టిడిపి హయాంలో వైకాపా జనసేన మధ్య పెద్ద యుద్దమే జరిగింది.ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఇటీవల కాలంలో కొంత విరామమున్నా తిరిగి రడగ మొదలైంది. గత ప్రభుత్వం హయాంలో అమలు జరిగిన 5 శాతం కాపు రిజర్వేషన్ అమలు చేసి తీరాలని పవన్ కళ్యాణ్ పదునైన ఆయుధం సంధించారు. “మమ్మల్ని ఎవరూ ఉద్దరించనక్కర లేదు. మా ఆత్మాభిమానం దెబ్బ తినేలా జాలి చూప నక్కర లేదు. మాకు గతంలో వున్న రిజర్వేషన్ ను పునరుద్దరించమని అడుగుతున్నాము అని అంటున్న కాపులకు జగన్ ఏం సమాధానం చెబుతారని” పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో నిలదీశారు.
ఈ సందర్భంలో రెండు అంశాలు తెర మీదకు వచ్చాయి. ఒకటి చంద్రబాబు నాయుడు అమలు జరిపిన అయిదు శాతం రిజర్వేషన్ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని కాపులను రెచ్చ గొట్టినట్లయింది. . రెండు. గతంలో పవన్ కళ్యాణ్ కాపుల గురించే ప్రత్యేకంగా డిమాండ్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మున్ముందు కాపుల రిజర్వేషన్ల అంశంపై ఉద్యమాలు మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే మూకుమ్మడిగా వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై ఎదురు దాడి ప్రారంభించారు.
Read More : రాజకీయంగా ఎదుర్కోలేక చంపేసారు:మంత్రి నాని!
అప్పట్లో – ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు కాపు ఓట్లు జన సేన చీల్చితే తమకు నష్టం జరుగుతుందని వైకాపా అధిష్టానం వర్గం భావించి పలు రూపాల్లో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోరు సాగించింది. వైకాపా నేతలతో పాటు ముఖ్యంగా వైకాపా సోషల్ మీడియా సైన్యం పవన్ కళ్యాణ్ పై అతి తీవ్ర మైన దాడులు సాగించాయి. చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయినట్టు రకరకాల పేర్లతో తిట్ల దండకం సాగించారు. తన కుటుంబాన్ని కూడా కించ పరుస్తూ సోషల్ మీడియాలో చెలరేగి పోతున్నారని పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన సందర్భముంది. ఇది గతం.
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజేతగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతి పక్షాలు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. తదుపరి వామపక్షాలకు గుడ్ బై చెప్పి బిజెపి పంచన చేరడం ఆపై సినిమా షూటింగ్ ల్లో బిజీ కావడంతో వైకాపా జనసేన మధ్య రాజకీయ రగడ సద్దు మణిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయ విశ్రాంతి తీసుకోవడంతో ఆ స్థానాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భర్తీ చేశారనే వ్యాఖ్యానాలు లేక పోలేదు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు మించి రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైకాపా ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోయడం మనమెరుగుదుం.
Read More : నాగబాబు నమ్మకం ఆ పార్టీ నిలబెడుతుందా?
ఇది ఎందుకు గుర్తు చేయ వలసి వస్తున్నదంటే గతంలో పవన్ కళ్యాణ్ పై సంధించిన అస్త్రాలనే వైకాపా కన్నా లక్ష్మీనారాయణపై గురి పెట్టింది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ చర్చ నడిచింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు గురించి మాట్లాడే ప్రతి వారిని కన్నా లక్ష్మీనారాయణతో పాటు తుదకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లాంటి వారిని కూడా జత పర్చి చంద్రబాబు నాయుడు ఏజెంట్లుగా చిత్రించి సమస్యను పక్కదారి పట్టించడం మామూలు అయింది. తిరిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెర మీదకు వచ్చారు. గతంలో లాగా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు ముద్ర వేసే అవకాశం లేక పోయినా మరో రూపంలో వైకాపా మంత్రులు రంగంలో దిగారు.
ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలు అమలు సందర్భంగా కాపులకు కేటాయించిన నిధులు కాపు రిజర్వేషన్ అంశంపై తిరిగి పవన్ కళ్యాణ్ వర్సస్ వైకాపా మధ్య వాగ్యుద్దం మొదలైంది. ఈ సమస్యపైననే వైకాపా టిడిపి మధ్య కూడా మాటల యుద్ధం సాగుతున్న దశలో పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం చేసి కాపులు చిరకాలంగా డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేయడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. నిధులు కాదు. రిజిస్ట్రేషన్ కావాలని కోరారు.
Read More : మంచు ఫ్యామిలీతో మెగా హీరో వియ్యం?
రాష్ట్రంలో కులాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బరోసా ఇళ్ల పట్టాల పంపిణీకి చెందిన నిధులు అమ్మ ఒడి తదితర పథకాలను కూడా జత చేర్చి కాపులకు 4770 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్లు చూపడం మోసపూరితమని టిడిపి నేతలు ఇప్పటికే ఆరోపణలు చేసి వున్నారు. . అయితే పవన్ కళ్యాణ్ దీనికి తోడు కాపు రిజర్వేషన్ అంశం ప్రముఖంగా తెర మీదకు తీసుకు రావడంతో వైకాపా ఇరుకున పడింది. చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు ప్రకటించిన ఇడబ్లుసి కోటా పదిశాతంలో అయిదు శాతం కాపులకు కేటాయించి శాసన సభ శాసన మండలిలో ఆమోదించి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అది పెండింగ్ లో వుంది.
ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హయాంలో ఆమోదింపబడిన అయిదు శాతం రిజర్వేషన్ అమలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా వైకాపా కాపు మంత్రులు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. మునుపటి లాగా చంద్రబాబు నాయుడు ఏజంట్ అని నిందించ లేక పోతున్నారు గాని అప్పట్లో చంద్రబాబు నాయుడును ఎందుకు నిలదీయ లేదని ఎదురు దాడి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే కాపులను సంత్రుప్తి పర్చుతుందా? మున్ముందు పవన్ కళ్యాణ్ కాపులను ఏమేరకు రెచ్చ గొట్ట కలుగుతారు? ఇవన్నీ అటుంచి పవన్ కళ్యాణ్ వర్సస్ వైకాపా మధ్య రాజకీయ పోరు తథ్యమనిపిస్తోంది. ఈ లోపు బిజెపి స్పందన ఏలా వుంటుందో చూడాలి. ఈ పాటికే బిజెపి జాతీయ నాయకత్వం కూడా జగన్ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నందున రాష్ట్ర రాజకీయం రంజుగా వుండబోతోంది. కొసమెరుపు ఏమంటే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ను పైగడటం.