ఖేల్‌ ఖతం: అప్పుడు టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌.!

Another political party is disappearing from Telangana politics

తెలంగాణ రాజకీయాల నుంచి మరో రాజకీయ పార్టీ అంతర్ధానం కాబోతోంది. అదే కాంగ్రెస్‌ పార్టీ. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఇదే వాస్తవం.! గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన అత్యంత దారుణమైన ఫలితాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. నిజానికి, ఈ పని ఆయన ఎప్పుడో చేసి వుండాలి. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వుంటే బావుండేదేమో. కానీ, ఆయన రాజీనామా చేస్తారు సరే, కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో నడిపేదెవరు.?

Another political party is disappearing from Telangana politics
Another political party is disappearing from Telangana politics

నేతలకు కొదవ లేదు.. ఎవరికీ దమ్ము లేదు.!

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ‘సీనియర్‌ నాయకుల’ కొరత లేదు. కానీ, ఏం లాభం.? ఎవరికీ దమ్ము లేదు. ఒకవేళ దమ్మున్న నేతలున్నా, వారిని ఎదగనీయరు. అదే అసలు సమస్య. కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యమే ఆ పార్టీకి ప్రధాన శతృవు. ఎందుకంటే, ఎవరన్నా ఓ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏదన్నా విషయంలో ‘లీడ్‌’ తీసుకుంటే, ఇక అంతే సంగతులు. మిగతా నేతలు కట్టగట్టుకుని మరీ ఆ నాయకుడికి ఎదురు తిరుగుతారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కొంతమంది గట్టిగా తిరిగినా, చాలామంది లైట్‌ తీసుకున్నారు.

నెక్స్‌ట్‌ రేవంత్‌ రెడ్డేనా.!

కాంగ్రెస్‌ పార్టీలో తెలంగాణ సారధ్య బాధ్యతలు అందుకునే నెక్స్‌ట్‌ మహానుభావుడు ఎవరు.? అంటే, రేవంత్‌రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. కానీ, ఆయనకు ఆ ఛాన్స్‌ దక్కకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో గట్టి పోటీ వుంది రేవంత్‌ రెడ్డికి. అయితే, కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఎలా వుంటాయో చెప్పలేం. అధిష్టానం కూడా పార్టీ నాశనమైపోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్‌ పార్టీది. గ్రేటర్‌ ఎన్నికల సమయంలో చాలామంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. రేవంత్‌ కూడా రేపో మాపో బీజేపీలో చేరిపోతారనే ప్రచారం జరుగుతోంది.

రేవంత్‌ రెడ్డికి అదే బెస్ట్‌ ఆప్షన్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కంటే, బీజేపీలో చేరిపోవడం రేవంత్‌ రెడ్డికి చాలా చాలా లాభించే అంశం. కాంగ్రెస్‌లో వుంటే, చీవాట్లు తప్ప మిగిలేదేమీ వుండదు. టీడీపీని కాదనుకుని రేవంత్‌ రెడ్డి వచ్చింది.. కాంగ్రెస్‌లో ఉద్ధరించేద్దామనే. కానీ, కాంగ్రెస్‌లోనూ ఆ పరిస్థితుల్లేవు. ఇంకా టీడీపీలోనే వుండి వుంటే, రేవంత్‌ రెడ్డికి కాస్తో కూస్తో పవర్‌ వుండేదేమో. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే ఆయన ఎంపీ అయ్యారు. కానీ, ఆ కాంగ్రెస్‌ పార్టీని అంటిపెట్టుకుని ఎక్కువ రోజులు వుండడం ఆయనకు నష్టమే తప్ప ఏ రకంగానూ లాభం కాదు.

అప్పుడు టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌

గత గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయింది. అంటే, రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, బీజేపీ తప్ప మరో పార్టీ వుండకపోవచ్చన్నమాట. కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ వున్నా లేనట్టే. నాయకుల్లేని పార్టీకి.. సారధులు మాత్రం వుంటారు.. ఇప్పుడు తెలంగాణ టీడీపీకి ఎల్‌ రమణ సారధ్యం వహిస్తున్నట్లే.