ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు నిన్నటి వరకు రెండున్నర లక్షలు దాటాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 85వేలకు పైగా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏపీలో మరణాలు 2,300 వరకు ఉంటే, తెలంగాణలో 650కి పైగా ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర ఐదున్నర లక్షల కేసులు, తమిళనాడు మూడు లక్షలకు పైగా కేసులు తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ పదో స్థానంలో ఉంది. రికవరీల్లోను మూడో స్థానంలోనే ఉంది. దీంతో కరోనా విషయంలో ప్రతిపక్ష తెలుగుదేశం జగన్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు గుప్పిస్తోంది.
కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న మాట్లాడుతూ.. కరోనాకు జగన్ సర్కారు గేట్లు ఎత్తేసిందని, నాలుగు నెలల క్రితం కేసుల సంఖ్యలో అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లారని, దూరదృష్టి లోపించడం, సమీక్షల్లో వైఫల్యం, దిశానిర్దేశనం లేకపోవడం, తేలిగ్గా తీసుకోవడం, ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వల్ల కేసులు పెరుగుతున్నాయన్నారు. రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. కేవలం యనమలనే కాదు.. తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కరోనా విషయంలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
తొలుత విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు
అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందనేది వైసీపీ వాదన. కరోనా ప్రారంభమైన మార్చి నెలలో లోకల్ బాడీ ఎన్నికలను నాటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉద్దేశ్యం ఎలా ఉన్నా ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా వ్యాప్తి తగ్గించగలిగారని, లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అప్పట్లో అందరూ గుసగుసలాడుకున్నారు. అప్పుడు వైసీపీకి ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. జగన్‌కు అనుభవం లేకపోయినప్పటికీ.. ఆ తర్వాత కరోనా కట్టడికి అతని పరిపాలనా విభాగం తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా నియంత్రణలో ఉందని అంటున్నారు.
తెలంగాణలో ‘జగన్’ నినాదం
కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కేసులు పెరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కానీ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాత్రం పక్క రాష్ట్రాల్లోను ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా చేస్తోందని చెబుతూ కేసీఆర్‌ను దుయ్యబడుతున్నాయి. పక్కన అనుభవం లేని సీఎం ఉన్నప్పటికీ తీసుకుంటున్న చర్యలు బాగా ఉన్నాయని తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు రోజుకు పదిసార్లు జగన్‌ను పలవరిస్తున్నాయి!
కేసులు పెరగడానికి కారణం ఇదీ…
ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోందని, అందుకే కేసుల సంఖ్య పెరుగుతోందని వైసీపీ కేడర్ చెబుతోంది. టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. తెలంగాణ ప్రతిపక్ష నేతలు కూడా దీనిని గుర్తు చేస్తున్నారు. మొదట వచ్చిన విమర్శలు పక్కన పెడితే.. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఆ తర్వాత టెస్టుల్లో వేగం పెరిగింది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 26.50 లక్షల టెస్టులు నిర్వహించగా, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల టెస్టులు కూడా పూర్తి కాలేదు. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 57 వేలకు పైగా టెస్టులు నిర్వహించగా, తెలంగాణలో మంగళవారం దాదాపు 23వేల టెస్టులు నిర్వహించారు.
జగన్ ప్రభుత్వం టెస్టుల్లో ఎంత ముందు ఉందో తెలుసుకోవడానికి ఈ లెక్క చాలు అంటున్నారు. మరో విషయం ఏమంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మినహా మిగతా పార్టీలు కరోనా విషయంలో జగన్‌ను పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఇది కూడా జగన్ పనితీరుకు నిదర్శనం అంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతానని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షంగా ఎదుగుదామని భావిస్తున్న బీజేపీ కూడా కరోనా విషయంలో దూకుడుగా లేదని గుర్తు చేస్తున్నారు. కరోనా విషయంలో జగన్ పనితీరును అందరూ ప్రశంసిస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి మాత్రం కనిపించడం లేదనేది వైసీపీ వాదన.