సెప్టెంబర్ 21 వరకు ఇప్పటికే విధించిన స్టేటస్ కోను పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాజధాని తరలింపు అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు జగన్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు నిర్మాణాలకు కూడా వర్తిస్తాయంటూ… పిటిషన్లలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా కోర్టు నోటీసులు పంపింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల అధ్యక్షులకు కూడా కోర్టు నోటీసులు పంపించింది.
నోటీసులు పొందిన వాళ్లంతా కౌంటర్ దాఖలు చేయాలని అనుకుంటే.. వచ్చే మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది.
మరోవైపు స్టేటస్ కో అమలులో ఉన్న సమయంలో వైజాగ్ లో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుంది? అది కోర్టు ధిక్కరణ కేసు కిందికి రాకుండా మీరు ఎలా ఆపగలరు? దానిపై మీ వివరణను రెండు వారాల్లో కోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు సీఎస్ ను ఆదేశించింది.
కరోనా నేపథ్యంలో పిటిషన్ల విచారణను ఫిజికల్ గా నిర్వహించాలా? లేక వీడియో కాన్ఫరెన్స్ తో చేపట్టాలా? అనే దానిపై విచారణ సమయానికి ఓ వారం ముందే నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలు అయిన పిటిషన్ పై మరోసారి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
దానితో పాటుగా రాజధాని రైతు పరిరక్షణ సమితితో పాటు కొందరు రైతులు వేసిన పిటిషన్లపై దాఖలు చేసిన కౌంటర్ ను కలిపి మిగిలిన పిటిషన్లతో పాటుగా అడాప్షన్ మెమోను వేయాలంటూ కోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్లపై వాదనలు వినిపించే లాయర్ల పేర్లను రిజిస్ట్రార్ జ్యుడీషియల్ కు ముందే తెలియజేయాలంటూ హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ తేదీ నుంచి రోజూ వారీగా పిటిషన్లపై విచారణ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వంపై విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ నితీశ్ గుప్తా.. హైకోర్టులో దాఖలు చేశారు.