ఆఫ్గానిస్తాన్ జట్టు వరల్డ్ కప్ – 2023 ఈ టోర్నీ లో అడుగుపెట్టే సమయానికి.. కనీసం ఒకటి రెండు మ్యాచుల్లో అయినా గెలిచే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు… ఆఫ్గాన్ ఓడించే జట్లు ఇంగ్లాండ్, పాకిస్థాన్ అవుతాయని. ఇలా ఎవరి ఊహకూ అందకుండా… వరల్డ్ కప్ మ్యాచులలో అసలు సిసలు మజా అందిస్తుంది ఆఫ్గాన్.
అవును… డిఫెండింగ్ ఛాంపియన్, ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ ను ఓడించి పెను సంచలనం సృష్టించిన అఫ్గానిస్థాన్.. అదే పోరాట పఠిమ కంటిన్యూ చేస్తూ తాజాగా మరో సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్ ను పసికూనను చేసి విరుచుకుపడింది. ఫలితంగా… అఫ్గాన్ వీరుల దెబ్బకు పాకిస్థాన్ కుదేలైంది. ఫలితంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ అనంతరం పాక్ లో ఆత్మష్తైర్యం చచ్చిపోయిందని వినిపిస్తున్న మాటలకు బలం చేకూరినట్లయ్యింది!
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ చూపించిన ధైర్యం, తెగువ, సమయస్పూర్తితో ఆడిన క్రికెట్ చూసినవారికి… ఆ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగారనే విషయంలో రివర్స్ అభిప్రాయాలు వచ్చేశాయి. పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇస్తూ ప్రపంచకప్ లో అఫ్గాన్ మరో సంచలన విజయం సాధించింది. నిన్న ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ఆ జట్టు.. ఇప్పుడు పాక్ ను పసికూనను చేసి ఓడించింది.
ఇందులో భాగంగా పాకిస్థాన్ పై ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ (92: 4 ఫోర్లు, 1 సిక్స్), అబ్దుల్లా షఫీక్ (58: 4 ఫోర్లు, 2 సిస్కర్లు) రాణించగా… సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) నిరాశపరిచారు! అయినప్పటికీ చివర్లో షాదాబ్ ఖాన్ (40: 1 ఫోర్, 1 సిక్స్).. ఇఫ్తికార్ అహ్మద్ (40: 2 ఫోర్లు, 4 సికర్లు) మెరుపులు మెరిపించారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్ కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65: 9 ఫోర్లు, 1 సిక్స్), ఇబ్రహీం జాద్రాన్ (74: 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించి మొదటి వికెట్ కు 130 పరుగులతో బలమైన పునాది వేశారు. అనంతరం వచ్చిన రహ్మత్ షా (77*: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హష్మాతుల్లా షాహిది (48*: 4 ఫోర్లు) నిలకడగా ఆడి అఫ్గాన్ కు ప్రపంచకప్ లో చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
ఇక అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా, మహ్మద్ నబీకి ఒక్కో వికెట్ దక్కింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో పాకిస్థాన్ కు హ్యాట్రిక్ దక్కింది! మరోపక్క ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు ఓటములతో ఉన్న సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో నెగ్గితేనే టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.