క్రికెట్ లో బ్యాట్స్ మెన్ కి సిక్స్ కొట్టినా రానంత సంతోషం.. ఆ బ్యాట్స్ మెన్స్ కి క్లీన్ బౌల్డ్ చేస్తే బౌలర్ కి తప్పకుండా వస్తుంది. ఇక ఫాస్ట్ బౌలర్స్ ఆ పనిచేసినప్పుడు స్టంప్స్ విరిగి ముక్క ఎగిరిపడితే… ఆ మాస్ సీన్ గురించి, ఆ సమయంలో ఆ బౌలర్ పడే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే… ఈ మాస్ సీన్, ఆకాశాన్నంటే బౌలర్ ఆనందం విలువ కొన్ని లక్షలని చెబుతున్నారు క్రికెట్ పెద్దలు!
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో బౌలింగ్ కు వచ్చి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై జనాలకు షాకిచ్చాడు. అంతేకాదు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. విచిత్రం ఏమిటంటే.. ఆ రెండు సందర్భాల్లోనూ అర్ష్ దీప్ ధాటికి వికెట్లు విరిగిపోయాయి… వాటి ముక్కలు ఎగిరి పడ్డాయి! ఈ మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఆ సంగతి అలా ఉంటే… విరిగిపోయిన వికెట్ల వల్ల బీసీసీఐకి అక్షరాలా 80లక్షల రూపాయలు నష్టం అని తెలుస్తుంది. ఈ ఐపీఎల్ లో జింగ్ బెయిల్స్ స్టంప్స్ ను వాడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంప్స్‌లో ఎల్ఈడీ బల్బులు, కెమెరా, జింగ్ బెయిల్స్ ఉంటాయి. అయితే… ఈ ఒక్కో వికెట్ సెట్ ఖరీదు 48 వేల డాలర్లు అంట. అంటే దాదాపు రూ.40 లక్షలు అన్నమాట. ఇంకో విచిత్రం ఏమిటంటే… ఈ మూడు వికెట్లలో ఒకటి పాడైనా కూడా… సెట్ మొత్తం మార్చాల్సిందేనంట.
అంటే… అర్ష్ దీప్ చివరి ఓవర్లో రెండు సార్లు వికెట్లు విరగొట్టడం వల్ల బీసీసీఐకి దాదాపు రూ.80 లక్షల నష్టం వాటిల్లిందన్నమాట! దీంతో… “బాబ్బాబు… వికెట్లు విరగ్గొట్టేస్థాయిలో బౌలింగ్ వెయ్యకండిరా.. అని బీసీసీఐ రిక్వస్ట్లు పెడుతున్నట్లు… కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!