తండ్రితనం కోల్పోయావ్.. నీకేం మిగిలింది మారుతీరావ్ (కవిత)

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ ని మామ మారుతీరావు దారుణంగా హత్య చేయించాడు. తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మానవత్వం మరచి, తండ్రితనం కోల్పోయి మారుతీరావు నీచాతినీచమైన పనికి ఒడిగట్టాడు. యావత్ సమాజం ముందు దోషిగా నిలబడ్డాడు. కన్నబిడ్డ థూ అని మొహం మీద ఉమ్మేసినంత పనిచేసింది. సొసైటీ మొత్తం మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది. 

ఈ పరిస్థితుల్లో సీనియర్ జర్నలిస్ట్, కవయిత్రి నస్రీన్ ఖాన్ రాసిన కవిత. కింద ఉంది చదవండి.

 

తండ్రితనం కోల్పోయావ్

కులానికి పుట్టిన దురహంకారమా…
మనువు ఇచ్చిన అంతరాన్ని ఇంకించుకుని
మానవత్వానికి మచ్చగా మిగిలావ్

మతమిచ్చిన ఉ’న్మదం’తో
డబ్బిచ్చిన పరువు కత్తితో
రక్త ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నావ్

సమాజమిచ్చిన హోదాకోసం
కన్నబిడ్డ కలల్ని ఒక్క వేటుకి మట్టుబెట్టిన నీవైనా ఆరడుగుల జాగాలోనే అంతమవుతావ్

మిగిలిందిక నీ ఒడిలో నిదురించిన పసిబిడ్డ కన్నీటి వేడుక, చూసి తరించు
ఆమె కన్నుల్లోని ధారని
నీ వికృత మనసుకు ఓదార్పునిస్తుందేమో

పెద్దరికం మాటున బోసి నవ్వుల చంటితనం కనులారా వీక్షించి ఉండవు
అమృత గొంతు పిలిచిన ‘నాన్న’నే పిలుపునీ కప్పేసిందా అంతరాల జబ్బు

వెంటాడి వేటాడిన నీ పరువుకు
మిగిలిందిపుడో సామాజిక వెలివేత
అవును,
తండ్రితనం కోల్పోయిన విచక్షణ హీనుడికి సమాజమివ్వాల్సిందీ వెలివేతే!

 

-నస్రీన్ ఖాన్
17.09.2018