బిజెపి – వైకాపా చెలిమి రఘురామ రాజుతో తేలిపోతుందా?

YSRCP and BJP Friendship tested by MP Raghu Raju

2019 ఎన్నికల మునుపు బిజెపి వైకాపా సంబంధాలు “నువ్వునేను” అన్నట్లు వుండేటివి. చంద్రబాబు నాయుడు ప్రధాని మోడిపై చేసిన వ్యక్తి గత విమర్శలు జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసోచ్చాయి. అందుకేనేమో ఇటీవల రాష్ట్ర స్థాయిలో బిజెపి – వైకాపా సంబంధాలు చెడిన తర్వాత బిజెపి నాయకుడు ఒకరు మా సపోర్టు లేనిదే ఇంతగా గెలిపొందే వారాఅని వైకాపాను దెప్పొడిశారు. ఇది గతం.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కొద్ది నెలలకే రాష్ట్రంలో బిజెపి – వైకాపా రెండు పార్టీల మధ్య ఉప్పునిప్పు అయింది. అయినా రాష్ట్ర జాతీయ స్థాయిలో బిజెపిలోని కొందరు నేతలు జగన్మోహన్ రెడ్డి కొమ్ముకాసే విధంగా ప్రకటనలు ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో బిజెపి నేతలు తద్విరుద్దంగా వైకాపాపై దాడులు సాగిస్తూ ప్రకటనలు చేసేవారు. తుదకు ఏమైందో ఏమో గాని రాష్ట్ర బిజెపి నేతల ప్రకటనలకు విరుద్ధంగా రాజధాని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని ప్రకటన చేసిన జివియల్ నరసింహారావు కూడా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టారు. రాం మాధవ్ కూడా సరేసరి. రాష్ట్రంలో వైకాపా యెడల మెతక వైఖరి అవలంభించుతుండిన కొందరు బిజెపి నేతలు కూడా ఇప్పుడు కొంత కటువుగా వుంటున్నారు. విశాఖకు చెందిన విష్ణు కుమార్ రాజు మరీ ముందుకు పోయి టిడిపి ఎమ్మెల్యే అచ్చమ నాయుడు అరెస్టు తీరును ఖండించారు. ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు వస్తూనే వున్నారు .

Read More : టీటీడీలో అన్యమత ప్రచారం.. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయ్

ఇదిలా వుండగా అనుకోని విధంగా సాక్షాత్తు ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దీనితో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బిజెపి – వైకాపాల మధ్య సంబంధాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంత క్రితమే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అపాయింట్ మెంట్ ఆఖరు గడియల్లో రద్దు చేయడమూ జరిగి వుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. అంతా గతం.

ఇప్పుడు తాజాగా రెండు పార్టీల మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వుండే సంబంధాలకు అగ్ని పరీక్షగా నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణ రాజు ఎపిసోడ్ వుండబోతోంది. గత పక్షం రోజులుగా రఘు రామ కృష్ణ రాజు వ్యవహార సరళి చేస్తున్న ప్రకటనలు వైకాపాకు తను బుద్దుడు అంటూ చెలరేగి పోయి చేస్తున్న తీరు గమనించితే కయ్యానికి కాలు దువ్వే విధంగా వుంది. అంతేకాదు. కేంద్ర బిజెపి నాయకత్వం వద్ద గట్టి హామీ లభించకుంటే ఇంతగా చెలరేగి పోయే వారు కాదేమో.. లేకుంటే సామాజిక ఫింఛన్ల అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తారా? రోజూ పుండును కెలికి కారం రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నేత ఇతన్ని పార్టీలో వుంచుకుంటారని భావించలేము. అయితే కింకర్తవ్యం ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Read More : JFW క‌వ‌ర్: శ్రుతి సెల్ఫ్‌ క్రియేటివిటీ చూశారా?

వైకాపా పార్లమెంటు సభ్యుల బృందం లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘు రామ కృష్ణ రాజుపై వేటు వేయమని కోరింది. మరి స్పీకర్ ఏం చేస్తారు? ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన అగాధం పక్కన పెడితే ప్రస్తుతం రెండు అంశాలు ప్రాముఖ్యత కలిగి వున్నాయి. ఒకటి. రాజ్యసభలో బిజెపికి మెజారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి మద్దతు తప్పని సరి. మున్ముందు వైకాపా గతంలో అన్నాడియంకె లాగా ఎక్కువ మంది రాజ్య సభ సభ్యులను కలిగి వుండే పరిస్థితి వుంది. ఏది ఏమైనా రాజ్యసభలో తన మద్దతు కోసం బిజెపి వెంపర్లాడక తప్పదనే ధైర్యమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముందుకు నడిపిస్తోంది. తనపై వున్న సిబిఐ కేసుల అంశంలోనూ రాష్ట్ర ఆర్థిక లోటు పూడ్చుకొనే అంశంలోనూ ఇతరత్రా దూకుడు పెంచడంలోనూ ఇది సుదర్శన చక్రంగా వుంటుందని భావించునట్లుంది. ప్రత్యేక హోదా ప్రస్తావనకు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ అంశం వెల్లడించి వున్నారు. రఘు రామ కృష్ణం రాజుపై అనర్హత వేటు పడాలంటే ప్రధాన మంత్రి సలహా లేకుండా జరిగే పని కాదు.

Read More : సీఎం కేసీఆర్ ట్రంప్ లా ఆలోచిస్తున్నారా?

ఇదిలా వుండగా రఘు రామ కృష్ణ రాజు “హలో రాజుగారు” అని ప్రధాని చేత పిలిపించుకున్న మైకంలో వున్నట్లుంది. మరి ఎంత వరకు రఘు రామ కృష్ణ రాజును” హలో రాజు గారు” కాపాడుతుందో వేచి చూడాలి. 2014 తర్వాత అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు లేనిదే కించిత్తు చర్య అమలు జరిపిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ వుంటే నిధులు లేవని చెబుతూ మరో పక్క బీహార్ లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వ్యతిరేకించినా తమిళ నాడులో లబ్ది పొందేందుకు గోదావరి జలాల తరలించే పథకానికి డిపిఆర్ రెడీ చేసి కాచుకు వున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంశంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే రఘు రామ కృష్ణ రాజు అంశంలో లోక్ సభ స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఒక విధంగా జాతీయ స్థాయిలో వైకాపా బిజెపి పార్టీల మధ్య సంబంధాలకు గీటురాయిగా వుండబోతోంది.

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013