Vangalapudi Anitha: విధి నిర్వహణ అంటే కేవలం యూనిఫాం వేసుకోవడమే కాదు, అంతకు మించి మానవత్వం, బాధ్యత అని నిరూపించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా అభినందించారు. గురువారం ఉదయం విజయవాడలోని మంత్రి నివాసంలో జయశాంతి కుటుంబంతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు.
సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ సమయంలో విధుల్లో లేకపోయినా, తన చంటిబిడ్డను చంకనెత్తుకుని రంగంలోకి దిగారు రంగంపేట కానిస్టేబుల్ జయశాంతి. అంబులెన్స్‌లకు దారి కల్పిస్తూ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం హోంమంత్రి అనిత దృష్టికి వెళ్లడంతో ఆమె వెంటనే స్పందించారు.

రెండు రోజుల క్రితమే జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన మంత్రి, ఆమె కోరిక మేరకు ఈరోజు స్వయంగా కలిశారు. జయశాంతి కుటుంబంతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేస్తూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విధి పట్ల నిబద్ధత కనబరిచినందుకు జయశాంతిని మంత్రి దుశ్శాలువాతో సత్కరించారు. “తల్లిగా బిడ్డను చూసుకుంటూనే, సామాజిక బాధ్యతతో వ్యవహరించిన జయశాంతి వంటి వారే పోలీసు శాఖకు ఆదర్శం” అని మంత్రి కొనియాడారు.
“హోంమంత్రిని కలవడం, ఆమె చేతుల మీదుగా గౌరవం పొందడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం. ఈ గుర్తింపు నాపై మరింత బాధ్యతను పెంచింది.” — జయశాంతి, మహిళా కానిస్టేబుల్
పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా వ్యవహరించిన జయశాంతిని ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక మహిళగా, తల్లిగా మరియు బాధ్యతాయుతమైన అధికారిగా ఆమె చూపిన చొరవ నిజమైన సేవకు నిదర్శనంగా నిలిచింది.

