తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో రైతులనుంచి నలభై వేల ఎకరాల భూములను బలవంతంగా లాగేసుకోవడం, అస్మదీయులకు ఒకరకమైన భారీ పరిహారం, తస్మదీయులకు మరొకరకమైన తక్కువ పరిహారం ప్రకటించడం, నవనగరాల పేరుతో నయవంచనకు పాల్పడటం, వందిమాగధులతో ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో జల్సా పర్యటనలు చేస్తూ ఒకరోజు సింగపూర్, మరొకరోజు టోక్యో, ఇంకొకరోజు లండన్ అమరావతిలో కొలువవుతున్నదంటూ భజన మీడియాతో ఊదరగొట్టిస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాక కోట్ల రూపాయల దోపిడీకి తెగించారని ఆరోపణలు వినిపించాయి.
సంక్షేమ పథకాలకు చెల్లు చీటీ రాసి, స్వీయ సామాజికవర్గ సంక్షేమమే లక్ష్యంగా సాగించిన దుష్పరిపాలన ఫలితంగా గ్రామస్థాయిలో కూడా జన్మభూమి కమిటీల పేరుతో మహమ్మద్ గజనీ తరహా దోపిడీ సాగించారు తెలుగుదేశం నాయకులు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇసుకాసురుల అవతారం ఎత్తి వందలకోట్ల రూపాయలు స్వాహా చేశారు. కొందరు నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వంద రూపాయలు కోట్ చెయ్యాల్సిన చోట వెయ్యి రూపాయలు కోట్ చేసి కోట్లు కోట్లు మింగేశారు. సాక్షాత్తూ చంద్రబాబు కట్టించిన సచివాలయం, శాసనసభ వర్షం వస్తే పూరిపాకలకన్నా ఘోరంగా నీరు కారుతూ జలపాతాలను తలపించాయి. ప్రత్యేకహోదాను, పాకేజీని మోడీ పాదాలవద్ద తాకట్టు పెట్టేసారు. పొరుగు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఓటును కొనుగోలు చెయ్యడానికి అయిదు కోట్ల రూపాయలు ఆఫర్ చేసారంటే చంద్రబాబు పాలనలో దోపిడీ ఆకాశమే హద్దుగా సాగిపోయిందని చెప్పాలి. రాజకీయంగా కూడా ప్రతిపక్షం నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులను కొన్నట్లు కొనేసి ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారు చంద్రబాబు. చంద్రబాబు విసిరేసే ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఒక వర్గం మీడియా నిస్సిగ్గుగా చంద్రబాబు భజనలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడమే లక్ష్యంగా పనిచేశాయి.
చంద్రబాబు కబంధ హస్తాలనుంచి రాష్ట్రాన్ని రక్షించే ఆపద్బాంధవుడికోసం రాష్ట్రమంతా ఎదురు చూస్తున్నవేళ నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మూడేళ్ళక్రితం ఇదే తేదీన ఆరుమాసాల ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుమల స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకుని జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ఇంతింతై వటుడింతై అన్నట్లు శుక్లపక్ష చంద్రుడిలా దినదినప్రవర్ధమానమవుతూ ఏడాదికి పైగా సాగింది. సుమారు మూడు కోట్లమందిని ప్రత్యక్షంగా కలిసి వారి సాదకబాధకాలను విన్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సభలో నవరత్నాలను ప్రకటించారు. ఆ నవరత్నాల హారమే నేడు జగన్ ప్రభుత్వానికి భగవద్గీతగా మారింది. పదమూడు జిల్లాలను చుట్టేసి అన్ని వర్గాల ప్రజలను, ఆపన్నులను కలుసుకుని వారి కష్టాలు తెలుసుకుని కన్నీరు తుడిచారు. సుమారు మూడువేల ఆరువందల యాభై కిలోమీటర్లు సాగిన ఆ మహాపాదయాత్ర రాష్ట్ర రాజకీయాల చరిత్రను మలుపు తిప్పింది. జగన్మోహన్ రెడ్డి విజయానికి లోతైన పునాదులు వేసింది. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని సుస్థిరం చేసి దేవతగా మార్చేసింది.
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి రెండు జ్ఞాపకాలను ఇక్కడ పంచుకుంటున్నాను. రాష్ట్రంలోని మీడియా కట్టగట్టుకుని జగన్ పాదయాత్రను కవర్ చెయ్యకుండా కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డిని వీలైనంతవరకు దూరంగా ఉంచుతున్న వేళ, వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శిగా ఉన్న శ్రీ దేవరకొండ రామభాస్కర్ నన్ను అనేకమార్లు కలిసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా అభ్యర్ధించారు. రెండుమూడు నెలలపాటు నా వెంటపడ్డారు. జగన్ ను కలవడం నాకు సాధ్యం కాదని నేను ఆయనతో చెప్పాను. అప్పుడు రామభాస్కర్ గారు జగన్మోహన్ రెడ్డిని నేను కలవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఒకరోజు పదిహేను నిముషాల సమయం ఇప్పించారు. జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం అనే గ్రామం దగ్గర జగన్ తో కలిసి నడుస్తూనే ఆయన్ను ఇంటర్వ్యూ చేసి నా టైం లైన్ లో ప్రచురించాను. కనీసం పదిలక్షలమంది ఆ ఇంటర్వ్యూని చదివారు. వేలాదిమంది షేర్లు చేసుకున్నారు.
మరొక సందర్భంలో మేము సింగపూర్ వెళ్ళినపుడు అక్కడి వైసిపి కన్వీనర్లు మమ్మల్ని హోటల్లో కలిసి జగన్ పాదయాత్ర సందర్భంగా ఒక కవరేజ్ లాంటిదాన్ని సీరియల్ గా వ్రాయమని కోరగా అంగీకరించాను. జగన్ పాదయాత్ర మొత్తాన్ని డెబ్బై అయిదు భాగాల సీరియల్ గా వ్రాశాను. అది కూడా లక్షలాదిమందికి చేరింది.
ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీయుతులు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గార్లకు, ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు