అయ్యోపాపం బాబూమోహన్.! కథ అడ్డం తిరిగిందే.!

ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని ప్రకటించేశారు సినీ నటుడు, మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డారాయన. అంతే కాదు, తననూ తన కొడుకునీ విడదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారాయన.

బాబూమోహన్ గతంలో టీడీపీలో పని చేశారు. ఆ తర్వాత ఆయన గులాబీ పార్టీలో పని చేశారు. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బలమైన ముద్ర వేస్తుందన్న నమ్మకంతోనూ టిక్కెట్టునీ గట్టిగా ఆశించారుగానీ, బాబూమోహన్‌కి భంగపాటే ఎదురయ్యింది.

సాధారణంగా టిక్కెట్ దొరక్కపోతే పార్టీ మారిపోవాలి. కానీ, బాబూమోహన్ మాత్రం ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా వుంటాను.. ఎన్నికల్లో పోటీ చేయను.. అంటూ బాబూమోహన్ వెల్లడించడం గమనార్హం.

బీజేపీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది సినీ ప్రముఖులు ప్రయత్నించారు. ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని కోల్పోయారో, ఆ వెంటనే ఆయా సినీ ప్రముఖుల ఆశలు అడియాసలైపోయాయ్.

ప్రస్తుతానికి వున్న ఈక్వేషన్స్ ప్రకారం చూసుకుంటే తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా బలపడింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి పోటీ చేసినా ఖర్చు దండగ వ్యవహారమే అవుతుంది. బాబూమోహన్ కూడా ఈ విషయంలో ఒకింత స్పష్టతతోనే వున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి, బీజేపీకి తెలంగాణలో సరైన అభ్యర్థులు లేరు. అలాంటప్పుడు, సినీ గ్లామర్‌ని వాడుకుంటే బావుండేది కదా.!