Atchannaidu – Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. బయట ఉండి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, ప్రజా సమస్యలపై చర్చించాల్సింది అసెంబ్లీలో అని, వీధుల్లో కాదని హితవు పలికారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు ట్విట్టర్ (X) వేదికగా జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
“జగన్ రెడ్డికి నా సవాల్! బయట రోడ్లపైన, కేసుల మాటున జైలు ఆవరణలో, లేక ప్యాలెస్‌లలో కూర్చుని అసంబద్ధమైన ఆరోపణలు చేయడం, నిరాధారమైన గందరగోళపు ప్రచారాలు సృష్టించడం మీ విధ్వంసక సిద్ధాంతం కావచ్చు” అని మంత్రి మండిపడ్డారు.
ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వానికి చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. “మాకు గుండాయిజం తెలియదు. దోపిడీలు, దొంగతనాల చరిత్ర లేదు. అక్రమ సంపాదన, అడ్డగోలు కేసుల సంస్కృతి మాకు అలవాటు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మాకు తెలిసింది కేవలం సుపరిపాలన, అభివృద్ధి మరియు ప్రజా సమస్యలపై పారదర్శక చర్చ మాత్రమే” అని పేర్కొన్నారు.

“మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజా సమస్యలపై మా ప్రభుత్వంతో నిజాయతీగా చర్చించే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టండి. అక్కడే చర్చిద్దాం, అక్కడే తేల్చుకుందాం. ప్రజా సమస్యలకు అసెంబ్లీ వేదిక కావాలి, వీధులు కాదు” అని అచ్చెన్న స్పష్టం చేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్ తన నాయకులను అదుపులో ఉంచలేక అరాచకానికి ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజాధనాన్ని వృథా చేసిన వైసీపీ నేతలు, నేడు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ప్రజలకు జవాబు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉందని, చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

