త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగబోతోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో సత్తా చాటాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి భారతీయ జనతా పార్టీ వల వేస్తోంది. అయితే, ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన ఏమీ చేయడంలేదంటూ జానారెడ్డి తనయుడు చెబుతున్నారు. కానీ, ముహూర్తం ఖరారయ్యిందనీ రేపో మాపో జానారెడ్డి బీజేపీలో చేరతారనీ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఈ ఉప ఎన్నికకు ఇంకా సమయం వున్నప్పటికీ, ఇప్పటినుంచే తెలంగాణలో సమీకరణాలు మార్చేయాలన్నది బీజేపీ వ్యూహం.
బీజేపీలోకి వలసలు.. కేసీఆర్‌కి టెన్షన్లు..
గ్రేటర్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పరువు నిలబెట్టుకున్నా, 40కి పైగా సీట్లు కోల్పోయి చతికిలపడింది తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్‌ఎస్. సెంచరీ కొడతామని చెప్పి, ఆఫ్ సెంచరీకే పరిమితమైపోయింది టీఆర్‌ఎస్. దాంతో, మొహం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ‘సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం..’ అని బాలకృష్ణ ఏదో సినిమలో డైలాగ్ చెప్పినట్లు తయారైంది టీఆర్‌ఎస్ పరిస్థితి. ఇప్పుడు టీఆర్‌ఎస్ ముందు పెద్ద బాధ్యతే వుంది.. అది ప్రజా ప్రతినిథుల్ని కాపాడుకోవడం. ఎన్నికైన కార్పొరేటర్లను జారీపోకుండా చేసేందుకు మంత్రి కేటీఆర్, రేపు కార్పొరేటర్లు.. అలాగే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. వారిలో చాలామంది ఇప్పటికే బీజేపీతో టచ్‌లో వున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిన్న దుబ్బాక, రేపు నాగార్జునసాగర్..
దుబ్బాక దెబ్బతో టీఆర్‌ఎస్‌కి మైండ్ బ్లాంక్ అయిపోయింది.. గ్రేటర్ ఎన్నికల్లో దెబ్బతో టీఆర్‌ఎస్ బెంబేలెత్తిపోయింది. నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్‌లో తలెత్తే ఉప ఎన్నిక, తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త టెన్షన్ తెచ్చిపెడుతోంది. అక్కడ గనుక టీఆర్‌ఎస్ ఓడితే అంతే సంగతులు. పైగా, అక్కడ టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఏదో లక్ కొద్దీ గెలిచింది. ఎందుకంటే, అక్కడ జానారెడ్డి చాలా పవర్‌ఫుల్. టైమ్ బ్యాడ్.. ఆయన ఓడిపోయారు ఆ ఎన్నికల్లో. ఈసారి జానారెడ్డి మీద సింపతీనే ఎక్కువ కనిపించబోతోంది.
బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారా.?
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా చాలామంది నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి కోసం రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి ఫైట్ నడుస్తోంది. ఇంకా ఏముందక్కడ కొట్టుకోవడానికి.? అన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లోనే నడుస్తుండడం గమనార్హం.