తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ పరిస్థితేంటి.? ‘డబుల్ సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి.. ఓటర్లే ఆ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి..’ అంటున్నారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు. తెలుగుదేశం పార్టీపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా ఓటర్లు సర్జికల్ స్ట్రైక్స్ చేయాలన్నది జీవీఎల్ ఉవాచ. తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో ఈ ‘సర్జికల్ స్ట్రైక్స్’ మాట బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో ఈ వ్యవహారంపై పెను దుమారం కూడా రేగింది. ఎలాగైతేనేం, బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకుంది.. అధికార టీఆర్‌ఎస్‌కి గట్టి పోటీ ఇచ్చింది గ్రేటర్ ఎన్నికల్లో. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగని, అదే ఉత్సాహం బీజేపీకి, తిరుపతి ఉప ఎన్నికలో కూడా కన్పిస్తుందా.? అంటే, కష్టమే.!
ఈ సర్వే ఎవరు చేశారు.? ఎలా బయటకొచ్చింది.?
ఇప్పటికిప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరిగితే భారతీయ జనతా పార్టీకి వచ్చే ఓట్లు 8 వేలు మాత్రమేనట. ఓ సర్వే తేల్చింది ఈ విషయాన్ని. ఎవరు చేశారు.? ఎప్పుడు చేశారు.? అన్నదానిపై స్పష్టత లేదు. అధికార వైసీపీకి 7 లక్షల ఓట్లు రాబోతున్నాయట. టీడీపీకి 4 లక్షల ఓట్లు వస్తాయనేది ఓ అంచనా. కాంగ్రెస్ పార్టీకి 30 వేల ఓట్లు అట. నోటాకి కూడా అటూ ఇటూగా పాతిక వేల ఓట్లు వస్తాయట. అంటే, ‘నోటా’ కంటే దారుణంగా వుండబోతోందన్నది సదరు సర్వే చెబుతున్నమాట.
జనసేన కినుక.. బీజేపీకి నష్టమే.!
మిత్రపక్షం జనసేనకు బీజేపీ వెన్నుపోటు పొడిచినట్లే కనిపిస్తోంది. ‘మేమే పోటీ చేస్తాం..’ అని తాజాగా ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ప్రకటించేశారు. అదేంటీ, కమిటీ వేసి.. అభ్యర్థిని ఉమ్మడిగా ప్రకటిద్దామనుకున్నాం కదా.? అంటూ జనసేన నేతలు బేల చూపులు చూస్తున్నారు బీజేపీ వైపు. ఎటూ ఆ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నాయకుడే అవుతాడు కాబట్టి, మేమే ప్రకటించేసుకున్నాం.. అన్నట్లుంది బీజేపీ తీరు. ఇది బీజేపీకి ఖచ్చితంగా నష్టం చేసే విషయమే.
గ్రేటర్‌కీ, తిరుపతికీ పోలికేంటి.?
గ్రేటర్ హైద్రాబాద్ పరిస్థితులు వేరు. తిరుపతి ఉప ఎన్నిక పరిస్థితి వేరు. ఆ మాటకొస్తే, దుబ్బాక ఉప ఎన్నికతోనూ తిరుపతి ఉప ఎన్నికను పోల్చడానికి వీల్లేదు. బీజేపీ, తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మాత్రం ‘వాపుని చూసి బలుపు’ అనుకుంటోందన్నది రాజకీయ పండితుల మాట. కానీ, కమలనాథులు మాత్రం, వైసీపీనే ఓడించేస్తామని ‘అతి’ ధీమా ప్రదర్శించేస్తున్నారు.