అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమయ్యింది. దుండగులు ఈ రథాన్ని తగలబెడితే, తేనె తుట్టెను తీసే ప్రయత్నంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లే రథం కాలిపోయిందని అధికార పార్టీ పెద్దలు సెలవిచ్చారు. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. ప్రభుత్వం చొరవతో (విపరీతంగా పెరిగిన ఒత్తిడి కారణం కావొచ్చు..) కొత్త రథం అయితే తయారైందిగానీ, పాత రథం ఎందుకు తగలబడిపోయిందన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. యావత్ హిందూ సమాజం తీవ్ర ఆవేదనకు గురయ్యింది అంతర్వేది రథం దగ్ధమవడంపై. లక్ష్మీనరసింహస్వామి.. అంటే హిందూ మతంలో చాలా చాలా ప్రత్యేకమైన దేవుడు. లక్ష్మీనరసింహస్వామి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, జీవితాలు తల్లకిందులైపోతాయన్న భయంతో కూడిన భక్తి హిందువుల్లో వుంటుంది. పైగా, అంతర్వేది తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రత్యేకమైన పవిత్ర పుణ్యక్షేత్రం. అసలు ఆ రథాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఎవరికుంది.? ఏ కుట్రలతో రథాన్ని తగలబెట్టారు.? అన్నదానిపై ప్రజల అనుమానాలకు ఇంకా నివృత్తి దొరకలేదు. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత విచారణ ఏమయ్యిందన్నదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రికార్డు సమయంలో రథం తయారీకి ఆదేశించడం, రథం తయారీ పూర్తవడం, రథోత్సవానికి రథం సిద్ధమవడం గమనార్హం. ఈ వేగం, కేసు విచారణలోనూ వుండి వుంటే, రాష్ట్ర ప్రజల మదిలో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేసి వుండేవారే. ‘రథాలు తగలబెడుతున్నవారే రథోత్సవాలు చేస్తున్నారు..’ అని ఆ మధ్య ఓ సందర్భంలో స్వయంగా వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. మరి, అలాంటప్పుడు.. వారిని అరెస్ట్ చేయాలి కదా.? ‘టీడీపీ వల్లే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి.. టీడీపీ ఆపేయడం వల్లే దాడులు ఆగిపోయాయి..’ అని తాజాగా కొందరు వైసీపీ ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. మరి, టీడీపీపై ఈ విషయమై చర్యలేమన్నా తీసుకున్నారా.? అంటే అదీ లేదాయె. ఇన్స్యూరెన్స్ సొమ్ములతోనో, ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించో.. ఎలాగైతేనేం రథం తయారయ్యింది.. కానీ, రథం దగ్ధం తాలూకు ఆవేదన మాత్రం హిందువుల్లో చల్లారే అవకాశమే లేదు.