విజయసాయి రెడ్డిగారికి కోర్టులంటే అంత యావగింపు ఎందుకో ? 

YSRCP MP Vijay Sai Reddy
అదేమిటో కానీ కోర్టులంటేనే వైకాపా నేతలకి అస్సలు పడదు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదే యావగింపు, అధికారంలో ఉన్నా అదే యావగింపు.  తమ అభిష్టానికి వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు.  మరీ ముఖ్యంగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిగారికైతే కోర్టులన్నా, వాటి ఉత్తర్వులన్నా మరీ నవ్వులాట అయిపోయింది.  ప్రతిపక్షం టీడీపీని విమర్శించాలనే తహతహలో కోర్టు ఉత్తర్వుల్ని కూడా అపహాస్యం చేస్తున్నారాయన.  
 
వైకాపా సర్కార్ అమరావతి భూములను పేదలకు పంచాలని భావించింది.  కానీ రైతుల తరపున హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి.  రాజధాని భూములను ఉచితంగా ఎలా పంచుతారు అంటూ పంపకాలపై హైకోర్ట్ స్టే ఇచ్చింది.  అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్ సర్కార్ ఎన్నికలనాడు పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీ కోసం ఆ స్థలాలనే వాడాలనుకుంది.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేదల కోసం అమరావతి పరిసర గ్రామాల్లో 4000 ఎకరాలను సేకరించడానికి సంసిద్దమైంది.  
 
దీంతో రాజధాని రైతులు రాజధాని నిర్మాణం కోసం తాము ఇచ్చిన భూములకు పరిహారంగా తమకు ఇంకా ప్లాట్లు కేటాయించలేదు కానీ గుంటూరు, కృష్ణా వాసులకి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇక్కడే ఇవ్వాలా అంటూ అందోళనకు దిగారు.  ప్రతిపక్షం టీడీపీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలకు పూనుకుంది.  ఇంకా రాజధాని విషయంలో ఒక క్లారిటీ రాకముందే ఇలా రాజధాని భూములను ఎన్నికల హామీ పేరుతో పంచి పెట్టాలని అనుకోవడం నిజంగానే సమంజసం కాదు.  
 
అన్ని గొడవలు ముగిసి రాజధానిగా అమరావతిని రద్దు చేస్తే, అక్కడ భూములిచ్చిన రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తే ఆ తర్వాత ఇతర ప్రాంతాల పేదలకు అక్కడ భూములు పంచవచ్చు.  కానీ వైకాపా సర్కార్ విషయం తేలకుండానే పంపకం చేయాలనుకుంది.  అందుకే కోర్ట్ స్టే ఇచ్చింది.  కానీ విజయసాయి రెడ్డిగారు మాత్రం కోర్ట్ స్టే ఇవ్వడం ఏదో టీడీపీ విజయం అనే రీతిలో వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ ‘పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం పట్టుకుంది బాబుకు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట.  రాజధానిలో పేదలకు పట్టాలివ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం ఉత్సాహం నింపిందని అంటున్నారు’ అన్నారు.  
 
ఆయన ట్వీట్ చూస్తే ఏదో ప్రభుత్వ పనికి న్యాయస్థానం ప్రతిపక్షంతో కుమ్మక్కై అడ్డుతగులుతోంది, దానికి ప్రతిపక్షం సంబరపడుతోంది అనే భావనను వ్యక్తపరిచనట్టుంది.  అయినా రాజ్యసభ సభ్యుని హోదాలో ఉన్న విజయసాయి రెడ్డిగారికి ఇలా కోర్టు ఉత్తర్వులను ప్రతిపక్షానికి ఆపాదించి అవి తప్పన్నట్టు మాట్లాడటం హుందాతనం అనిపించుకోదు.