ్స్‌తో కలిపి తింటే ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ కూడా అందుతాయి. అలాగే గ్రీక్ యోగర్ట్‌తో కలిపి బ్రేక్‌ఫాస్ట్ బౌల్‌గా తీసుకోవచ్చు. బనానా స్మూతీ చేసుకుని పాలకూర, బెర్రీస్, ఓట్స్‌తో మిక్స్ చేస్తే మరింత న్యూట్రిషన్ లభిస్తుంది.
నిపుణుల సూచన ప్రకారం, అరటి పండును పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకుండా ఇతర పోషక ఆహారాలతో కలిపి తీసుకోవడం శరీరానికి మేలని చెబుతున్నారు. ఇలా చేస్తే అరటి పండు ఇచ్చే ఎనర్జీ, ఫైబర్ ప్రయోజనాలు దొరకటమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
