కొత్త పలుకు – కట్టుకథలతో వండివార్చిన గరళం

ABN RK Kothapaluku

పాపం!  ఒక్కోసారి  రాధాకృష్ణ తనను తాను రామోజీరావు స్థాయివాడినని ఊహించుకుంటారు.   పరస్పరం శత్రుభావంతో వ్యవహరిస్తున్న సింహాలవంటి ఇద్దరు నాయకులకు, పార్టీలకు సంధి కుదర్చగలనని భ్రమిస్తుంటాడు.  “గాంధీకి బట్టతల ఉంది నాకూ బట్టతల ఉంది కాబట్టి నేనూ గాంధీ అంతటివాడినే అని విర్రవీగాడట వెనకటికి ఎవడో.. మన రాధాకృష్ణ కూడా అదే బాపతు.  రామోజీరావుకు పేపరుంది నాకూ పేపరుంది కాబట్టి ఢిల్లీ స్థాయిలో మోడీ, అమిత్ షాలతో మంతనాలు జరిపి మోడీకి, చంద్రబాబుకు కలిపి ప్రేమసంకెళ్లు వేద్దామని భావించి గత ఏడాదిన్నరగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

ABN RK Kothapaluku 

మోడీతో చంద్రబాబు బంధం తెంచుకోగానే మోడీ మీద, ఆయన  భార్యమీద కూడా హేళనాపూర్వక వ్యాఖ్యలతో జర్నలిజాన్ని భ్రష్టు పట్టించిన రాధాకృష్ణ, చంద్రబాబును ప్రజలు ఛీకొట్టగానే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అఖండమైన మెజారిటీతో రాగానే ఎక్కడ అవినీతిని తవ్వి తీసి జైలుకు పంపిస్తాడో అని క్షణక్షణం భయంతో వణికిపోతూ మోడీ భజనను ప్రారంభించాడు.  అయితే ఎన్ని సహస్రనామాలు జపించినా, పొగడ్తలతో పొగడదండలతో అలరించాలనుకున్నా, చంద్రబాబుకు కనీసం ఫోన్ ఎత్తుకునే గౌరవం కూడా ఇవ్వడం లేదు మోడీ.  అంతే కాకుండా, చంద్రబాబు వదినెగారు, బద్ధ శత్రువు అయిన శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టడం చంద్రాబు-రాధాకృష్ణ ద్వయానికి పుండు మీద కారం చల్లినట్లయింది.  దాంతో కళ్ళు బైర్లు కమ్మేసి, మైండ్ బ్లాంక్  అయిపోయి, ఆశలు నశించి చివరాఖరుకు వైసిపి-బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ కొత్త కథలు మొదలు పెట్టాడు! 

****

“””ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధాలకు గండి పడిందా? ఈ వారంలో జరిగిన పరిణామాల ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కేంద్ర మంత్రి అమిత్‌ షా హడావిడిగా ఢిల్లీకి పిలిపించుకోవడం, ఆ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అవడం చకచకా జరిగిపోయాయి.””””

ఒక వెనక హెడ్డింగే కలిసి కదనం అంటూ పెడతాడు.  పేరాలోకి వచ్చేసరికి వైసిపి,  బీజేపీ మధ్య సంబంధాలకు గండి పడిందా? అంటూ ప్రశ్నార్ధకాన్ని వదులుతాడు!  జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా పిలిపించుకున్నాడని రాధాకృష్ణకు ఎవరు చెప్పాడో?  అమిత్ షా పిలిపించుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ఏమైనా అమిత్ షా దగ్గర పనిచేసే గుమస్తానా?  లేక ఆయన బీజేపీ నాయకుడా పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి!  అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడానికి, అక్కడ మంత్రులను కలవడానికి  ముందస్తుగా ఎన్ని రకాల కసరత్తులు జరుగుతాయి?  ఎన్ని రకాల అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది?   ముఖ్యమంత్రి వెళ్ళగానే కలవడానికి కేంద్రమంత్రులకు, కేంద్రమంత్రులు పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి ముఖ్యమంత్రికి సమయం కుదురుతుందా?   ఆ మాత్రం ఇంగితం లేదా?

*****

“”””న్యాయ వ్యవస్థను వివాదంలోకి లాగడమే కాకుండా ప్రత్యక్షంగా ఘర్షణకు దిగడాన్ని ఈ సందర్భంగా అమిత్‌ షా తప్పుబట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ పద్ధతి మార్చుకోవాలని జగన్‌ రెడ్డికి కేంద్ర హోం మంత్రి సూచించగా.. ఇంతదూరం వచ్చాక వెనక్కి వెళ్లలేననీ, రాష్ట్రప్రభుత్వం కోరిన విధంగా రాజధాని భూముల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలనీ ముఖ్యమంత్రి వాదించినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా! ఇరువురి మధ్య రెండు దఫాలుగా సమావేశం జరిగినా.. అవగాహన మాత్రం కుదరలేదన్నది ఢిల్లీ వర్గాల సమాచారం.””””

అమిత్ షా తప్పు పట్టినట్లు ఏ పత్రికలో వార్తలు వచ్చాయి?  ఒక్క క్షుద్రజ్యోతిలో వస్తే దేశంలోని అన్ని పత్రికల్లో, ఛానెల్స్ లో వచ్చినట్లేనా?  కనీసం జగన్  ఆగర్భశత్రువు ఈనాడు పత్రిక కూడా అలా రాయలేదే?  తాను కథలు అల్లి, ఆ కథలను అందరికీ ఆపాదిస్తే నమ్మడానికి ఇక్కడ వెర్రివెధవలు ఎవరున్నారు?   ఇక రాధాకృష్ణకు బుర్ర పూర్తిగా చెడిపోయిందని చెప్పడానికి ఆ తరువాత రాసిన వాక్యాలు తెలియజేస్తాయి.  సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి సూచించినా,  తన మీద సిబిఐ కేసులు ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా అమరావతి భూముల కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపించాల్సిందే అని వాదించాడు అని జగన్మోహన్ రెడ్డిని కీర్తించడం ఉంది చూశారూ…..తన రాతలు జగన్ కు ప్లస్ అవుతాయేమో అన్న ఆలోచన కూడా రాధాకృష్ణకు రాకపోవడం విచిత్రమే! 

****

“””ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థపై గుర్రుగా ఉండటానికి హైకోర్టులో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం మాత్రమే కాదనీ, ఆర్థిక నేరస్థులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడమే ప్రధాన కారణమనీ చెబుతున్నారు. ఈ ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. అయితే సంబంధిత పిటిషన్‌పై విచారణను తొలుత జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ చేపట్టారు. ఆయన పదవీ విరమణ తర్వాత పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ తన పిటిషన్‌ను పరిష్కరించవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థించారు. “””””

అయ్యో…జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో రాయాలని, ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తూకూడా తనకు తెలియకుండానే తనవారికి ఎంత అపకారం చేస్తున్నాడో రాధాకృష్ణ ఒకసారి తన వ్యాసాన్ని తానే చదువుకుంటే బాగుంటుంది.  నిజానికి తనమీద పెట్టిన కేసుల విచారణను త్వరగా పూర్తి చెయ్యమని ఏనాడో కోర్టుకు విన్నవించాడు జగన్మోహన్ రెడ్డి.  ఆమాత్రం ధైర్యాన్ని చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ప్రదర్శించారా?  ఏనాడైనా విచారణను సాహసించి ఎదుర్కొన్నారా?  ఇరవై ఏళ్ళనుంచి  తన మీదున్న పద్దెనిమిది స్టేలను తక్షణమే తొలగించి తనమీద విచారణ చెయ్యమని సవాలు విసిరారా?  మరి ఆ పని యువకుడు, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడే! 

మరో విషయం కూడా చెప్పుకోవాలి.   సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్న  జస్టిస్ నూతలపాటి వెంకట రమణను ప్రశంసించబోతూ తన మతిహీన రాతలతో ఆయన అపఖ్యాతి పాలు చేస్తున్నాడు రాధాకృష్ణ.  సుప్రీమ్ కోర్టులో నాలుగేళ్లనుంచి పెండింగ్ లో పిటీషన్  విచారణను జస్టిస్  రంజన్ గొగోయ్ పూర్తి చెయ్యలేదు. అలాంటి కేసును జస్టిస్ రమణ విచారించి ఆదేశాలు ఇచ్చారని చెప్పడం ద్వారా రాధాకృష్ణ ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు?  అమరావతి భూముల కుంభకోణంలో జస్టిస్ రమణ కుమార్తెల పేర్లు ఉండటంతో ఆ కక్షతోనే జస్టిస్ రమణ అలాంటి ఆదేశాలను ఇచ్చారని ప్రజలు నమ్మేట్లుగా లేవా ఆ రాతలు?   తన మిత్రుడైన చంద్రబాబును అధికారంలోనుంచి కూలదోసి అనామకుడిగా మార్చిన జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికే జస్టిస్ రమణ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారని ప్రజలు నమ్మితే ఆ నేరం ఎవరిది?  జస్టిస్ గారి కుమార్తెల పేర్లు ఎసిబి నివేదికలో వచ్చిన మరునాడే అయిదేళ్లనాటి అశ్వని కుమార్ పిటీషను విచారణకు వచ్చిందంటే దానివెనుక మర్మం ఏమిటి?  అయినా ఆ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి కోసమే అని జస్టిస్ రమణ ఎక్కడైనా పేర్కొన్నారా?  సుప్రీం కోర్ట్ ఇచ్చిన  ఆదేశాలకు జగన్ మోహన్ రెడ్డికి రాధాకృష్ణ ముడి వేస్తున్నారంటే అర్ధం ఏమిటి?  

****

Kodali Nani

“””దీన్ని బట్టి అవసరమైతే బీజేపీ పెద్దలతో కూడా ఢీకొనడానికి తాము సిద్ధమేనన్న సందేశాన్ని జగన్‌ రెడ్డి ఇచ్చినట్టుగా భావించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డగోలుగా తిట్టిపోయడానికి కొందరు మంత్రులను, శాసనసభ్యులను ముఖ్యమంత్రి నియమించుకున్నారు. అలాంటివారిలో కొడాలి నాని ముందువరసలో ఉన్నారు. కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని భాష విన్నవారికి ఏవగింపు కలుగుతుంది. “”””

హమ్మయ్య…కేంద్రంలో సంపూర్ణమైన మెజార్టీతో అప్రతిహతంగా పాలిస్తున్న బీజేపిని ఢీ కొట్టడానికి జగన్ సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలను ఎలా వర్ణించాలి?  చంద్రబాబులాగా మోడీ, అమిత్ షా ల కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించకుండా కొదమసింగంలా దూకుడు ప్రదర్శించడం అంటే అది జగన్ ప్రదర్శిస్తున్న పరాక్రమమే అని సామాన్యులకు కూడా బోధపడుతుంది.  ఇక కొడాలి నాని భాష ఎలాంటిదైనా కావచ్చు.  ఆయన భాష రాధాకృష్ణకు ఎందుకు ఏవగింపు కలిగిస్తున్నది?  అదే జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరావు, బోండా, బుద్ధా వెంకన్న జగన్ మీద ప్రయోగించిన భాష ఏవగింపు కలిగించలేదా?   “తన కంపు తనకింపు…పరకంపు పాపిష్టిది” అని పెద్దలు ఏనాడో చెప్పారు కదా! 

 ****

“””” నిజానికి కొడాలి నాని భాష అలా ఉండివుండకపోతే ఆ సామాజికవర్గం నుంచి ఆయనకు మంత్రి పదవిని ముఖ్యమంత్రి ఇచ్చివుండేవారు కాదన్న అభిప్రాయం కూడా ఉంది.”””””

ఓహో…మొత్తానికి ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటే “భాషాప్రవీణ” అర్హత ఉండాలేమో?  మరి దేవినేనికి చంద్రబాబు  మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా?  మొత్తానికి కృష్ణా జిల్లాలోనే ఆ సామాజికవర్గం వారికి మంచి భాష రాదని రాధాకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేసారు.  అలాంటి భాష ఉంటేనే మంత్రి పదవి వస్తుందని ఆ సామాజికవర్గం వారికి సందేశం ఇచ్చేసారు. 

 ****

“””రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి దాని స్థానంలోకి రావాలంటే బీజేపీకి బలమైన ఆయుధం కావాలి. కుల, మత ప్రాతిపదికన ప్రజలను పోలరైజ్‌ చేయడం తేలిక! ముఖ్యమంత్రి జగన్‌ వెనుక క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు హిందువులను తమ వైపునకు తిప్పుకోగలిగితే తెలుగుదేశం పార్టీ ఫినిష్‌ అవుతుందన్నది బీజేపీ నాయకుల అంచనాగా చెబుతున్నారు.”””

 రాజకీయపార్టీలన్నా తరువాత ఒకరినొకరు దెబ్బకొట్టుకోక, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాయా?  “ఎర్ర గురివింద తన నలుపెరుగదు” అన్నట్లు బీజేపీని దెబ్బ కొట్టడానికి మొన్నటి ఎన్నికలముందు చంద్రబాబు ఎన్ని వేషాలు వేశారు?  ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూర్ వెళ్లి ఆ నాయకులను కలిసి, చివరకు తన బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టి బీజేపీని దెబ్బ తియ్యాలని ప్రయత్నాలు చేసిన తీరు రాధాకృష్ణకు గుర్తు లేదేమో కానీ దేశం మొత్తం గుర్తుంది.  ఇప్పటికే జగన్ దెబ్బకు 90  శాతం ఊపిరి కోల్పోయిన తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి బీజేపీ పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు.  కులమత ప్రాతిపదికన జనాన్ని పోలరైజ్ చెయ్యడం అంత తేలికే అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడే కాదు.  ఇటీవల చంద్రబాబు మతాలను గూర్చి మాట్లాడటం వెనుక ఇదే వ్యూహం కాబోలు!  దక్షిణ భారతదేశంలో మతరాజకీయాలు ఎన్నటికీ పనిచేయవు.  అందువల్లనే బీజేపీ నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో కాలు పెట్టలేకపోతున్నది.  

 ***

“””హిందువులలో ఒక వర్గం బీజేపీకి మద్దతుగా నిలిచినంత మాత్రాన రాజకీయంగా జగన్మోహన్‌ రెడ్డికి కలిగే నష్టమేమీ లేదు. నష్టమంటూ జరిగితే తెలుగుదేశం పార్టీకి మాత్రమే! అందుకే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడల్లా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి అనుమతిస్తున్నారు. ఇదే తరహా ఆందోళనలు తెలుగుదేశం పార్టీ చేపట్టి ఉంటే కఠినంగా వ్యవహరించి ఉండేవారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే కేసులకు భయపడి ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. “”””

సెబాస్!  హిందువులు బీజేపీ వైపు తిరగడం వలన జగన్ కు నష్టం లేదని, ఆయనకున్న ఓటు బ్యాంకు చెక్కు చెదరదని రాధాకృష్ణ అంగీకరిస్తున్నారు.  అయితే, మొన్నటి ఎన్నికల్లో హిందువులు కూడా ఎక్కువమంది వైసిపికే ఓట్లు వేశారని బీజేపీకి  నోటా కన్నా తక్కువ ఓట్లు రావడం, ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కనీసం ధరావత్తు కూడా దక్కకపోవడం స్పష్టం చేశాయి!  ఇక తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేస్తూ దోపిడీ చేస్తూ బతకడమే తప్ప అధికారంలో లేనపుడు కేసులకు భయపడి బయటకు కూడా రారని రాధాకృష్ణ తెలుగుదేశం పరువును తీసేసారు! 

 “””బీజేపీలో ఉన్న చంద్రబాబు వ్యతిరేకులంతా ఇటీవల కాలంలో క్రియాశీలకం అయ్యారు. విగ్రహాలను ధ్వంసం చేసిన సందర్భాలలో కూడా ముందుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టి, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మీదకు వెళుతున్నారు.”””

భళా!  “బీజేపీలో చంద్రబాబు వ్యతిరేకులంతా…”    హహహ.  అంటే బీజేపీలో చంద్రబాబు అనుకూలురు, బానిసలు కూడా ఉన్నారని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా!  బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగానే సిబిఐ వేటాడుతున్న ఎంపీలను బీజేపీలోకి పంపించి, తన చెంచాలైన కొందరు  భ్రష్టచరితులను బీజేపీలో చేర్చి చర్మాన్ని రక్షించుకోవడం కోసం ఎన్ని విధాలా ప్రాధేయపడినా మోడీ కరుణించడం లేదు.  కన్నా లక్ష్మీనారాయణ ఉన్నంతవరకూ బీజేపీలో చంద్రబాబు బానిసలదే ఆధిపత్యం అని,  వీర్రాజు వచ్చిన తరువాత చంద్రబాబు వ్యతిరేకులది పై చేయి అయిందని వాపోతున్నాడు రాధాకృష్ణ!  హతవిధీ!   కాలం ఎల్లప్పుడూ ఒకేతీరుగా ఉండదు కదా?

 ****

“””దేవాలయాలకు చెందిన రథాలను నాణ్యమైన కలపతో కాకుండా మునగచెట్టు, జిల్లేడు చెట్టుతో చేయిస్తారా? జరుగుతున్న దాన్ని బట్టి మన స్వాములలో కొందరు సర్వసంగ పరిత్యాగులు కాదని నమ్మాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రులు తమ వద్దకు రావాలనీ, తద్వారా తమ పరపతి పెరగాలనీ సదరు స్వాములు కోరుకుంటున్నట్టుగా ఉంది. సన్యసించినవారికి రాజకీయాలు ఎందుకు? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. హిందూ ధర్మాన్ని మాత్రమే మనసా, వాచా ఆచరించే మఠాధిపతులు, పీఠాధిపతులు సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు. రాజకీయాల రంగులు అంటించుకోరు. “””

హయ్యో…నాణ్యమైన కలపతో చేయించమని సలహా ఇవ్వడం కూడా తప్పేనా?  ఒకవేళ చంద్రబాబు అధికారంలో ఉంటె మునగచెట్టు, జిల్లేడు చెట్టుతోనే రధాన్ని చేయించి దానికో పదికోట్లు నొక్కేసి ఉండేవాడేమో!  అమరావతి గ్రాఫిక్స్  చూపిస్తూ ఐదేళ్లు ప్రజలను మోసం చేసిన చంద్రబాబును దృష్టిలో ఉంచుకుని విశాఖ స్వామీజీ ఆ సలహా ఇచ్చి ఉంటారు.   సన్యసించినవారికి  రాజకీయాలు ఎందుకు అని హాశ్చర్యపోతున్న రాధాకృష్ణ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సన్యాసం తీసుకున్న మఠాధిపతి అని తెలియకపోవచ్చు.  అలాగే ఉమాభారతి, సాధ్వి  ప్రజ్ఞా కూడా సన్యాసం తీసుకున్నవారే.  తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రగల్భాలు పలికి ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిపూర్ణానందం కూడా సన్యాసే!  వారిని ప్రశ్నించడానికి కలలో కూడా సాహసం చెయ్యని రాధాకృష్ణ విశాఖ స్వామివారిని విమర్శిస్తున్నారంటే ఆయన చంద్రబాబు దుర్మార్గాలను వ్యతిరేకిస్తారు కాబట్టే! 

***

మొత్తానికి తన పలుకు ద్వారా రాధాకృష్ణ చెప్పదలచుకుంది ఏమిటంటే…జగన్ ఎవ్వరికీ భయపడడు.  కేసులకు, విచారణలు జంకడు.  సాక్షాత్తూ ప్రధానమంత్రి చెప్పినా ఖాతరు చెయ్యడు.  మతవిద్వేషాలతో జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చెయ్యడం సాధ్యం కాదు.  ఎవరో దుండగులు రధాన్ని తగలబెడితే నాణ్యమైన కలపతో వెంటనే రధాన్ని తయారు చేయిస్తూ హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నారు.  జస్టిస్ రమణ ప్రస్తావన తెచ్చి ఆయన  మీద బురద చల్లాడు.  అంతేగా బాధాకృష్ణా!

 

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు