పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి, కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అయితే ఆ ఘనతను ఇప్పుడు చంద్రబాబు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టులో జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. గతంలో ఆయన ప్రభుత్వం అవలంబించిన నాసిరకం పనుల వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. అంతర్జాతీయ నిపుణులు సైతం ఆ పనులను తప్పుబట్టారని తెలిపారు. “నిబంధనల ప్రకారం 1.5 మీటర్ల వెడల్పుతో డయాఫ్రం వాల్ నిర్మించాలి. కానీ కమీషన్ల కోసం కేవలం 0.9 మీటర్ల వెడల్పుతోనే నాసిరకంగా నిర్మించారు” అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు కూడా సరైన పద్ధతిలో లేవని దుయ్యబట్టారు.
కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. “1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు ఎప్పుడూ కుప్పంకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. 2024 ఫిబ్రవరిలో జగన్ నీళ్లు ఇస్తే, ఇప్పుడు లైనింగ్ పనుల పేరుతో సీఎం రమేష్ కంపెనీకి డబ్బులు కట్టబెడుతున్నారు” అని ఆరోపించారు. మరొకరు చేసిన పనికి పేరు తెచ్చుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రి రామానాయుడుపై కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ఆయన్ని ‘రామా నాయుడా లేక డ్రామా నాయుడా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో చర్చకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.


