ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం ఉదయం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నాలుగు జాతీయ (ఆంగ్ల) పత్రికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ అది. అందులోనూ చంద్రబాబు వెనకవుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న ప్రచారానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలుగా నాలుగు జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
తెలుగు మీడియా, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం చేతిలో ఉన్న మీడియా (జాతి మీడియా) చంద్రబాబు భజన చేస్తూనే, జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ, వ్యక్తిగత దాడులకు తెగబడుతోంది. జాతి (తెలుగు) మీడియాలో వ్యతిరేక వార్తలు రాస్తూనే జాతీయ మీడియాలో తమ అనుకూల జర్నలిస్టులు, యాజమాన్యాలతో వ్యతిరేక వార్తలు రాయిస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో విజయవాడ నుండి జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి తొలి భేటీ మంచి ఫలితాలనే ఇచ్చింది. ఇన్నేళ్ళుగా అధికారంలో ఉన్న చంద్రబాబుకు జాతీయ మీడియాలో పరిచయాలు బాగానే ఉన్నాయి. కొందరు జర్నలిస్టులతో వ్యక్తిగత సంబంధాలు, కొన్ని మీడియా సంస్థలతో వ్యాపార సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సంబంధాలతోనే చంద్రబాబు జాతీయ మీడియాను వేదికగా ప్రయోగిస్తున్నారు.
పరిచయాలు లేని కారణంగా జగన్ జాతీయ మీడియాకు కొంత దూరంగా ఉంటున్నారు. ఈ దూరాన్ని చంద్రబాబు, ఆయన అనుచరులు బాగా ఉపయోగించుకొని జగన్ కు వ్యతిరేక వేదికలుగా జాతీయ మీడియాను వాడుకుంటున్నారు. జగన్ అందుబాటులో లేకపోవడం, చంద్రబాబు ఎప్పుడు జానెడు దూరంలోనే ఉండడం జాతీయ మీడియాకు రాష్ట్ర వార్తల విషయంలో అనుకూలంగా ఉంది. అందుకే చాలా జాతీయ పత్రికలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాయి. ఇక్కడ జాతి మీడియా మళ్ళీ అవే వ్యతిరేక వార్తలను ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వాడుకొని చేస్తున్న ప్రచారానికి జగన్ ముఖాముఖి సరైన జవాబు ఇచ్చినట్లయింది. ఇప్పుడు జగన్ బృందం చేయాల్సిన పని ఈ ప్రయోగాన్ని విస్తృతంగా కొనసాగించడం. జాతీయ మీడియాకు జగన్ ను అందుబాటులో ఉంచడం. చంద్రబాబులా “మీడియా మానేజ్మెంట్” జగన్ చేయలేకపోవచ్చు. కానీ కనీసం కొందరు మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉండడం ద్వారా జాతి మీడియా చేసే దాడిని, దుష్ప్రచారాన్ని జగన్ కొంతమేరకు నిలువరించవచ్చు.
Written by Aditya for TeluguRajyam.com