దేశ జనాభా దినదినాభివృద్ధి చెందుతుంటుంది. వారికి ఇంత నీడ కల్పించడానికి ఆ నిష్పత్తిలో భూమి వైశాల్యం మాత్రం పెరగదు. ఉన్నంతలోనే సర్దుబాటు చేస్తూ ప్రజలకు గూడు కల్పించడం ప్రభుత్వం బాధ్యత. జ్ఞానం లేదనుకునే పిచ్చుకలు, కాకులు సైతం గూళ్ళను ఏర్పరచుకుంటాయి. మరి మనిషికి మాత్రం ఇల్లు అవసరం లేదా? ఒక మనిషి జీవితంలో చిన్నదో పెద్దదో గృహం ఏర్పరచుకోవడం అనేది అతి పెద్ద విజయంగా భావించబడుతుంది. సొంత ఇల్లు అనేది మనిషి ఆత్మగౌరవానికి చిహ్నం. తిన్నా తినకపోయినా తలదాచుకోవడానికి పూరిగుడిసె కలిగివున్నా మనిషి నిర్భయంగా జీవించగలడు. అందుకే ప్రజల శ్రేయస్సు కోరుకునే ఏ ప్రభుత్వం అయినా పేదవాడికి గూడు కల్పించాలని తహతహలాడుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి సుమారు ముప్ఫయి ఒక్క లక్షలమందికి నేటినుంచి రాబోయే పదిహేను రోజుల్లో ఇంటి స్థలాలు అందించబోతున్నది. అంతే కాకుండా మొత్తం ఇరవై ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో పదహారు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ చరిత్ర సృష్టించబోతున్నది. చంద్రబాబు లాగా కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన భ్రమరావతిలా కాకుండా పేదింటి అక్కచెల్లెళ్లకు ఇల్లు కట్టిసూ అన్ని రకాలైన మౌలిక వసతులతో పదిహేడు వేల కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించి ఒక్క నయాపైసా కూడా తీసుకోకుండా ఉచితంగా అందిస్తూ తమది పేదల పక్షం అని నిరూపించుకుంటున్నది. అంతేకాకుండా ఒక లక్షా నలభైమూడువేలమంది tidko ఇళ్ల లబ్ధిదారులకు మూడువందల చదరపు అడుగుల ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే అందిస్తుండటం మరో గొప్ప విశేషం. దీనికయ్యే సుమారు నాలుగువేల కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరిస్తున్నది.
నిజానికి ఈ మహత్తర యజ్ఞం ఈ సంవత్సరం తొలి మాసాల్లోనే మొదలు కావాల్సింది. కానీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు, బీజేపీ ఇంకా అనేకమంది జగన్మోహన్ రెడ్డి ద్వేషులు న్యాయస్థానాలను ఆశ్రయించి, పిల్స్ వేసి, దావాలు వేసి అనేకరకాల అడ్డంకులను సృష్టించారు. ఒకేసారి ఇన్ని లక్షలమంది పేదవారికి గృహవసతి కల్పిస్తే ఎక్కడ వారంతా వైసిపి అభిమానులు అవుతారో అన్న రాజకీయ స్వార్ధం, దుర్భుద్ధి ప్రజలకు, వారి ప్రయోజనాలకు తాము ద్రోహం చేస్తున్నామేమో అన్న కనీస మానవత్వపు ఆలోచనలు కూడా కలగకపోవడం శోచనీయం. చివరకు నిన్న రాష్ట్ర హైకోర్టు ఒక బీజేపీ నాయకుడు వేసిన పిటీషన్ ను కొట్టేయడంతో ఇళ్ల నిర్మాణ, ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. రాక్షస వధ జరగగానే యాగప్రారంభం మొదలైనట్లుగా పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాన ఈ లోకోత్తర యజ్ఞం ప్రారంభించబడుతున్నది.
చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్న పాపాన పోలేదు. కుబేరులను మాత్రమే అధికంగా ఇష్టపడే చంద్రబాబు పేదలను అతిహీనంగా చూస్తాడు. అందుకే ఆయన రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు..ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుండా అయిదేళ్లకాలం అమరావతి అంటూ జపం చేసి చివరకు ప్రజలతో ఛీత్కరించబడ్డాడు. కానీ, తద్భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వయసులో, అనుభవంలో చిన్నవాడైనా, పేదలపట్ల, తన హామీల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ రాబోయే పదిహేను రోజుల్లో ముప్ఫయి లక్షల కుటుంబాల కుటుంబాల హృదయాల్లో కోవెల నిర్మించుకున్నాడు.
ఇక ఈ కార్యక్రమం మీద కొన్ని అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు కొందరు. ఈ పధకానికి వైఎస్సార్ జగనన్న పేరు పెట్టారని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో అనేకమంది దేశనాయకులు, మహనీయుల పేర్లతో కాలనీలు, వీధులు, అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో వందల కొద్దీ కాలనీలు ఉన్నాయి. చివరకు చంద్రబాబు నాయుడు మనుమడు దేవాన్ష్ పేరుతో కూడా కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు అన్నీ ఆయా నాయకులు ఏర్పరచినవి కావు. కానీ, మహనీయుల సేవలను మర్చిపోకూడదనే సదాశయంతో నాయకుల పేర్లు పెడతారు. ఈ బృహత్తర పధకాన్ని రూపొందించి అమలు చేస్తున్న జగన్ పేరు పెడితే తప్పేముంది? ప్రజలకు మేలు జరగడమే ప్రధానం తప్ప పేరు ఎవరిదైతే ఏమిటి? తమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశించడం దోషమా? సంకుచిత విమర్శలు వద్దు.
ఈ కార్యక్రమం అనుకున్న విధంగా పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదే ఇప్పుడు ప్రతిపక్షాల బాధ…జగన్మోహన్ రెడ్డిని నరనరానా ద్వేషించే వారి ఆక్రోశం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు