20 లక్షల కోట్లలో ప్రజలకు మిగిలింది సున్నాలే

 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ఆర్ధిక వ్యవస్థ ఉద్దీపనకు భారత ప్రభుత్వం రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించారు. అయితే వాటి వివరాలు మాత్రం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తారని ప్రకటించారు. 
 
ప్రధాని చెప్పిన 24 గంటలోపే ఆర్ధిక మంత్రి ఈ దేశ ప్రజలకోసం, ప్రగతికోసం ఆర్ధిక ఉద్దీపన ప్రకటించేశారు. అయితే ప్రధాని చెప్పిన 20 లక్షల కోట్లలో 7 లక్షల కోట్లు తగ్గించేసి కేవలం 13 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపనే ప్రకటించారు. అదికూడా చిన్నా, పెద్దా పారిశ్రామిక వేత్తల దోసిట్లో పోసి చేతులు దులిపేసుకున్నారు. 
 
ఆర్ధిక ఉద్దీపన వస్తుందని, రెండు నెలలుగా వేతనాలు, జీతాలు లేక అల్లాడుతున్న 13 కోట్ల నిరుపేద భారత ప్రజలకు పెద్దలు మొండి చేయి చూపించారు. ప్రకటించిన 13 లక్షల కోట్లల్లో ఒక్క రూపాయి కూడా 13 కోట్ల నిరుపేద (BPL) కుటుంబాలకు ఇవ్వలేదు. ఇంకా రోడ్డుమీదే ఉన్న లక్షలాది రోజుకూలీలను రోడ్డుమీదనే వదిలేశారు. 
 
తట్టా, బుట్టా తీసుకుని పిల్లా జల్లను ఎత్తుకొని రోడ్డునపడ్డ బడుగు జీవులకు ఉద్దీపన గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం సమర్ధనీయం కాదు. ఇప్పుడు దేశంలోని నిరుపేద (BPL) కుటుంబాల్లో రూపాయి కూడా లేదు. తిండి గింజలు లేవు. ఖాళీ కడుపులతో రోడ్డుమీద కొందరు, ఇళ్ళల్లో కొందరు అల్లాడుతున్నారు. ఇప్పటికే కొందరు రోడ్డుపై నడుస్తూ ప్రాణాలు విడిచారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించేందుకు తమ శ్రమ దానం చేస్తున్న ఈ నిరుపేదలు ఆగిపోయిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా నడుస్తూనే ప్రాణాలు వదిలిన వారు చాలా మంది ఉన్నారు. 
 
ఆగిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిందే. అందుకు ప్రభుత్వం చేయూత ఇవ్వాల్సిందే. కానీ ఆగిన బ్రతుకులను గాడిలో పెట్టాల్సిన  అవసరం లేదా? ఈ శ్రమ జీవుల బతుకులు ఉద్దరించకపోతే తాము ఉద్ధరించిన పరిశ్రమలు ఎలా నడుస్తాయి? అయినా పేదోడి చేతిలో రూపాయి ఉంటేనే కదా అది మార్కెట్లో తిరుగుతూ దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తుంది! మంచంమీద దిండుల్లోనో, గోడలలోపల ఇటుకల మధ్యనో, సీలింగ్ చాటునో, ఇనుప బీరువాల్లోనో, బ్యాంకు లాకర్లోనో మూలిగే నగదు ఈ దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించదని, పేదోడి చేతిలో రూపాయి మాత్రమే నడిపిస్తుందని పాలకులకు తెలియకపోతే ఎలా? 
 
మొత్తం మీద మధ్యతరగతి ప్రజలను ఇళ్ళల్లో, పేదలను రోడ్డుమీద పెట్టిన ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఉద్దీపనలు ప్రకటించి గొప్ప ఆర్ధికవేత్తలం అని చెప్పుకోవడం, తమ భుజాలు తామే చరుచుకోవడం, తమకు తామే కితాబులు ఇచ్చుకోవడం కరోనా హాస్యంగా వర్ధిల్లుతోంది.